Coaching Centers – కోచింగ్ సెంటర్ లకు కేంద్ర నూతన మార్గదర్శకాలు ఇవే

BIKKI NEWS (JAN. 19) కోచింగ్ సెంటర్ లకు కేంద్ర విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు జారీ (New guidelines for private coaching centers by central government) చేసింది. ఈ మార్గదర్శకాలప్రకారం పదహారేళ్ల కంటే తక్కువ వయసున్న విద్యార్థులను శిక్షణ సంస్థలు చేర్చుకోకూడదని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ర్యాంకులు, మార్కుల గురించి తప్పుదోవ పట్టించే ప్రకటనలేవీ ఇవ్వొద్దనీ స్పష్టం చేసింది.

వివిధ కోర్సులు, ఉద్యోగార్హత పరీక్షలకు శిక్షణనిచ్చే ప్రైవేటు కోచింగ్‌ సెంటర్ల సంఖ్య దేశంలో భారీగా పెరుగుతుండటం, వాటిలో మౌలిక వసతులు కొరవడుతుండటం, తీవ్ర ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు అధికమవుతుండటంపై కేంద్రానికి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో విద్యాశాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.వాటిలో ముఖ్యమైనవి ఇవీ.

★ GUIDELINES

మాధ్యమిక పాఠశాల విద్య పూర్తిచేసిన తర్వాతే విద్యార్థులను చేర్చుకోవాలి.

గ్రాడ్యుయేషన్‌ కంటే తక్కువ విద్యార్హత ఉన్నవారిని ట్యూటర్లుగా నియమించుకోకూడదు. దుష్ప్రవర్తన సంబంధిత నేరాలకు పాల్పడినవారినీ ఆ విధుల్లోకి తీసుకోకూడదు.

సిబ్బంది విద్యార్హతలు, శిక్షణ అందించే కోర్సులు, వసతి సౌకర్యాలు, ఫీజు రీఫండ్‌ సంబంధిత సమాచారాన్ని శిక్షణ సంస్థలు తమ వెబ్‌సైట్‌లలో పొందుపరచాలి.

ర్యాంకులు, మార్కుల గురించి విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఇవ్వకూడదు.

మానసిక ఒత్తిడిని అధిగమించడంలో విద్యార్థులకు దోహదపడేందుకు చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం మానసిక నిపుణులు, కౌన్సిలర్ల సహాయం తీసుకోవాలి. తమవద్ద సేవలందించే సైకాలజిస్టులు, కౌన్సిలర్ల పేర్లను విద్యార్థులు, తల్లిదండ్రులకు ముందే తెలియజేయాలి.

నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా కౌన్సిలింగ్‌ వ్యవస్థ లేనిపక్షంలో శిక్షణ సంస్థను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం కుదరదు.

విద్యార్థులు మొత్తం ఫీజును ముందే చెల్లించి, మధ్యలో కోర్సును ఆపేస్తే.. మిగిలి ఉన్న కాలానికి తగ్గట్టు రుసుమును వారికి తిరిగి ఇచ్చేయాలి. హాస్టల్‌ ఫీజు, మెస్‌ రుసుముల వంటివాటికీ ఇదే వర్తిస్తుంది.

ఒకసారి కోర్సు ప్రారంభమయ్యాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజును పెంచకూడదు. ముందు కుదుర్చుకున్న ఒప్పందానికే కట్టుబడి ఉండాలి.

నూతన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన మూడు నెలల్లోగా పాత, కొత్త శిక్షణ కేంద్రాలన్నీ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. వాటి పర్యవేక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.

అధిక ఫీజులు వసూలు చేసినా, ఏవైనా అక్రమాలకు కారణమైనా శిక్షణ సంస్థలకు రూ.లక్ష వరకూ జరిమానా విధిస్తారు. వాటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయొచ్చు కూడా.