ఇంటర్ విద్యలో బదిలీలు చేపట్టాలి – TIGLA

హైదరాబాద్ (జూలై – 18) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న రెగ్యూలర్ టీచింగ్ & నాన్-టీచింగ్ ఉద్యోగులకు మరియు నూతనంగా క్రమబద్ధీకరణ గావించబడిన లెక్చరర్ లకు వెంటనే సాదారణ బదిలీలు చేపట్టాలని ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రభుత్వ లెక్చరర్స్ అసోషియేషన్ (TIGLA) నాయకులు జంగయ్య, రామకృష్ణ గౌడ్ లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

ఉద్యోగులకు బదిలీలతో వ్యక్తిగత అవసరాలతోపాటు, వృత్తి
నిర్వహణ సామర్థ్యము కూడా పెరుగుతుందని… 2018 జూన్ నెల చివరలో ఇంటర్మీడియట్ విద్యలో పనిచేస్తున్న ఉద్యోగులకు సాధారణ బదిలీలకు అవకాశం కలిపించడం జరిగింది. అప్పుడు దాదాపు 500 మంది ఉద్యోగులకు
బదిలీలతో న్యాయం జరిగింది. కానీ 2018, 2019 సంవత్సరాలలో జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్స్
పదోన్నతులు రావడం బదిలీలకు కనీస సర్వీస్ 2 సంవత్సరాలు ఉండటం వలన 2018 సంవత్సరంలో జరిగిన బదిలీలలో వారికి అవకాశం రాలేదు. ప్రభుత్వం ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచడం వలన మరియు 317 జీవో అమలు చేయడం కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం గత 23 సంవత్సరాలుగా కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్న 3,800 మందిలో 3,096 మంది కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీస్ లను రెగ్యూలర్ చేస్తూ వారు పనిచేస్తున్న కళాశాలలో పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని.. వారికి గత 13 సంవత్సరాలుగా బదిలీలు లేకపోవడం వలన దాదాపు 20 సంవత్సరాలుగా ఒకే కళాశాలలో పనిచేస్తూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారికి కూడా బదిలీలు చేపట్టాలని విన్నవించుకున్నారు.