PRC : 40 – 50% ఫిట్‌మెంట్ కల్పించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్

BIKKI NEWS (MARCH 05) : సరైన సమయానికి పీఆర్‌సీ వేయకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మూడు పీఆర్‌సీలను కోల్పోవాల్సి వచ్చిందని ఉద్యోగ సంఘాల నాయకులు పీఆర్సీ కమిటీ ముందు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలు సంఘాల నాయకులు పలు వినతిపత్రాలను (Telangana PRC – employess unions demands for 40 yo 50% fitment) అందజేశారు.

★ 40% ఫిట్‌మెంట్ – TGO

తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం(టీజీవో) అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉద్యోగుల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని పీఆర్‌సీ కార్యాలయంలో కమిషన్‌ ఛైర్మన్‌ పి.శివశంకర్‌కు అందజేశారు. కనిష్ఠ వేతనం రూ.32 వేలు, గరిష్ఠ వేతనం రూ.2,95,460 ఉండాలని, 40 శాతం ఫిట్‌మెంట్‌ కలిపి వేతన స్కేలు నిర్ణయించాలని కోరారు.

★ సీపీఎస్ రద్దు చేయండి – సీపీఎస్ ఉద్యోగులు

రెండవ పీఆర్‌సీలో అయినా సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో పీఆర్‌సీ కమిషన్‌కు వినతి పత్రం అందజేశారు.

★ 50% ఫిట్‌మెంట్ – PRTU TS

గత అయిదేళ్లలో రాష్ట్ర జీఎస్‌డీపీ జాతీయ సగటుకన్నా 60.3 శాతం అభివృద్ధి సాధించినందున ఆమేరకు ఉద్యోగుల వేతనాలు పెరగాల్సిన అవసరం ఉందని టీఎస్‌ యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి పీఆర్‌సీ కమిషన్‌ ఛైర్మన్‌ శివశంకర్‌ను కోరారు. ఇంటి అద్దె భత్యంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని కోరారు. కనిష్ఠ వేతనం రూ.35 వేలు, 50 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని 2023 జూలై 1 నుంచి అమలయ్యేలా ప్రభుత్వానికి నివేదిక అందించాలని పీఆర్‌సీ కమిషన్‌ను పీఆర్‌టీయూటీఎస్‌ కోరింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెళ్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి ఆధ్వర్యంలో కమిషన్‌ ఛైర్మన్‌ను కలిశారు.

★ ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీంను 5 సంవత్సరాలకు చేయండి

తెలంగాణ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ ఇచ్చిన నివేదికలో పదోన్నతులు రావడం కష్టంగా మారుతున్నందున ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీంను 5, 10, 15, 20, 25 సంవత్సరాలుగా సవరించాలని కోరింది. రాష్ట్ర అధ్యక్షుడు సి.జగదీశ్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌.నర్సింహులు నేతృత్వంలో పీఆర్‌సీ కమిషన్‌ ఛైర్మన్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులు సాధారణ కేటగిరీల్లో వేతనాలు పొందేలా స్థిరీకరణ చేయాలని కోరుతూ పేరివిజన్‌ కమిషన్‌ ఛైర్మన్‌ శివశంకర్‌ను తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్‌ ఫోరం అధ్యక్షుడు మహేశ్‌, కార్యదర్శి విజయ్‌ కుమార్‌ కోరారు. వారు సోమవారం శివశంకర్‌ను ఆయన కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.