హేతువు వివేచననే భారతీయ ఆత్మ – వివేకానంద. (అస్నాల శ్రీనివాస్)

  • జనవరి – 12 : వివేకానందుడి జయంతి

BIKKI NEWS (JAN – 12) : వ్యవస్థీకృతమైన రుగ్మతలను ఎదిరించడం, సంస్కరించడం వంటి వివేకానందుడి విప్లవాత్మక భావాలు ఇప్పటికీ ప్రాసంగికతను కలిగివున్నాయి. పునరుద్ధరణవాద, తిరోగమన, విచ్ఛిన్నకర శక్తుల ప్రాబల్యంతో పేదరికం, అశాంతి, అసహనం నెలకొన్న ప్రస్తుత సమాజాన్ని మానవత్వం వైపు మళ్ళించడానికి వివేకానందుని కృషిని కొనసాగించడమే మార్గం.

‘పేదవాని కష్టంతో పైకి వచ్చి వారి బాగోగులను పట్టించుకోని ప్రతివాడు దేశద్రోహి. సంపద సృష్టికర్తలైన శ్రామికులే ఈ దేశ ఆశాకిరణాలు’ – అస్నాల శ్రీనివాస్

‘పేదవాని కష్టంతో పైకి వచ్చి వారి బాగోగులను పట్టించుకోని ప్రతివాడు దేశద్రోహి. సంపద సృష్టికర్తలైన శ్రామికులే ఈ దేశ ఆశాకిరణాలు’ – ఈ వ్యాఖ్యలు చదువగానే వర్గసంఘర్షణ సిద్ధాంత ప్రవక్త కార్ల్‌మార్క్స్‌ నిర్దేశించిన మార్గంలో నూతన ప్రజాస్వామిక సమాజాన్ని నిర్మిస్తామనే విప్లవకారులు చేసినవి అని అనుకుంటారు. జడప్రాయంగా ఉన్న సమాజాన్ని మృతప్రాయంగా ఉన్న వ్యవస్థకు కొత్త ఊపిరిపోసి, కొత్త నెత్తురు ఎక్కించిన పునరుజ్జీవన, జాతీయోద్యమ, విప్లవోద్యమ కేంద్రస్థానమైన బెంగాల్‌ మాగాణంలో ఉద్భవించిన వివేకానందుడు ఘోషించిన మాటలవి. 18, 19 శతాబ్దాల్లో స్తబ్ధమైన భారతీయ సమాజాన్ని మేల్కోల్పడానికి రాజారామ్‌మోహన్‌రాయ్‌, కేశవచంద్రసేన్‌, దయానందసరస్వతి సారథ్యంలో కొనసాగిన సంస్కరణోద్యమాన్ని వివేకానందుడు గొప్ప ముందడుగు వేయించాడు. ‘జ్ఞాన పిపాసే మోక్షానికి సాధన’ అన్న ఉపనిషత్తులను హేతువాదం, వివేకం, మానవవాదాలు మేధో హృదయాలుగా ఉన్న బౌద్ధ ధర్మాన్ని, ఇంకా అనేక పాశ్చాత్య చింతనా ధోరణులను స్ఫూర్తిగా తీసుకొని స్పష్టమైన దృక్పథంతో కార్యాచరణతో సమత జ్ఞాన విప్లవాన్ని వివేకానందుడు ఆరంభించాడు. 1863 జనవరి 12న కలకత్తా నగరంలో మధ్యతరగతి కుటుంబంలో వివేకానందుడు జన్మించాడు. బాల్యం నుండే విద్యా, క్రీడల్లో చురుకుగా రాణించాడు.

భారతీయ మూలాల నుండి నిజమైన వేదాంత దృక్పథాన్ని రూపొందించి, జాతి, మత పరమైన అన్ని రకాల అధిపత్యాలను, రూపుమాపే ప్రజాస్వామిక సిద్ధాంతంగా మార్చాడు. – అస్నాల శ్రీనివాస్

1883లో కలకత్తా ప్రెసిడెన్సి కాలేజీ నుండి పట్టభద్ర పట్టా పుచ్చుకున్నాడు. తత్వ శాస్త్రం పై ఇష్టంతో పాశ్చాత్య తత్వచింతనా పరులైన జాన్‌ స్టువర్ట్‌ మిల్‌, హెర్బర్ట్‌ స్పెన్సర్‌, హేగెల్‌ దర్శనాలను యువ వివేకానందుడు శ్రద్ధగా అధ్యయనం చేసాడు. తనలో తీవ్రమవుతున్న జ్ఞాన పిపాసకు, దైవము, మానసమాజం పై వస్తున్న అనేక సందేహాలను ‘మానవ సేవే మాధవసేవ’’ అని ప్రవచించిన రామకృష్ణ పరమహంస దగ్గర నివృత్తి చేసుకొని, ఆయన శిష్యుడిగా మారాడు. ప్రజల మధ్య జీవించి వారి కష్టసుఖాలను తెలుసుకొని, బాధల నుంచి వారిని విముక్తి చేసేవారే చరిత్రలో నిర్మాతలుగా, తత్వవేత్తలుగా మిగిలిపోతారు. ఈ వెలుగులో 1888 నుండి 1892 వరకు వివేకానందుడు ఆసేతు హిమాచలం పర్యటించాడు. తన కాలపు ప్రజలు విద్యకు, విజ్ఞానానికి దూరంగా మూఢవిశ్వాసాలకు, దారుణ సాంఘిక దురాచార కబంధహస్తాల్లో నలిగిపోవడం చూసాడు. ఉపనిషత్తులు, జైన, బౌద్ధ మతాలు విలసిల్లి ప్రపంచానికి శతాబ్దాలపాటు జ్ఞాన కాంతులు ప్రసరించిన భారతదేశం కాల వైపరీత్యాలకు లోనై ఔన్నత్యాన్ని కోల్పోయిందని వివేకానందుడు గ్రహించాడు. శ్రామికులు, స్త్రీల పట్ల అంతులేని వివక్షత కొనసాగుతుందని, యువత నిస్తేజంగా మారిపోయిందని, నైతికంగా, భౌతికంగా భారత జాతి నిర్యీర్యం అయిందని గ్రహించాడు.

1893లో చికాగో నగరంలో ప్రపంచ మత సదస్సుకు హాజరై భారతీయ తత్వసారాన్ని అద్భుత రీతిలో తెలియజేసి, ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. – అస్నాల శ్రీనివాస్

భారతీయ మూలాల నుండి నిజమైన వేదాంత దృక్పథాన్ని రూపొందించి, జాతి, మత పరమైన అన్ని రకాల అధిపత్యాలను, రూపుమాపే ప్రజాస్వామిక సిద్ధాంతంగా మార్చాడు. 1893లో చికాగో నగరంలో ప్రపంచ మత సదస్సుకు హాజరై భారతీయ తత్వసారాన్ని అద్భుత రీతిలో తెలియజేసి, ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. 1894 నుంచి 1897 వరకు అనేక పశ్చిమ దేశాలలో పర్యటించి, వేదాంత సారాన్ని భోదిస్తూ, భారతదేశాన్ని పేదరికం, అజ్ఞానం నుంచి ఉద్ధరించడానికి సహాయ సహకారాలను వివేకానందుడు అభ్యర్థించాడు. కలకత్తా, మద్రాసు నగరాలలో ఆశ్రమాలను, విద్యాలయాలను స్థాపించాడు. సమస్త సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి, సౌఖ్యమైన భౌతిక మానసిక వికాస జీవనానికి తోడ్పడే నాగరికత సంస్కృతులను పెంచడానికి విద్య, విముక్తిదాయినిగా పనిచేస్తుందని, పశ్చిమ దేశాల అనుభవం నుంచి వివేకానందుడు గ్రహించాడు.

మనషి లో నిగూఢమై ఉన్న పరిపూర్ణత్వాన్ని వ్యక్తం చేయించేది విద్య అని వివేకానందుడు నిర్వచించాడు. అస్నాల శ్రీనివాస్

తన దైన విద్యాతత్వ శాస్త్రాన్ని రూపొందించి, విద్యావ్యాప్తికి కృషి చేశాడు. మనషి లో నిగూఢమై ఉన్న పరిపూర్ణత్వాన్ని వ్యక్తం చేయించేది విద్య అని వివేకానందుడు నిర్వచించాడు. జీవితాన్ని నిర్మించడమూ, సద్గుణ సంపన్నులైన మనుషులను రూపొందించడమూ విద్య ఆశయాలుగా ఆయన పేర్కొన్నాడు. విద్యలో సమాన అవకాశాలను కల్పించిన ప్రాచీన నలంద, తక్షశిల, విక్రమశిల, వల్లభి విద్యలయాల సుసంపన్న మహత్తర సంప్రదాయాన్ని పునఃప్రతిష్టింపచేయాలని, ప్రభుత్వము, పౌరసమాజం విద్యను అందించడమే ప్రథమ కర్తవ్యంగా చేపట్టాలని ప్రజలను చైతన్యవంతం చేశాడు. ఆ నాటి సమాజంలో వ్యవస్థీకృతమైన రుగ్మతలను ఎదిరించడం సంస్కరించడం వంటి వివేకానందుడి విప్లవాత్మక భావాలు ఇప్పటికీ ప్రాసంగికతను కలిగివున్నాయి. పునరుద్ధరణవాద, తిరోగమన, విచ్ఛిన్నకర శక్తుల, సామాజిక బాధ్యత లేని పెట్టుబడుదారీ శక్తుల ప్రాబల్యంతో పేదరికం, అశాంతి, అసహనం నెలకొన్న ప్రస్తుత సమాజాన్ని మానవత్వం వైపు మళ్ళించడానికి వివేకానందుని కృషిని కొనసాగించడమే మార్గం.


అస్నాల శ్రీనివాస్
సంయుక్త కార్యదర్శి
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం