జీవన విలువల సాఫల్యమే స్వాతంత్ర్యం – అస్నాల శ్రీనివాస్

  • ప్లాటినమ్ జూబ్లీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక వ్యాసం

BIKKI NEWS : స్వరాజ్య సాధన ఉద్యమాలలో రాజకీయ, సాంఘీక, ఆర్ధిక రంగ ఉద్యమాలు అంతర్భాగంగా ఉంటాయి. ఆంగ్లేయులు మన దేశాన్ని జయించడానికి సుదీర్ఘ కాలం పాలించడానికి మన జాతి నైతిక పతనం ప్రధాన కారణం. బ్రిటిష్ వారు భారత్ లో అడుగు పెట్టినప్పుడు నైతికంగా అగాధంలో ఉన్నాం. నైతిక పతనం ఎంత సుళువో, దానిని తిరిగి నెలకొల్పడం చాలా కష్టమైన పని. మన దేశంలో మహమ్మారిలా వ్యాపించి వ్యవస్థీకృతమైన మత మౌడ్యాలు.., ప్రజలను చీలికలు పేలికలుగా చేసిన కుల వర్ణ వ్యవస్థలు, సాంఘిక దురాచారాలు, నీచ స్వార్ధాలతో సిందియా, హోల్కర్లు వంటి కొందరి రాజుల ఆర్కాట్, నిజాం వంటి నవాబుల అరాచక, భోగ లాలస, వ్యక్తిగత అహంకారాల వలన యావత్తు ఉపఖండము దాస్యంలోకి వెళ్ళిపోయింది. విభజించు పాలించు అనే నీతిని వలస పాలకులకు అపాదించడం ఆశాస్త్రీయం. అనేక రకాలుగా చీలి విభజించబడి ఉన్న ఉన్న భారతీయ సమాజాన్ని చేజిక్కించుకోవడం బ్రిటిష్ వారికి నల్లేరు మీద నడకగా మారింది. దాస్యం, ఊడిగం సిగ్గుచేటని గుర్తించనంతవరకు వెళ్ళింది. హేతువు, మానవతవాదం బోధించిన బౌద్ధం, చార్వాకం మోక్షానికి సాధనము జ్ఞానం అని పేర్కొన్న ఉపనిషత్తుల మహోజ్వల సంస్కృతి, దివ్య ప్రభాద్యుతులతో సమస్త ప్రంపంచానికి వెలుగుదారులను చూపించిన భారతదేశం ప్రతిఘాత ధోరణులతో స్తబ్దత, జీవచ్చవంగా మునిగి పోయింది. ప్రవాహం తగ్గిన రక్తనాళాలతో, నిస్సత్తువ శరీరాలతో భారత సమాజం నవశక్తి తో జ్ఞాన దీప్తితో వచ్చిన వలసవాదులకు పాదాక్రాంతమై పోయింది. శారీరకంగా మానసికంగా నైతికంగా ఆద:పతనం చెందిన భారత ఆత్మకు కొత్త రక్తం ఎక్కించి చైతన్యపురితం చేసి శక్తి సంపన్నం చేసి స్వాతంత్రోద్యమ రూపు రేఖలను దిద్దడానికి బాటలు వేసిన సాంఘీక విప్లవకారుల కృషి మరువలేనిది.

“శారీరకంగా మానసికంగా నైతికంగా ఆద:పతనం చెందిన భారత ఆత్మకు కొత్త రక్తం ఎక్కించి చైతన్యపురితం చేసి శక్తి సంపన్నం చేసి స్వాతంత్రోద్యమ రూపు రేఖలను దిద్దడానికి బాటలు వేసిన సాంఘీక విప్లవకారుల కృషి మరువలేనిది.” అస్నాల శ్రీనివాస్

దేశ దాస్యాన్ని అనివార్యం చేసిన నైతిక పతనంలో కూడా అప్పుడప్పుడు తిరుగుబాటు బావుటాలు చోటు చేసుకున్నాయి.1757 ఫ్లాసి యుద్ధం, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు,1800 ఆరంభంలో హిందూ సాధువులు తమ సాంప్రదాయక ఆయుధాలతో నిర్వహించిన సన్యాసి తిరుగుబాటు(ఈ ఉద్యమాన్ని ఇతివృత్తంగా బంకిం చంద్ర చటర్జీ ఆనందమఠం అనే నవల రాశారు)1857లో ప్రజ్వలించిన ప్రధమ స్వాతంత్ర సంగ్రామం. ఈ యుద్ధాలలో మన ప్రజలనే సైన్యంగా మన డబ్బుతొనే,,మన పాలకులలో కొందరి ప్రభువుల ధనలోభం, అధికార వ్యామోహం, స్వామి ద్రోహముతో ఆంగ్లేయులు ఈ దేశభక్తయుత యుద్దాలలో విజయం సాధించారు. భారత్ పై రాజకీయ అధికారాన్ని మూడు వందల సంవత్సరాలు అప్రతిహతంగా కొనసాగించింది. శ్రమ దోపిడీ, అణచివేతలతో తమ సామ్రాజ్యవాద విస్తరణకు, ప్రపంచ యుద్ధాలకు భారతదేశం నుండి రెండున్నర లక్షల సైన్యాన్ని ఉపయోగించుకుంది. రెండు వందల మిలియన్ల టన్నుల బొగ్గును, ఆరు మిలియన్ల ఇనుము ముడి ఖనిజాన్ని, రెండు మిలియన్ల టన్నుల ఉక్కును ఇంకా అనేక విలువైన వనరులను తరలించుక పోయింది. ఇవి జాతిలో తీవ్ర నైరాశ్యం, నిస్పృహలను కలిగించాయి.

“సామాజిక సంస్కర్తలు, కవులు, కళాకారులు, రచయితలు జాతీయోద్యమ రథచక్రానికి సారధులుగా , ఇరుసుగా తోడ్పడ్డారు. వీరు దురాచారాల నిర్ములన, విద్యా వ్యాప్తికి చేసిన కృషి వలన క్రమ క్రమంగా భారత జాతి నైతిక పునరుత్తేజం పొందింది.” – అస్నాల శ్రీనివాస్


1900 నుండి మళ్ళీ మొగ్గ తొడిగన స్వాతంత్ర్య సమరానికి పునాదులు వేసిన వారు మాత్రం సామాజిక సంస్కర్తలు, కవులు కళాకారులు.. రాజా రామ్ మోహన్ రాయ్, పూలే దంపతులు, కేశవ్ చంద్రసేన్, గోవింద రానడే, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, సయ్యద్ అహ్మద్ ఖాన్, వివేకానంద, వీరేశలింగం వంటి సంస్కర్తలు, బంకిం చంద్ర, టాగోర్, ఇక్బాల్, ధీన బంధు మిత్ర లాంటి కవులు, రచయితలు. వీరు జాతీయోద్యమ రథచక్రానికి సారధులుగా , ఇరుసుగా తోడ్పడ్డారు. వీరు దురాచారాల నిర్ములన, విద్యా వ్యాప్తికి చేసిన కృషి వలన క్రమ క్రమంగా భారత జాతి నైతిక పునరుత్తేజం పొందింది. ఇవి జాతి జనులను బానిసలుగా బతుకుతున్నారనే ఎరుకను తెలియపరచింది. ఆంగ్లేయుల అధిపత్యంలో బానిసలుగా ఉండడం సిగ్గుకరం అని పరిగణించడం, బానిసత్వపు బ్రతుకు హీనమనే భావం ప్రబలింది. 1880 నుండి గెలుపు ఓటమిలతో నిమిత్తం లేకుండా అలలు అలలు గా ఉప్పెన గా కొనసాగిన,1905, 1917, 1921, 1929, 1942, 1947 వరకు వెల్లువలతో స్వాతంత్రం సాకారమైంది.

“ప్రవాహం తగ్గిన రక్తనాళాలతో, నిస్సత్తువ శరీరాలతో భారత సమాజం నవశక్తి తో జ్ఞాన దీప్తితో వచ్చిన వలసవాదులకు పాదాక్రాంతమై పోయింది.” – అస్నాల శ్రీనివాస్


సంఘ సంస్కరణ ఉద్యమాలతో ఒక తిలక్, గాంధీ, ఒక జిన్నా ఒక నెహ్రు, భగత్ సింగ్ లు ఉద్భవించారు. వీరంతా రాజకీయ, సామాజిక విప్లవాలను జమిలిగా నడిపించి ప్రజలను ఐక్యం చేసి ఒక ఆశయ సాధనకు నడిపించేలా కృషి చేసారు. స్వతంత్ర పాలన తొలి నాళ్ళలో వైజ్ఞానిక వేత్త, సోషలిస్టు నెహ్రు, సామాజిక విప్లవనేత అంబేద్కర్ ల నేతృత్వంలో జాతీయోద్యమ ప్రజల ఆకాంక్షలకు అనువైన రాజ్యాంగం ను రూపొందించారు. పీడిత ప్రజాకోటి వికాసానికి అనేక రక్షణలు కలిపించారు. ప్రజల మౌలిక ప్రగతికి తోడ్పడే విద్య, వైద్యం, రవాణా, గనులు, శక్తి రంగాలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచారు. మూడు వందల సంవత్సరాల వలస పాలనలో చెల్లా చెదురైన దేశానికి నిర్దిష్ట రూపం తెచ్చారు. దీక్షతో, ధైర్య సాహాసాలతో విజ్ఞతతో వ్యవహరించి సంక్షేమ రాజ్య పునాదులను బలంగా నిర్మించారు. వేలాది సంవత్సరాలుగా విద్యకు పాలనలో భాగస్వామ్యము నోచుకొని వారికి చోటు దక్కింది. వ్యవసాయ వైజ్ఞానిక రంగాలలో స్వాలంబన, అనేక విజయాలు సొంతము చేసుకున్నాం.

“స్వాతంత్ర సమరంలో అశేష త్యాగాలు చేసిన లక్షలాది ప్రజల ఆకాంక్షలను తిరిగి నెలకొల్పే భాధ్యతను విద్యావంతులు, ప్రజాస్వామిక వాదులు తీసుకోవాలి.” అస్నాల శ్రీనివాస్

కానీ 1980 నుండి సంక్షేమ రాజ్య పాలన గాడి తప్పింది. వేలాది సంవత్సరాలుగా భారత సమాజాన్ని అంధకారంలో ఉంచిన మత మౌఢ్యము, విశ్వాసాల ప్రాతిపదికతో ప్రజలను చీల్చే రాజకీయాలు పురుడు పోసుకుని ప్రస్తుతం మహా విపత్తుగా మారాయి. జాతీయోద్యమంలోగాని, సాంఘిక విప్లవాలతో సంభంధం లేని శక్తుల పాలనలో జీవన ప్రామాణికతను సూచికల్లో అన్ని అధమ స్థానాలే. విద్య వైద్యాలు అమానవీయ పెట్టుబడి చేతుల్లోకి వెళుతున్నది. మళ్లీ నయా వలసవాదుల చేతుల్లోకి దేశం వెళుతున్నది. సాధించుకున్న అనేక హక్కులు,రాజ్యాంగ వ్యవస్థల ను రక్షణలను బలహీనం చేస్తున్నాయి. సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని తగ్గిస్తూ అప్రజాస్వామిక నియంత ధోరణులు చెలరేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్వాతంత్ర సమరంలో అశేష త్యాగాలు చేసిన లక్షలాది ప్రజల ఆకాంక్షలను తిరిగి నెలకొల్పే భాధ్యతను విద్యావంతులు, ప్రజాస్వామిక వాదులు తీసుకోవాలి. స్వాతంత్ర సాధనకు తోడ్పడిన లౌకిక, సౌభ్రాతృత్వ విలువలు తిరిగి విలసింప చేయాలి. ఇది అమరులు మనపై మోపిన భాద్యత. వారిని కొనసాగించడమే మనమిచ్చే నిజమైన నివాళి.

“విద్య వైద్యాలు అమానవీయ పెట్టుబడి చేతుల్లోకి వెళుతున్నది. మళ్లీ నయా వలసవాదుల చేతుల్లోకి దేశం వెళుతున్నది.” – అస్నాల శ్రీనివాస్


అస్నాల శ్రీనివాస్
ప్రిన్సిపాల్
జిజెసి యస్ యస్ తాడ్వాయి,

ములుగు జిల్లా
9652275560
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం