SBI RESEARCH REPORT 2023

BIKKI NEWS (సెప్టెంబర్ – 22) : SBI RESEARCH REPORT 2023 కుటుంబ స్థాయిలో అప్పులు, పొదుపు, ఖర్చులు వంటి క్షేత్ర స్థాయి మౌళిక విషయాలపై అధ్యయనం చేసి నివేదిక విడుదల చేసింది.

★ SBI RESEARCH REPORT 2023

దేశంలో కుటుంబాల నికర ఆర్థిక పొదుపు 2022- 23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 శాతం క్షీణించినట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ఇదిస్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.1 శాతానికి సమానమని వెల్లడించింది.

మరోవైపు కుటుంబాల రుణ భారం 2020-21 నుంచి రెండింతలు పెరిగి రూ.15.6 లక్షల కోట్లకు చేరినట్లు పేర్కొంది.

ఇందులో బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నట్లు విశ్లేషించింది.

2022-23లో పెరిగిన రూ.8.2 లక్షల కోట్ల కుటుంబ రుణాల్లో రూ.7.1 లక్షల కోట్లు బ్యాంకుల నుంచే ఉన్నాయి. ఇందులోనూ అధిక భాగం గృహ రుణాలు, ఇతర రిటైల్ రుణాలు ఉన్నాయి.

2022-23లో కుటుంబాల పొదుపు 50 ఏళ్ల కనిష్టానికి పడిపోయి జీడీపీలో 5.1 శాతానికి తగ్గింది.

2020-21లో ఇది 11.5 శాతంగా ఉంది. కొవిడ్ కు ముందు ఆర్ధిక సంవత్సరం (2019-20)లో జీడీపీలో పొదుపు వాటా 7.6 శాతంగా నమోదైంది.

బీమా, భవిష్య నిధి, పింఛను నిధులకు కుటుంబాల నుంచి రూ.4.1 లక్షల కోట్ల మేర పెరిగాయి. గత రెండేళ్లలో కుటుంబాల రుణాల్లో 55 శాతం రిటైల్ రుణాలే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా గృహ, విద్య, వాహన రుణాల వాటా ఉంది.

2011-12 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల పొదుపులో దాదాపు 2/3 వంతు పైగా ఆస్తుల్లోనే ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది 48 శాతానికి తగ్గింది. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఈధోరణి మారుతోంది. ప్రజలు తిరిగి ఆస్తుల కొనుగోలుపై దృష్టి సారిస్తున్నారు. మళ్లీ ఇది 70 శాతానికి చేరే అవకాశం ఉంది.

కుటుంబాల రుణ భారం-జీడీపీ నిష్పత్తి కొవిడ్ సమయంలో పెరిగినా, తర్వాత నుంచి తగ్గుతోంది. 2020 మార్చిలో కుటుంబాల రుణాలు జీడీపీలో 40.7 శాతంగా ఉండగా, 2023 జూన్ కు 36.5 శాతానికి దిగొచ్చాయి.