RYTHU BANDHU SCHEME : రైతు బంధు పథకం

BIKKI NEWS : RYTHU BANDHU SCHEME ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పెట్టుబడి కోసం నగదు రూపంలో అందించే సంక్షేమ పథకం. సంవత్సరానికి రెండు విడతలుగా ఈ పథకం అమలు జరుపుతున్నారు. ఎకరానికి 5 వేలు చొప్పున సంవత్సరానికి రెండు విడతలుగా 10, 000 రూపాయలు నగదు రూపేణా అందజేస్తారు.

ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2018, మే 10న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించాడు. మొట్టమొదటి సారిగా ధర్మరాజుపల్లి వాసులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాసు పుస్తకాలు అందుకున్నారు.

◆ లబ్దిదారుల వివరాలు :

2 ఎకరాల లోపు – 42 లక్షలు (90%)

5 ఎకరాల లోపు – 11 లక్షలు

5-10 ఎకరాల లోపు – 4.4 లక్షలు

10 – 25 ఎకరాల మద్య – 94,000

25 ఎకరాల కంటే ఎక్కువ – 6488

రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 5000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10,000 పెట్టుబడిగా ఇవ్వనుంది. అదే విధంగా ఈ పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత అనగా 181 వ రోజు నుంచి 270 వ రోజు వరకు వారు తీసుకున్న రుణంపై 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు.

2018 లో రాష్ట్రవ్యాప్తంగా 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుంది. (గిరిజన భూములు కలిపి మొత్తం కోట్ల ఎకరాలకు) ఈ పథకం అమలుకోసం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించారు.

మొదట్లో 2018-19 సంవత్సరంలో ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు పంటలకోసం రెండు విడతల్లో ప్రతి రైతుకు మొత్తం ఏడాదికి రూ. 8 వేలను ప్రభుత్వం అందించారు. పునాస పంట పెట్టుబడిని ఏప్రిల్‌ నుంచి, యాసంగి పంట పెట్టుబడిని నవంబర్‌ నుంచి పంపిణీ చేశారు. 2019-20 నుంచి పంట పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచి, రైతుకు ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేలు అందజేస్తున్నారు.

◆ ఐక్యరాజ్యసమితి ప్రసంశ :

ప్రపంచ దేశాల్లో రైతుల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసిన 20 పథకాలలో రైతుబంధు పథకం ఒకటి. 2018 నవంబరు 20 నుండి 23 వరకు ‘వ్యవసాయాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు’ అనే అంతర్జాతీయ సదస్సు ఐరాసలోని వ్యవసాయ విభాగం ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎవో) కేంద్ర కార్యాలయం రోమ్ నగరంలో జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ఎంపిక చేయగా, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేక ప్రజంటేషన్ ఇచ్చారం.

◆ 2023 రబీ సీజన్ రైతు బంధు :

ఈ సీజన్ లో రైతు బంధు పథకం కింద 1.54 కోట్ల ఎకరాలకు నగదు సహాయం అందనుంది.

ఈ సీజన్ మొత్తం 70 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు.

ఈ సీజన్ లో మొత్తం 7,720.29 కోట్లు ఈ పథకానికి కేటాయించారు.

ఈ సీజన్ తో కలిపితే ఈ పథకం కింద రైతులకు అందించిన మొత్తం నగదు విలువ 72, 910 కోట్లు రూపాయలు.