పాలమూరు పునరుజ్జీవన కర్మయోగి – కేసీఆర్ : వ్యాసకర్త విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్

  • సెప్టెంబర్ 16న రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ ను కొల్లాపూర్ మండలంలో సింగోటం వద్ద కేసీఆర్ ప్రజలకి అంకితం చేయనున్నారు
  • PALAMURU RANGAREDDY LIFT IRRIGATION PROJECT

BIKKI NEWS (సెప్టెంబర్ -16): తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు .రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆకాంక్ష ప్రజల స్వప్నంగా ఉన్న కృష్ణా గోదావరి నదీ జలాలను చేను చెల్కలకి చెరువులను నింపడానికి తాగు నీరు పారిశ్రామిక అవసరాలకి మల్లించే కార్యక్రమానికి ప్రధమ ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది .వింధ్య సాత్పురా పర్వతాల మధ్యఉన్న డెక్కన్ పీఠ భూమి శిఖరంగా ఉన్న తెలంగాణను ఆకుపచ్చ సీమగా మలిచె బృహత్తర కార్యక్రమాన్ని కర్మయోగి కేసీఆర్ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. నూతన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సమాంతరంగా నీటి నిల్వ సామర్ధ్యం భూగర్భ జలాల పెంపు ప్రాతిపదికగా ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన మిషన్ కాకతీయ అపూర్వ ఫలితాలను ఇచ్చింది .ఈ ఫలాలను రైతాంగం తమ నిత్య జీవిత అనుభవాలతో అనుభూతి చెందుతున్నారు.కర్షకా నీ కర్రు కదిలినన్నాళ్లే సమస్త సంస్కృతి నాగరికత ఉనికి మనుగడ వికాసం అని కాళోజి అన్నట్లు ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ఆర్ధిక సామాజిక సాంస్కృతిక వికాసం పునరుజ్జివం పొంది ఫరిఢవిల్లుతున్నది.ఈ దిశగా తెలంగాణ కొనసాగిస్తున్న ఉత్కృష్ట స్థాయిని దేశానికి చాటి చెపుతున్నది.

వింధ్య సాత్పురా పర్వతాల మధ్యఉన్న డెక్కన్ పీఠ భూమి శిఖరంగా ఉన్న తెలంగాణను ఆకుపచ్చ సీమగా మలిచె బృహత్తర కార్యక్రమాన్ని కర్మయోగి కేసీఆర్ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. – విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్

ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల దాష్టీకాల వలన తెలంగాణ సంక్షుభితంగా మారింది.పాలమూరు జిల్లాలో మానవ జీవన విధ్వంసం పతాక స్థాయికి చేరుకుంది.ఇక్కడ మనిషికి మనుగడకు మహా యుద్ధమే జరిగింది.నీరు పల్లమెరుగు అనే కాలం చెల్లిన నమూనాతో తెలంగాణలో అత్యధిక చెరువులు ఉన్న ఉమ్మడి పాలమూరు పై నిర్లక్ష్యం చేసి బిరా బిరా కృష్ణమ్మ ను రానివ్వకుండా దగా చేశారు.తమ కళ్ళ ముందు పారుతున్న నీటిని కూడా చెరువులో నిల్వ కాకుండా చేశారు.అదే కృష్ణా గోదావరులతో కోస్తా ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చుకున్నారు.గతి తప్పిన రుతువులు ,బోర్ బావులతో వ్యవసాయం బావురుమన్నది.నీరు లభ్యం కానీ స్థితిలో తీవ్ర దుర్భిక్షం నడుమ జీవితం నిత్య మరణంగా మారిన నేపథ్యంలో బతకడానికి దేశ విదేశాలలో వలస కూలీలుగా కట్టు బానిసలు జీవితం వెల్లబోస్తున్న దైన్యానికి పాలమూరు ప్రజానీకం నెట్టబడింది .

త్రిగోర్జెస్ ప్రాజెక్ట్ కంటే గొప్పగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ సాంకేతికతతో ,ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ అద్భుతాలతో కూడిన పాలమూరు -రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్ట్ కు జూన్ 11,2015 న శంఖుస్థాపన చేశారు. – విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్

మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని అంతిమ విజయతీరం వైపు చేర్చడానికి కేసీఆర్ చేపట్టిన అనేక ప్రజాస్వామ్య ఉద్యమ వ్యూహాల్లో భాగంగా 2009 లోకసభ ఎన్నికలలో మహబూబ్ నగర్ నుండి ఎన్నికైనారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలు ,భోగోళిక స్థితిగతులను అవగాహన చేసుకున్నారు.జీవ వైవిధ్యానికి అనువుగా ఉండే నల్ల రేగళ్లు ఎర్ర చెల్కలు ఇసుక భూములు ఉన్నాయి.నీరు అందితే దక్కన్ అన్న పూర్ణగా విలసిల్లే భవిష్యత్ ఉందని నిర్దారించుకున్నారు.వలసలు వెళ్లిన ఇక్కడి ప్రజలు తిరిగి రావడమే కాదు పక్క ప్రాంతాల నుండి ఉపాధి కోసం వచ్చే దశకు చేరుకోవాలని కోరుకున్నారు.ఈ ప్రాంత లోక సభ సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం సాధించిన సంతోషం కృతజ్ఞతను ప్రాజెక్టు నిర్మాణంను త్వరిత గతిన పూర్తీ చేయాలనుకున్నారు.తన అపార మేధో సంపదతో ప్రణాళికలు వేసుకున్నారు.పాలమూరు ను పడావు పెట్టి కృష్ణా నీటిని పోతిరెడ్డిపాడు నుండి రాయలసీమ హంద్రీనీవా కు పంపించిన అప్పటి ప్రాంతీయ ద్రోహులను ఎండగట్టారు.

జీవ వైవిధ్యానికి అనువుగా ఉండే నల్ల రేగళ్లు ఎర్ర చెల్కలు ఇసుక భూములు ఉన్నాయి.నీరు అందితే దక్కన్ అన్న పూర్ణగా విలసిల్లే భవిష్యత్ ఉందని నిర్దారించుకున్నారు. – విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్

2014 లో రాష్ట్ర సాకారం తర్వాత ఉద్యమ క్రమంలోనే రూపకల్పన చేసుకున్న ఉత్తర తెలంగాణ కోసం కాళేశ్వరం ,దక్షణ తెలంగాణ కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం కార్యాచరణ ప్రారంభించారు.చైనా నిర్మించిన సుప్రసిద్ధ త్రిగోర్జెస్ ప్రాజెక్ట్ కంటే గొప్పగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ సాంకేతికతతో ,ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ అద్భుతాలతో కూడిన పాలమూరు -రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్ట్ కు జూన్ 11,2015 న శంఖుస్థాపన చేశారు.శ్రీశైలం ఎగువభాగాన కొల్లాపుర్ మండలం ఎల్లూరు గ్రామం వద్ద వర్షాకాలంలో 120 టిఎంసిల కృష్ణా జలాలను తరలిస్తూ పాలమూరు జిల్లాలో 7లక్షల ఎకరాలు ,రంగారెడ్డి జిల్లాలో 5లక్షల ఎకరాలు ,నల్గొండ లో 30 వేల ఎకరాల భూమికి సాగునీరు అలాగే 1228 గ్రామాలకి త్రాగునీరు అందించే విధంగా ప్రాజెక్ట్ నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నది.

కృష్ణా నది జలాలని తరలించి నిల్వ చేయడానికి ,గుట్టలను కలుపుతూ మట్టి కట్టలతో నాడు కాకతీయులు చెరువులను నిర్మించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం జలాశయాలను ,కాల్వలను ఎక్కువగా గుట్ట ప్రాంతాలలోనే ఏర్పాటు చేసింది.వ్యవసాయ యోగ్య భూములను ఎక్కువగా సేకరించే అవసరం లేకుండా ,ఎక్కువ గ్రామాలు ముంపుకి గురికాకుండా సొరంగ మార్గాలను ఏర్పాటు చేసింది .

లిఫ్ట్ కోసం 400.82 ఫీట్ల ఎత్తుకు కృష్ణా నీటిని తరలించే ప్రపంచంలో అత్యధిక సామర్ధ్యం గల 145 మెగావాట్ల మోటార్ పంపుసెట్ ను ఉపయోగిస్తున్నారు.దీనిని మన ప్రభుత్వ రంగ సంస్థ BHEL రూపొందించింది. – విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్

దేవాలయ పర్యాటకాన్ని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ దేవతలు కొలువైన గుట్టల పేరుతొ ఆరు జలాశయాలను నిర్మించింది.కృష్ణమ్మ నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా నార్లాపూర్ అంజనగిరి ,ఏదుల వీరాంజనేయ ,వట్టెం వెంకటాద్రి ,కరివేన కురుమూర్తి జలాశయాల గుండా ప్రవహించి లిఫ్ట్ ద్వారా రంగారెడ్డి లోని ఉద్దండాపూర్ ,లక్ష్మి దేవిపల్లి జలాశయాలకు చేరుతుంది.లిఫ్ట్ కోసం 400.82 ఫీట్ల ఎత్తుకు కృష్ణా నీటిని తరలించే ప్రపంచంలో అత్యధిక సామర్ధ్యం గల 145 మెగావాట్ల మోటార్ పంపుసెట్ ను ఉపయోగిస్తున్నారు.దీనిని మన ప్రభుత్వ రంగ సంస్థ BHEL రూపొందించింది.

ఇప్పుడు తెలంగాణలో ప్రతి మట్టి రేణువు వజ్రపు విలువను సంతరించుకున్నది. జీవన ప్రమాణ విలువలు పెరిగి పారిశ్రామిక క్రయ విక్రయాలు పెరిగిన తెలంగాణ ప్రపంచ పెట్టుబడుల ప్రవాహానికి కేంద్రం అయ్యింది. – విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్

అభివృద్ధి ప్రతిఘాతకులు వేసిన తప్పుడు కేసులు ,కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉద్దేశ్య పూర్వకంగా అనుమతి నిరాకరణ పై ప్రామాణిక సత్యవంత సాక్ష్యాలతో యుద్ధం చేసి అడ్డంకులను రాష్ట్ర ప్రభుత్వం అధిగమించింది.సెప్టెంబర్ 16న రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ ను కొల్లాపూర్ మండలంలో సింగోటం వద్ద కేసీఆర్ ప్రజలకి అంకితం చేయనున్నారు.నీటి శబ్దం నీటి స్పర్శ మానవ భావోద్వేగాలకు ప్రతీకగా ఇక్కడ జరిగే ఉద్వేగ మహత్తర
అంకిత సభకు ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల సర్పంచ్ లతో పాటు అశేష ప్రజానీకం తరలిరానున్నారు. కృష్ణమ్మ నీటిని కలశాలలో తీసుకోని వెళ్లి ఆయా గ్రామ దేవాలయాల స్వామి పాదాలకు అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకుంటారు.

ఆనతి కాలంలోనే తెలంగాణలో 78%ప్రజలు ఆధారపడే వ్యవసాయాన్ని పండుగగా మార్చి గౌరవప్రద జీవన భూమికను కేసీఆర్ పోషిస్తున్నారు .పరవళ్ళు తొక్కుతూ వస్తున్న నీటిని ,కళ్ళ ముందునుంచి పారిపోతున్న నీటిని దోసిళ్ళతో ఒడిసిపట్టుకుంటున్న సంస్కృతిని సాగుచేస్తున్నారు .

జీవన సంక్షోభం ద్వారా వచ్చిన ఆత్మన్యూన్యత స్థానంలో అభివృద్ధి సుభిక్ష ఆత్మ గౌరవ పతాకాన్ని జన మనో కేతనంగా మార్చిన మహిమాన్వితుడిగా యుగకర్తగా నిలిచిపోతాడు కేసీఆర్ – విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్

నీటి కల్పన వ్యవసాయ అభివృద్ధితో దాని అనుబంధ రంగాలైన చేపల పెంపకం ,పౌల్ట్రీ ,గొర్ల మేకల పెంపకం .పాడి రంగం ,పశు గ్రాస లభ్యత పెరిగి గ్రామాలలో ఒక అనూహ్య ఆర్ధిక చలనాన్ని సంపద విప్లవాన్ని సాక్షాత్కిరింప చేస్తున్నది .ఇప్పుడు తెలంగాణలో ప్రతి మట్టి రేణువు వజ్రపు విలువను సంతరించుకున్నది.జీవన ప్రమాణ విలువలు పెరిగి పారిశ్రామిక క్రయ విక్రయాలు పెరిగిన తెలంగాణ ప్రపంచ పెట్టుబడుల ప్రవాహానికి కేంద్రం అయ్యింది.

అతి తక్కువ సమయంలో పాలమూరు సామాజిక ఆర్ధిక చరితను అనూహ్య స్థాయికిచేర్చారు. ప్రపంచ వ్యాప్తంగా వలస పోయిన పాలమూరు బిడ్డలు తిరిగి తల్లి ఒడికి చేరుకున్నారు.పెట్టుబడి నుండి పంటల సస్య రక్షణ , అమ్మకం వరకు భూమి పుత్రుడు కేసీఆర్ కల్పించిన ప్రోత్సాహకాలతో ఇతర రాష్ట్రాల శ్రామికులకు ఉపాధి ఇచ్చే స్థాయికి చేరుకున్నారు.రైతుల గౌరవమే కాదు శ్రామికుల శ్రమ మంచి ప్రతిఫలముతో వారి ఆత్మగౌరవంను పెంచి శ్రామిక జన హృదయ పక్షపాతిగా నిలిచారు.

జీవన సంక్షోభం ద్వారా వచ్చిన ఆత్మన్యూన్యత స్థానంలో అభివృద్ధి సుభిక్ష ఆత్మ గౌరవ పతాకాన్ని జన మనో కేతనంగా మార్చిన మహిమాన్వితుడిగా యుగకర్తగా నిలిచిపోతాడు. కేసీఆర్ తన మేధో శ్రమ సృజనాత్మక సామర్ధ్యాలతో ప్రకృతి వనరులను ,మానవ నిర్మిత వనరులను వినియోగిస్తూ సాగునీటి రంగాన్ని అద్వితీయంగా మారుస్తూ తెలంగాణ ను తన ఇంటిగా కుటుంబంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తున్న కర్మయోగి కేసీఆర్

పాలమూరు బిడ్డగా ఇక్కడి ప్రజల విధేయుడిగా, కేసీఆర్ ఉద్యమ సహచరుడిగా ,ప్రభుత్వ పాలనలో తన అనుచరుడిగా ఇతిహాసాన్ని తలపించే పాలమూరు పునరుజ్జీవనచరిత్ర నిర్మాణంలో నేను ఒకడిగా ఉండడం పరమానందంగా ఉంది.

(16సెప్టెంబర్ మహబూబ్ నగర్ జిల్లాలో కొల్లాపుర్ సింగోటం వద్ద పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతికి అంకితం చేస్తున్న సందర్బంగా )

విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్,
రాష్ట్ర మంత్రివర్యులు