OZONE LAYER DAY : అంతర్జాతీయ ఓజోన్ పొర దినోత్సవం

  • సెప్టెంబర్ 16 న ఐక్యరాజ్యసమితి (UNO) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు
  • bridging the ozone gap for a sustainable future అనే థీమ్ తో 2023 ఓజోన్ దినోత్సవం నిర్వహిస్తున్నారు.

BIKKI NEWS (SEP 16) : అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం (INTERNATIONAL OZONE LAYER DAY SEPTEMBER 16th) ప్రతి సంవత్సరం సెప్టెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి (UNO) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. జీవరాశికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్‌ పొరకు ఏర్పడిన రంధ్రం కారణంగా కలిగే నష్టాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది.

★ మాంట్రియల్‌ ప్రొటోకాల్‌

సూర్యుని నుంచి వెలువడే కిరణాలు నేరుగా భూమిపై పడకుండా అందులో ఉండే అతినీలలోహిత వికిరణాలును ఓజోన్ పొర సంగ్రహించి, ప్రాణకోటికి వాటిల్లే ముప్పు నుంచి కాపాడుతుంది. వాహనాలు పెరగడం, పరిశ్రమల కాలుష్యం, అధిక శాతం మంది ఏసీలను వినియోగించడం వలన ఓజోన్ పొర క్షీణించిపోతోందని 1987లో మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ (ఓజోన్‌ పొర క్షీణతపై జరిపిన పరిశోధన) సంస్థ తెలిపింది. ఓజోన్‌ పొరను దెబ్బతీస్తున్న పదార్ధాల నియంత్రణకు గాను రూపొందించిన మాంట్రియల్‌ ప్రొటోకాల్‌పై ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు 1987, సెప్టెంబర్‌ 16న సంతకాలు చేశాయి. ఆ తరువాత 1994, సెప్టెంబర్‌ 16న మరో సమావేశం జరిపి, ఓజోన్ క్షీణతను అరికట్టాలని నిర్ణయించారు. దాంతో ప్రతి సంవత్సం సెప్టెంబరు 16న అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవం జరపాలని నిర్ణయించబడింది.

★ తగ్గుతున్న రంధ్రం పరిమాణం

1980లో అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్‌ పొరకు రంధ్రం ఏర్పడిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రొటోకాల్‌పై సంతకం చేసిన 30 సంవత్సరాల తరువాత ఓజోన్ పొరలో రంధ్ర పరిమాణం తగ్గడం గమనించబడింది. ఓజోన్ క్షీణతకు కారణమయ్యే వాయువుల స్వభావం కారణంగా వాటి రసాయన ప్రభావాలు 50 నుండి 100 సంవత్సరాల వరకు కొనసాగుతాయి

★ దినోత్సవం లక్ష్యం

పర్యావరణ మార్పులపై, ఓజోన్ పొర క్షీణతపై ప్రజలకు అవగాహన కల్పించడం. అన్ని దేశాల ప్రభుత్వాలు మాంట్రియల్ ప్రొటోకాల్‌ను మరింత సమర్థంగా అమలుచేసి 2050 సంవత్సరానికి ఓజోన్‌ పొరను 1980కు ముందున్న స్థాయికి తేవడం

★ కార్యక్రమాలు

  • అడవుల నరికివేతను పూర్తిగా నిలిపివేయడం.
  • మొక్కలను పెంచడం.
  • యంత్రాల నుంచి వినాశకర వాయువులను విడుదల చేస్తున్న పరిశ్రమలు రక్షణ చర్యలు చేపట్టడం.