DSC నోటిఫికేషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 29) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి సంబంధించి జారీ చేసిన జీవో 25లో ఎస్జీటీ పోస్టుల అర్హత నిబంధనపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ మేరకు ఎస్జీటీ పోస్టుల అర్హతకు సంబంధించి జీవో 25 లోని నిబంధన 4(2) (2) లో “ఎస్జీటీ పోస్టులకు డీఈడీతో పాటు 2007కు ముందు ఇంటర్మీడియట్లో 45%.. ఆతర్వాత 50% మార్కులుండాలన్న నిబంధన” పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది.

ఈమధ్య కాలంలో ఎస్జీటీ నియామకాలు ఏవైనా జరిగినట్లయితే తుది తీర్పునకు లోబడి ఉంటాయంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

జీవో 25 లోని నిబంధనను సవాల్ చేస్తూ 25 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ ఎన్. వి. శ్రవణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎస్జీటీ పోస్టులకు డీఈడీతో పాటు 2007కు ముందు ఇంటర్మీడియట్లో 45%.. ఆతర్వాత 50% మార్కులు ఉండాలన్న నిబంధన రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎన్సీటీఈ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపారు.

వాదనలను విన్న ధర్మాసనం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లతోపాటు ఎన్సీటీఈలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. కాగా 2017లో ఇదే నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరిస్తూ ఆ నిబంధన చెల్లదని పేర్కొంది.