BIKKI NEWS (JAN. 06) : ప్రపంచంలోని మధుమేహ బాధితులకు శుభవార్త.. శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకొనేందుకు ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే క్లోమం పునరుద్ధరించే విధానాన్ని ఆవిష్కరించినట్టు (Diabetic new Treatment with pancherous reproduction) ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెప్పారు. క్యాన్సర్‌కు చికిత్స చేస్తుండగా అనుకోకుండా క్లోమాన్ని పునరుద్ధరణ ప్రక్రియ కనిపెట్టినట్లు ప్రకటించారు.
ఆస్ట్రేలియాకు చెందిన బేకర్ హార్ట్ అండ్ డయాబెటిక్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు క్లోమగ్రంథి స్రావాల ప్రవాహ నాడుల్లో ఏర్పడిన క్యాన్సర్ కణతులను నయం చేసేందుకు ప్రకృతిసిద్ధమైన విధానాలపై పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్‌హాన్సర్ ఆఫ్ జెస్ట్ హోమోలాగ్-2 ఎంజైమ్ (ఈజెడ్‌హెచ్2)ను ఆ కణతులపై ప్రయోగించారు. ఈ ఎంజైమ్ సహజసిద్ధంగానే ఏర్పడుతుంది. క్యాన్సర్ కణతులపై దాడిచేసిన ఈ ఎంజైమ్ పరిశోధకులు ఊహించని విధంగా డక్టల్ ప్రోజెనిటర్ కణాలను ఉత్తేజితం చేసింది.
జీవకణాలకు ఈ డక్టల్ ప్రోజెనిటర్ కణాలను వారసులుగా పేర్కొంటారు. గ్లూకోజ్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న క్లోమంలోని ఇన్సులిన్‌ను ఉత్పత్తిచేసే బీటా సెల్స్‌ను ఈ డక్టల్ కణాలు పునఃసృష్టి చేశాయి. దీంతో ఎప్పటికీ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేదనుకొన్న క్లోమగ్రంథి ఉన్నట్టుండి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయటం మొదలుపెట్టిందని పరిశోధకుల బృందం నాయకుడు సామ్ ఎల్-ఓస్టా తెలిపారు. ఈ పరిశోధన ఇప్పటికీ ప్రాథమిక దశలోనే ఉన్నదని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్‌లో ఇది విజయవంతమైతే వైద్యప్రపంచంలో అద్భుతాలు జరుగుతాయని పేర్కొన్నారు.
శరీరంలో చక్కెరలను (గ్లూకోజ్) నియంత్రించేందుకు, జీవకణాలు దానిని శోషించుకొనేందుకు ఇన్సులిన్ ప్రధాన వాహకం అన్న విషయం తెలిసిందే. ఈ ఇన్సులిన్‌ను క్లోమగ్రంథి ఉత్పత్తి చేస్తుంది. టైప్-1 డయాబెటిక్ బాధితుల్లో పుట్టుకతోనే క్లోమగ్రంథి దెబ్బతిని ఇన్సులిన్‌ను ఉత్పత్తిచేసే శక్తిని కోల్పోతుంది. వాళ్లు జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడాల్సి ఉంటుంది.
టైప్-2 డయాబెటిక్ బాధితులకు వివిధ కారణాల వల్ల క్లోమం ఇన్సులిన్ ఉత్పత్తి చేసే శక్తిని కోల్పోతుంది. వాళ్లు సమస్య తీవ్రతను బట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్ లేదా మాత్రలు వాడుతుంటారు. ఇప్పటివరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు.