తెలంగాణ విద్యా దశాబ్ది వేడుకలు – అస్నాల శ్రీనివాస్ ప్రత్యేక వ్యాసం

BIKKI NEWS : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 20వ తేదీన విద్యా దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగగా విద్యాసంస్థల్లో జరుపుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి అమోఘం, అనితర సాధ్యం..

తెలంగాణ బిడ్డ, భారత వైతాళికుడు మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు మానస పుత్రికగా ఇంటర్‌ విద్య పురుడుపోసుకోని అనేక రంగాలలో ఉన్నతమైన ఉత్తమమైన విద్యార్థులను అందిస్తున్న విద్యగా ఇంటర్ విద్య బాసిల్లుతుంది సమాజా నిర్మాణానికి తొలి మెట్టుగా ఇంటర్ విద్య ఉంది అనడంలో సందేహం లేదు.

ఈ నేపథ్యంలో ఉచిత వైద్యం, విద్యకు రాష్ట్ర ప్రభుత్వం పట్టం కట్టిన తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది. 2014 నుంచి ఉద్యమకాల నిబద్ధతతో ప్రభుత్వ విద్యా వ్యవస్థను పునరుజ్జీవింపజేసే అనేక కార్యక్రమాలను చేపట్టింది. ప్రత్యేకంగా ప్రభుత్వ ఇంటర్‌విద్య అభివృద్ధి వికాసాలకు విద్యాచరిత్రలోనే ఎన్నడూలేని సదుపాయాలను కల్పిస్తున్నది.

ఈ క్రమంలో దేశ ప్రగతికి అవసరమైన శాస్త్ర సాంకేతిక నిపుణులను, సృజన కారులను, సామాజిక శాస్త్రవేత్తలను అందించిన ప్రభుత్వ ఇంటర్‌ విద్య అంతరించే స్థాయికి చేరుకున్నది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం 405 కళాశాలలకు 310 కోట్లతో మౌలిక సౌకర్యాలను కల్పించింది. ఒక నమూనాగా కళాశాల ఉండేవిధంగా పక్కాభవనం, విశాలమైన తరగతి గదులు, అధునాతన ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, తాగునీరు కోసం నీటి శుద్ధీకరణ ప్లాంట్లు, నిరంతర నీటి సరఫరాతో విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక మూత్రశాలలు, డిజిటల్‌ బోధన కోసం కంప్యూటర్లు, ప్రొజెక్టర్లను సమకూర్చింది. అన్ని కళాశాలల్లో ప్రిన్సిపాల్‌ పోస్టులను భర్తీ చేసింది. ఏటా 20 కోట్లతో విద్యార్థులందరికి ఉచిత పుస్తకాలను, క్రీడా సామాగ్రిని అందజేస్తున్నది. ఈ చర్యలతో సాధికారత దిశగా విప్లవాత్మకంగా సామాజికవిద్య ముందడుగు వేస్తున్నది. గతంలో జడప్రాయంగా ఉన్న విద్యాపరిశోధన, వృత్యంతర శిక్షణా విభాగాన్ని ఆచార్య జయశంకర్‌ శిక్షణ కేంద్రంగా మార్చి చలన శీలం చేసింది.

2014 నుంచి ఏటా అధ్యాపకులకు వారి సబ్జెక్టులలో విస్తృత పరిజ్ఞానం కోసం సమకాలీన మార్పులపై అవగాహన పెంచడం కోసం పాఠ్యాంశాల పట్ల ప్రేమను, విద్యార్థులు సమగ్ర మూర్తిమత్వంతో ఎదగడానికి కావలసిన నైపుణ్యాలను కల్పించే విధంగా శిక్షణా కార్యక్రమాలను అన్ని జిల్లా కేంద్రాలలో నిర్వహించింది.ప్రాంతీయ విద్యాకేంద్రం మైసూర్‌లో ప్రత్యేక శిక్షణను ఇప్పిస్తున్నది. కరోనా కాలంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన కోసం ఆడోబ్‌ లాంటి సాఫ్ట్‌వేర్‌ సంస్థలతో డిజిటల్‌ టూల్స్‌ వినియోగంపై కార్యశాలలను నిర్వహించింది. టి శాట్‌, దూరదర్శన్‌, సీనియర్‌ అధ్యాపకులతో యూట్యూబ్‌ చానల్స్‌లో నిరంతర బోధనను అందచేసింది.

2002లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం ఇంటర్‌ విద్య సంస్కరణల కోసం ప్రొఫెసర్‌ నీరదారెడ్డి కమిషన్‌ వేసింది. ఈ కమిషన్‌ ప్రభుత్వ విద్య పటిష్ఠతకు, ప్రైవేట్‌విద్య నియంత్రణకు అర్థవంతమైన సిఫారసులను సూచించింది. ప్రైవేటు కళాశాలలకు అనుమతులివ్వడంలో, అదనపు సెక్షన్లు మంజూరు చేయడంలో, ఫీజుల నియంత్రణ కోసం కఠిన నిబంధనలు అమలుచేయాలని ప్రభుత్వానికి సూచించింది. కానీ ఉమ్మడి పాలకులు ఈ సిఫారసులను బుట్టదాఖలు చేశారు. పైగా ప్రభుత్వ ఇంటర్‌ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కుట్రపూరితంగా 2005లో ప్రొఫెసర్‌ దయారత్నం కమిటీ వేశారు. ఈ కమిటీ సిఫారసులో ప్రభుత్వ విద్యను పటిష్ఠం చేసే ప్రతిపాదనలకు ప్రాముఖ్యం లేదు. పైగా ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీని ప్రతిపాదించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న కార్పొరేట్‌శక్తులు ఇంటర్‌ విద్యను, ఎంసెట్‌ శిక్షణను పూర్తిస్థాయిలో వ్యాపారమయం చేశాయి. తత్ఫలితంగా ప్రభుత్వ ఇంటర్‌ విద్య ప్రాభవం క్షీణించింది.

స్వరాష్ట్రంలో విద్య పటిష్టతకు సీఎం కేసీఆర్‌ దార్శనికతతో, అంబేద్కర్‌, పూలేల విద్యా దృక్పథంతో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిబంధనలను పాటించని 850 ప్రైవేట్‌ కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల అనుమతిని నిరాకరించారు. 2014 నుంచి ప్రైవేట్‌ రంగంలో నూతన కళాశాలలకు అనుమతి ఇవ్వడంలేదు. తెలంగాణ పునర్నిర్మాణంలో క్రియాశీలంగా, సామాజిక విద్యను సృజనశీల సామాజిక బాధ్యతతో, మానవ వనరు లుగా రూపొందడానికి మార్గం సుగమమవుతున్నది. ఈ ఏడేండ్లలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలు అడ్మిషన్లలో 85 శాతం పైగా పెరుగుదలను నమోదు చేయటం గమనార్హం.

2023-24 విద్యాసంవత్సరం లో 2.80 లక్షల విద్యార్థుల సామర్థ్యం కలిగిఉన్న 405 ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు 30కి పైగా జనరల్‌ కోర్సులు, 80కి పైగా వృత్తివిద్యా కోర్సులను అభ్యసిస్తున్నారు. ఇవే కాకుండా 6,8 నెలల స్వల్ప వ్యవధి వృత్తి విద్యాకోర్సుల్లో వేలమంది విద్యార్థులు చేరారు.
ప్రభుత్వ కాలేజీల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరడంలో అధ్యాపకుల కృషి ప్రశంసనీయం. సామాజిక హోదాకు, జీవన భద్రతకు కారణమైన ఇంటర్‌ విద్యావ్యవస్థ పరిరక్షణ, వికాసాలకు మలిదశ తెలంగాణ ఉద్యమకాలంలోనే పునాదులు పడ్డాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. నిర్దేశించిన పనిగంటల కంటే అదనంగా పనిచేస్తున్నారు. రెమిడియల్‌ క్లాసులను నిర్వహిస్తున్నారు. దీంతో నిరుపేద విద్యార్థులే కాకుండా, మధ్యతరగతి విద్యార్థులు కూడా ప్రభుత్వ కళాశాలల్లో చేరుతున్నారు.

ఈ అనూహ్య నమోదు, పెరుగుదల విజయం లో అత్యధిక భాగస్వామ్యం ఒప్పంద అధ్యాపకులదే. గ్రంథాలయ పాలకులకు పూర్తిస్థాయి అధ్యాపకహోదా కల్పించాల్సిన అవసరమున్నది. ఆచార్య జయశంకర్‌ అధ్యాపక శిక్షణా కేంద్రాన్ని అకడమిక్‌ స్టాఫ్‌ కళాశాలగా అభివృద్ధి చేసుకోవాలి. స్థానిక వనరులు, అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను రూపొందించు కోవాలి. ఇంటర్‌ విద్య స్వర్ణోత్సవ సందర్భంగా గుణాత్మక ఉచిత విద్య ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషిచేయాలి. ఇప్పటికే యావత్‌ దేశానికి మార్గ దర్శకంగా ఉన్న ప్రభుత్వ ఇంటర్‌విద్య ప్రాభవం ద్విగుణీకృతం అవుతుంది.

అలాగే దేశంలోనే మొట్టమొదటిసారిగా కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ల సర్వీసును క్రమబద్ధీకరించి ఉద్యమ కాలం నాటి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న దీశాలి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో కాంట్రాక్ట్ సర్వీస్ క్రమవద్దీకరించబడిన జూనియర్ లెక్చరర్ల బాధ్యత మరింత పెరిగి ఇంటర్ విద్య అభివృద్ధికి మరింత కృషి చేయాల్సి ఉంది. ఉద్యమ కాలం నుండి కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ క్రమబద్ధీకరణ అంశంలో టీజిఓ సంస్థ తోడుగా ఉండి పలుమార్లు ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలు అందజేసి క్రమబద్ధీకరణ సాధనలో ముందడుగులో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు తోడ్పాటు అందించిన టి జి ఓ వ్యవస్థాపకులు, మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ కృషి మరువలేనిది.

వ్యాసకర్త: అస్నాల శ్రీనివాస్‌, ఇంటర్‌ విద్య తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం,రాష్ట్ర కార్యదర్శి