“బతుకమ్మ బ్రతుకు
గుమ్మడి పూలు పూయగా బ్రతుకు,
తంగెడి పసిడి చిందగా బ్రతుకు
గునుగు తురాయి కులుకగ బ్రతుకు
కట్ల నీలిమల చిమ్మగా బ్రతుకు ” అని ప్రజా కవి కాళోజి
తెలంగాణ వారసత్వ సంపద బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియచేశారు.సృష్టిలో ప్రతి జీవిది బ్రతుకు పోరాటమే. బ్రతుకుతో ఇంత ప్రత్యక్ష సంబంధమున్న ఉన్న పండుగ మరొకటి లేదు.ప్రకృతితో భూమితో మనిషికి ఉండే సంబంధాన్ని స్పష్టంగా చెప్పిన పండుగ. ప్రకృతిలోని నిబిడీకృతమైన నిసర్గ సౌందర్యాన్ని తెలంగాణ గుమ్మం ముందు నిలిపిన పండుగ బత్కమ్మ.
పుష్పం పునరుత్పత్తికి ప్రతీక, మానవ సమాజం దరిత్రి పై అవిచ్చిన్నంగా కొనసాగడానికి స్త్రీ కి ప్రకృతి కల్పించిన ప్రత్యేక ధర్మం సంతానోత్పత్తి. తల్లి కడుపులో శిశువు పెరుగుదలతో పాటు దాని జీవన సారాలన్ని బొడ్డు తాడు ద్వారానే తీరుతాయి.ఈ బొడ్డు తాడుకు, మహత్యాన్ని, దైవత్వాన్ని అపాదించి రూపం కలిపిస్తే బొడ్డెమ్మ అవుతుంది. ఈ మహోన్నత పవిత్ర కృతజ్ఞత ను వ్యక్తం చేసుకోవడం కోసం పూలను బత్కమ్మ గా,బొడ్డెమ్మగా కొలిచే అద్వితీయ సాంప్రదాయం కేవలం తెలంగాణ మాగాణానికి మాత్రమే సొంతం.
ప్రకృతిలోని నిబిడీకృతమైన నిసర్గ సౌందర్యాన్ని తెలంగాణ గుమ్మం ముందు నిలిపిన పండుగ బత్కమ్మ. – అస్నాల శ్రీనివాస్
తెలంగాణ అంటేనే జాతర, పండుగలు, బహుజన దేవతారాధన. ఇక్కడి చెట్టు, పుట్ట, చేను, చెలక, పిట్ట, పువ్వు అన్నింటికీ ఒక చరిత్ర ఉంటుంది. కాకతీయుల సామ్రాజ్య పాలకులు తెలంగాణ అంతటా చెరువులను తవ్వించడం ఒక ప్రధానమైన పనిగా పెట్టుకున్నారు. చెరువులను అభివృద్ధికి ప్రతీకలుగా భావించారు. భూమి స్వభావం, కురిసే వర్షం వాగుల్లో ప్రవాహం, నీటి నిలువ, ఆయకట్టు చెరువుల సామర్ధ్యం, తూములు కాలువల నిర్మాణాలను వీరు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. కాకతీయ పాలన తెలుగునేలపై దాదాపు మూడు వందల యాభై సంవత్సరాలు సాగింది. ఒక జల సూత్రాన్ని, జల శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. అప్పటినుండి ఈ పండుగ సాంప్రదాయాన్ని జానపదులు కాపాడుతూ వస్తున్నారు. చిరు మార్పులతో ఆనాటి పండుగను నేటికీ జరుపుతున్నారు. కాకతీయులు చెరువుల నిర్మాణం లో ప్రత్యేక శ్రద్ధ వహించారు అనడానికి మనకు కావలసిన ఆధారాలు నేటికీ నిలిచి ఉన్నాయి దశ బంధచెరువులు, గొలుసుకట్టు చెరువులు లక్నవరం, రామగుండం, దోమకొండ, కంభం లాంటి అనేక చెరువులు. ఒక చెరువు నిండితే దానిలోని అదనపు నీరు అలుగుగా దాని కింద ఉన్న ఇంకో చెరువులోకి వెళుతుంది. ఇలా అనేక గొలుసుకట్టు చెరువులు ఉండేవి. ప్రత్యేక వ్యవసాయ శాస్త్రం ఏర్పడి జొన్నలు, వడ్లు, కందులు,పెసలులలో వందలాది రకాలను సాగు చేశారు. మొలకలు, తీగెలు, మొగ్గలు, పువ్వులు, పిందెలు, కాయలలోనే బతకమ్మ పుట్టిందని, వెన్నెల చీర కట్టుకొని పూల జోళ్ళు వేసుకుందని ఇలాంటి ఇతివృత్తాలతో ఆనాటి సాహిత్యం ఉంది.
తెలంగాణ అంటేనే జాతర, పండుగలు, బహుజన దేవతారాధన. ఇక్కడి చెట్టు, పుట్ట, చేను, చెలక, పిట్ట, పువ్వు అన్నింటికీ ఒక చరిత్ర ఉంటుంది. – అస్నాల శ్రీనివాస్
అంతే కాకుండా నీరును, సాగును, ప్రకృతిని గౌరవించే కాకతీయ బత్కమ్మ నిత్య యుద్ధాలతో మునిగిపోయిన గంగ, నర్మద, యమున , కావేరి, సరయు, తుంగభద్ర, ముచికుంద వంటి నదుల పరివాహక ప్రాంతాలకు విస్తరించాలని, అక్కడి ప్రజలు సుందర సౌభాగ్య,కారుణ్యంతో జీవించాలని కోరుకుంది. ప్రజలు సుభిక్షంగా ఉండేడి చెరువుల వల్ల కాబట్టి అందరూ కలిసి ఏడాదికొకసారి చెరువులకు పూలతో కృతజ్ఞతలు చెప్పేవారు అందుకే బతుకమ్మ చెరువుల పండుగ.
కరువులు వచ్చినప్పుడు ” కన్నీరు కాలువలై పారే ఉయ్యాలో, చెరువులే నిండే ఉయ్యాలో, సాగరాలంతా చెరువులు ఉయ్యాలో “బావిని తొడించి ఉయ్యాలో బత్కమ్మను పూయించాలో ఉయ్యాలో ‘అని జానపదులు పాడుకునే వారు.
పండుగ జరిపే నాటికి వర్షరుతువు ముగింపులో ఉంటుంది చలి అప్పుడప్పుడే ప్రారంభమవుతుంది సెప్టెంబర్ చివర్లో అక్టోబర్ బతుకమ్మ పండుగ వస్తుంది ఈ సమయంలో వాతావరణం ఆహ్లదకరం, పరిమళ భరితంగా ఉంటుంది. చెరువులు కుంటలు వాగులు నీలి బంగారంతో నిండి ఉంటాయి . ఎటు చూసినా ఆకుపచ్చ రంగు ఉంటుంది. పలు రకాల పుష్పాలు విరబూసి నేలపై సింగిడి ఏర్పడుతుంది.
బతుకమ్మ లో వాడే గునుగు తంగేడు గుమ్మడి వంటి అనేక పుష్పాలు చెరువు నీటిని శుద్ధి చేస్తాయి కుళ్ళి పోయిన తర్వాత చెరువు మట్టిని బలవర్ధకం చేస్తాయి వచ్చిన రైతులు తమ పొలాల్లో చల్లుకుంటారు భూమిని మరింత సారవంతం చేసుకుంటారు. – అస్నాల శ్రీనివాస్
బతుకమ్మ లో వాడే గునుగు తంగేడు గుమ్మడి వంటి అనేక పుష్పాలు చెరువు నీటిని శుద్ధి చేస్తాయి కుళ్ళి పోయిన తర్వాత చెరువు మట్టిని బలవర్ధకం చేస్తాయి వచ్చిన రైతులు తమ పొలాల్లో చల్లుకుంటారు భూమిని మరింత సారవంతం చేసుకుంటారు. ఆరోగ్యకర పంటలు పండుతాయి. సుస్థిర ప్రకృతి అనుకూల అంశాలను ఇముడ్చుకున్న పండుగ. పండుగ కొనసాగుతున్న 18 రోజులు పంచే మలీద సున్ని ఉండలు, సర్వపిండి, గుడాలు వంటి ఫలహారాలలో పుష్కలమైన ఖనిజ, విటమిన్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
ప్రేమలు, ఆప్యాయతలు, మానవ సంబంధాలను చిక్క పరిచే బత్కమ్మ తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నంత వరకు వర్ధిల్లుతూనే ఉంటుంది. – అస్నాల శ్రీనివాస్
సాధారణ రోజుల్లో గ్రామీణ మహిళల ఆట పాటకు ఉండే ఆంక్షలు బత్కమ్మ రోజుల్లో అదృశ్యమవుతాయి.ఇసుకలో పెట్టె బత్కమ్మ, ఇసుకలో ఆడే బత్కమ్మ గా పుప్పొడిని తలపించే ఇసుక ఉన్న ప్రదేశంలో బత్కమ్మలను పేర్చి ,భూమవ్వ కు బలాన్ని ఇచ్చే వెంపలి మొక్కను మధ్యలో పెడతారు. స్త్రీలు పట్టు వస్త్రాలు, తల నిండా పూలు పెట్టుకొని లయబద్ధమైన పాదపు కదలికలు, లలితమైన చప్పట్ల మ్రోతలతో తమ ప్రాంత చరిత్ర విశిష్టతను, సున్నిత హాస్యాలను, పరిహాసాలను ఆశువుగా అద్భుతమైన సారస్వత ప్రమాణాలతో, సమిష్టి జీవన శ్రమ గౌరవ గల పాటలతో తమ వెతలను, ఆనందాన్ని వెల్లడిస్తారు. ప్రజల కోసం ప్రాణమిచ్చిన అమరుల స్మృతి గీతాలను పాడుతారు. రస రమ్య మోహనరాగాలతో ఒక అలౌకిక ప్రపంచంలో విహరించి మానసిక సాంత్వన అనుభూతిని పొందుతారు.
ప్రేమలు, ఆప్యాయతలు, మానవ సంబంధాలను చిక్క పరిచే బత్కమ్మ తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నంత వరకు వర్ధిల్లుతూనే ఉంటుంది.
అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వరంగల్
9652275560