అంబేద్కర్ – కేసీఆర్ (ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి) – ఆస్నాల శ్రీనివాస్

BIKKI NEWS : భారత స్వాతంత్ర సమరంలో తరువాత దేశ నవ నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం రాజకీయ ప్రక్రియతో బడుగు బలహీన వర్గాలకు మహిళలకు న్యాయమైన వాటా కోసం రచించిన వ్యూహాలపై నిర్దేశించిన విధానాలపై నిర్వహించిన సమరశీల పోరాటాలపై చెరగని ముద్ర వేసిన మహానీయుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్. ఈ దేశ సామాజిక్ వ్యవస్థ భౌగోళిక స్వరూపం ఆధారంగా నిరుపమాన అధ్యయనంతో జాతీయోద్యమ ప్రజల ఆకాంక్షలతో ప్రతిబింబించే రాజ్యాంగాన్ని అందించాడు. విసుగు విరతి లేని జ్ఞాన అన్వేషణ, పీడిత ప్రజల పట్ల అనుకంపనతో జీవించాడు. ప్రపంచ జ్యోతి బుద్ధుడు, సామాజిక విప్లవ ఆరంభకుడు పూలేల దివిటిని అందుకుని ఒక ఇతిహాసంగా సామాజిక ఆర్ధిక విప్లవాన్ని గొప్ప ముందంజ వేయించి దేశ చరిత్ర గతిని మార్చిన మహోన్నతుడు అంబేద్కర్. ఆయన మేధస్సు, ఆచరణ ప్రతిష్ట కొన్ని రంగాలకు పరిమితం చెయ్యడం న్యాయం కాదు. అసమానతల దొంతరగా ఉన్న ఆమానవీయ సమాజాన్ని మార్చిన తాత్వికుడిగా అబివృద్ధి ఫలాలు అందరికి అందించే నిర్మాతగా యుగకర్తగా చరిత్రలో నిలిచిపోయారు. అంబేద్కర్ చేసిన సేవలు, ఆలోచనలు మానవ మర్యాద కోసం, అంతరాలు లేని సమాజం కోసం, దోపిడి పీడనలు లేని వ్యవస్థ నిర్మాణం కోసం అనే స్పృహ ని భారతీయ సమాజం కలిగి ఉన్నందువల్లే ఆయన దూరమయ్యి అరవై మూడు సంవత్సరాలు దాటిన ఈ నాటికి ప్రజలు ఆయన జయంతులు, వర్ధంతులు జరుపుకుంటారంటే అంబేద్కర్ చెప్పిన విషయాలు ఎంతటి సమకాలీనతను, ప్రాసంగికతను కలిగి ఉన్నాయనడానికి నిదర్శనం.

అంబేద్కర్ ఏర్పాటు చేసిన ప్రకరణ ౩ మన తెలంగాణ రాష్ట్ర పోరాటానికి దిక్సూచిగా తాత్విక సమర్ధనను ఇచ్చాయి. అంబేద్కర్ చూపించిన మార్గంలో అరవై ఏళ్ళ స్వరాష్ట్ర తెలంగాణ పోరాటానికి జాతీయ స్థాయిలో బలమైన మద్ధతు లభించి స్వరాష్ట్ర కల సాకారమయ్యింది. – అస్నాల శ్రీనివాస్

భారతదేశ భవితవ్యానికి సంబదించిన అనేక విషయాల గురించి అంబేద్కర్ అలోచించి, విశ్లేషించి వివరించాడు. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ, స్వరూపం, స్వభావాల గురించి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఏర్పాటు చేసిన ప్రకరణ ౩ మన తెలంగాణ రాష్ట్ర పోరాటానికి దిక్సూచిగా తాత్విక సమర్ధనను ఇచ్చాయి. అంబేద్కర్ చూపించిన మార్గంలో అరవై ఏళ్ళ స్వరాష్ట్ర తెలంగాణ పోరాటానికి జాతీయ స్థాయిలో బలమైన మద్ధతు లభించి స్వరాష్ట్ర కల సాకారమయ్యింది. తెలంగాణ హృదయంలో అంబేద్కర్ చిరస్మరణీయుడు అయ్యాడు. రాష్ట్రాల ఏర్పాటు పై మాట్లాడుతూ భాషా ప్రాతిపదికలపై రాష్ట్రాల నిర్మాణం జరగడం శ్రేయస్కరం కాదని వివరించాడు. భాషా దురభిమానం పెరిగి విచ్చిన్న ధోరణులు ఏర్పడే అవకాశముంది అన్నాడు. అల్ప సంఖ్యాకులు అణిచివేతకు గురయ్యే అవకాశం ఉంది అన్నాడు. ఇది స్పర్ధలకు ఘర్షణలకు దారి తీస్తాయి. ఒక వేళ రాష్ట్రాల ఏర్పాటుకు భాషా ప్రాతిపదిక అనివార్యం అయినప్పుడు “ఒక రాష్ట్రానికి ఒకే భాష కాని ఒక భాషకు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని సూచించాడు. అలాగే రాష్ట్రాల ఏర్పాటుకు జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ఆర్ధిక స్వాలంబన అనే కొలమానాలు ప్రతిపాదించాడు. ఇవన్నీ తెలంగాణకు సరిగ్గా వర్తిస్తాయి. చిన్న రాష్ట్రాలు సమర్ధవంతమైన పరిపాలన ఏర్పాటు చేసుకోవడానికి, ఆ ప్రాంతపు ప్రత్యేక అవసరాలను తీర్చటానికి వీలవుతుంది. ప్రజల మనోభావాలు తృప్తి పడుతాయి. ఈ విధంగా అంబేద్కర్ తన మేధో శ్రామికత్వంతో ఇచ్చిన విలువైన సూచనలు, రాజకీయ సాంఘీక విప్లవ కొనసాగింపుకు ఆయన అనుసరించిన రాజ్యాంగబద్ద సమరశీలతను ఆవాహన చేసుకున్న కే సీ ఆర్ అంతిమ విజయాన్ని సాధించి పెట్టాడు. నీళ్ళు, నిధులు, నియమాకాల పట్ల జరుగుతున్న దారుణ వివక్ష నుండి, తెలంగాణ అస్థిత్వ జవ జీవమైన సాంస్కృతిక గుర్తింపు చెదిరి పోతున్న సంధర్భంలో ఒక ఇతిహాసమై, చరిత్రలో మహోజ్వల ఘట్టంగా తెలంగాణ ఆవిర్భావం జరిగింది.

ప్రపంచ జ్యోతి బుద్ధుడు, సామాజిక విప్లవ ఆరంభకుడు పూలేల దివిటిని అందుకుని ఒక ఇతిహాసంగా సామాజిక ఆర్ధిక విప్లవాన్ని గొప్ప ముందంజ వేయించి దేశ చరిత్ర గతిని మార్చిన మహోన్నతుడు అంబేద్కర్. – అస్నాల శ్రీనివాస్

ఆధునిక భారతీయ పునరుజ్జీవన ఉద్యమ వెలుగుగా కొనసాగిన అంబేద్కర్ తాత్విక ధారలో ముఖ్యమైన “సంక్షేమ రాజ్యభావన ” ను కేసీఆర్ గత ఏడు సంవత్సరాలుగ కొనసాగిస్తున్నాడు. ప్రజలకు సాధ్యమైనంత తక్కువ కాలంలో సాధ్యమైనంత ఎక్కువ ప్రమాణంలో సంక్షేమ రాజ్య ఫలాలను అందచేస్తున్నాడు. స్వరాష్ట్ర ఉద్యమంలో ప్రజలు తనపై మోపిన బృహత్తర భాద్యతను అగ్రగామిగా నిర్వహిస్తూ నిరంతర చలనశీలతతో తన సహచరులతో, పాలనాధికారులతో మమేకమవుతూ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు.

స్వతంత్ర భారత్ చరిత్రలోనే తోలి సారిగా రైతు బంధు పథకాన్ని విజయవంతంగా కేసీఆర్ అమలు చేస్తున్నాడు. భూకమతాల విభజనలను చిక్కులను ధరణి ద్వారా తొలగిస్తున్నారు. కోటి ఎకరాల సతత హరిత తెలంగాణ మాగాణంగా తీర్చిదిద్దుతున్నారు. – అస్నాల శ్రీనివాస్

అంబేద్కర్ వ్యవసాయాన్ని మౌలికమైన పరిశ్రమ గా గుర్తించారు. ఆహార ఉత్పత్తి కి సంబందించినది కాబట్టి అధిక ప్రాధాన్యతను ఇచ్చి భూమి సక్రమ వినియోగానికి సరైన పెట్టుబడిని, ఉత్పత్తి సాధనాలను సమకూర్చాలని, పంటల బీమాను అమలు చేయాలని నీటిపారుదల సౌకర్యాలని కలిగించాలని వీటికే రాజ్యం బాధ్యత వహించాలని అన్నాడు. ఈ వెలుగులో స్వతంత్ర భారత్ చరిత్రలోనే తోలి సారిగా రైతు బంధు పథకాన్ని విజయవంతంగా కేసీఆర్ అమలు చేస్తున్నాడు. భూకమతాల విభజనలను చిక్కులను ధరణి ద్వారా తొలగిస్తున్నారు. కోటి ఎకరాల సతత హరిత తెలంగాణ మాగాణంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రజల తక్షణ బాగోగుల కోసం పుట్టుక నుండి జీవితాంతం వరకు కేసీఆర్ కిట్స్, కళ్యాణలక్ష్మి , ఆసరా పెన్షన్లు, ఆరోగ్య రక్షణ, సన్న బియ్యం, గృహాలకు ఉచిత విద్యుత్ లను అందిస్తూ యస్సి, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను ఏర్పాటు చేస్తూ భారీ కేటాయింపులు చేస్తున్నారు. వృత్తి పనివారల నైపుణ్య శిక్షణ కేంద్రాలను బాగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కార్పోరేషన్ ను ఏర్పాటు చేస్తున్నారు. స్త్రీలు సాధించిన అభివృద్ధి ఆధారంగా సమాజ ప్రగతి నిర్ధారించబడుతుందనే అంబేద్కర్ దార్శనికత లొ శిశు సంక్షేమం, స్త్రీల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇటీవల బిసి మహిళలకు ఆపత్ బంధు పథకాన్ని ప్రారంభించారు.అంగన్ వాడి టీచర్ల, ఆశ వర్కర్ల జీతాలను పెంచారు. భాదిత మహిళలను రక్షించటం కోసం సఖి కేంద్రాలను ఏర్పాటు చేసారు. బాలికల డ్రాప్ అవుట్స్ ని తగ్గించడం కోసం హెల్త్ కిట్స్, భారీ సంఖ్యలొ గురుకుల బడులను ,కళాశాలను ప్రారంభించారు. వీధి బాలలను, బాల కార్మికులను రక్షించి విద్యను అందివ్వడం కోసం ఆపరేషన్ ముస్కాన్. ఆపరేషన్ స్మైల్ లను నిర్వహిస్తున్నారు.

అంబేద్కర్ విద్య పై ‘నాగరికత వలన లభించే భౌతిక ప్రయోజనాలను వదులుకోవచ్చుకాని విద్యను పొందే అవకాశం హక్కు దాని ఫలాలను అందుకోవడంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపరాదు అని బోధించాడు. గురుకుల విద్యను అందించడం ద్వారా శ్రామిక వర్గాల పిల్లలు ఎలాంటి ఒత్తిడి, సమస్యలు లేకుండా గుణాత్మక విద్యను అందించవచ్చని చెప్పాడు. స్వరాష్ట్రం సిద్ధించాక యస్సి ఎస్టీ బి సి మైనారిటీ లకు 1000 కి పైగా గురుకులాలలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఇవన్నీ ఉత్కృష్ట స్థాయిలో నిర్వహించబడుతున్నాయి. జనరల్ విద్యా సంస్థలను కూడా గురుకులాలుగా మార్చాలని పౌర సమాజం డిమాండ్ చేస్తున్నది. ఈ విధంగా ప్రభుత్వ విద్యను ప్రజల హక్కుగా మార్చిన అంబేద్కర్ బాటలో తెలంగాణ ప్రభుత్వం తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది.

అంబేద్కర్ విద్య పై ‘నాగరికత వలన లభించే భౌతిక ప్రయోజనాలను వదులుకోవచ్చుకాని విద్యను పొందే అవకాశం హక్కు దాని ఫలాలను అందుకోవడంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపరాదు అని బోధించాడు – అస్నాల శ్రీనివాస్

అంబేద్కర్ “సమాఖ్య “పాలనా రూపం గురించి వివరిస్తూ “రాజ్యాంగ శాసనం ద్వారా ఏర్పడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిమితులు ఏర్పరుచుకుని అధికారాలను విభజించుకోవటం, ఇతరుల అధికారాలను పరిమితం చేసే అధికారం ఉండకూడదు అని చెప్పాడు. కాలక్రమంలో జాతీయ పార్టీల పాలకులు ఆర్ధిక, రాజకీయ అధికారాలను ఎక్కువగా తమ గుప్పిట్లో ఉంచుకుని రాష్ట్రాల పై పెత్తనం చలాయిస్తున్నారు. పెఢరల్ ఫ్రంట్ దిశగా అంబేద్కర్ సూచించిన సమాఖ్య స్పూర్తి అమలు కోసం కేసీఆర్ జాతీయస్థాయి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు .

వివేకి, మంచివాడు, దేశకాల అవసరాలు తెలిసిన విజ్ఞుడు, సమాజాన్ని సన్మార్గంలో నడిపించిన సాహసిగా అంబేద్కర్ ను కాలం మనకు అందించినది. చరిత్రను వెనక్కు నడిపించే ప్రతిఘాతక శక్తుల నుండి చరిత్రను ముందుకు నడిపించిన వైతాళికుడిగా అంబేద్కర్ చిరస్మరణీయుడు. సమకాలీన భారతంలో ప్రజల ప్రగతిని, సమాజాన్ని ముందుకు సాగకుండా చేసే ఆధిపత్యాన్ని పునరుద్ధరించే శక్తులు పొంచి ఉన్నాయి. పాత అలవాట్లు ,పాత ధోరణులు, పాత ఆలోచనలతో తిరోగమనంలో ముందంజ వేయడానికి మోడి సంఘ్ పరివార శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజల సంక్షేమమే పరమావధిగా నడవాల్సిన రాజకీయాలు వ్యక్తిగత విశ్వాసాలైన మతం, ఆరాధనా స్థలాల చుట్టూ తిరుగుతూ వాటి ఆధారంగా మరల అధికారాన్ని పొందే అవాంచనీయ ధోరణులు కొనసాగుతున్నాయి. ఈ నేపద్యమంలో అంబేద్కర్ అలోచనా ధారలో స్వరాష్ట్రం సాధించుకున్న తెలంగాణం ఆయన సాధించి పెట్టిన అపూర్వ ఫలితాలను కాపాడుకుంటూ మన పై మోపిన భాద్యతలను కొనసాగించడంలో ముందువరసలో ఉండాలి. అంబేద్కర్ మన మధ్య ఉంటే “తను నిర్ధారించిన ప్రమాణాల వెలుగులో “ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటందని “సంతోషపడేవారు. అంబేద్కర్ సంక్షేమ రాజ్య భావనను కొనసాగిస్తూ వాటి ఫలాలను ప్రజలకు అందిస్తూ ఆయనను కొనసాగిస్తున్న తెలంగాణను దేశానికి ఒక నమూనాగా నిలబెట్టే కృషిలో మమేకమవ్వడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాలి.

అస్నాల శ్రీనివాస్
రాష్ట్ర కార్యదర్శి
తెలంగాణ ఇంటర్ విద్య గెజిటెడ్ అధికారుల సంఘం