ఇంటర్ లో యోగా, ధ్యానం, ఆటలు తప్పనిసరి

హైదరాబాద్ (ఆగస్టు 10) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ధ్యానం, యోగా, రిలాక్సేషన్ ఎక్సర్ సైజులను ప్రవేశపెట్టాలని ఇంటర్ విద్యా శాఖ ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని అన్ని కాలేజీ యాజమాన్యాలు తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొన్నారు.

విద్యార్థుల, శారీరక, మానసిక ఆరోగ్యం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటర్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఈ మేరకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళనను దూరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు.

★ తీసుకోవాల్సిన చర్యలు

నెలకొకసారి తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి. విద్యార్థుల ప్రగతిని తెలియజేయడంతోపాటు వారు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు చూపుతారు.

సాయంత్రం వేళల్లో ఆటలు, క్రీడలు తప్పనిసరి చేశారు.

విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా సైకాలజికల్ కౌన్సిలర్లను నియమించారు.

కాలేజీలు అకడమిక్ పనితీరే కాకుండా విద్యార్థుల మానసిక ఒత్తిడిని పరిశీలించాలి. ఆ ఆందోళన, ఒత్తిడిలను అధిగమించడంతో పాటు, కెరీర్ కౌన్సిలింగ్, ఏకాగ్రతను మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు.

నిపుణులతో ఉపన్యాసాలు, స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు ఏర్పాటు చేయాలి.