- ఐరాస ప్రధాన కార్యాలయంలో వేడుక
పాల్గొననున్న ప్రధాని మోదీ
హైదరాబాద్ (జూన్ – 21) : న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జూన్ 21న చరిత్రాత్మక యోగా దినోత్సవం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఘనంగా జరగనుంది. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2014లో గుర్తించిన తర్వాత జరుగుతున్న 9వ ఉత్సవమిది.
ఈసారి ఐరాస ప్రధాన కార్యాలయంలో అధికారికంగా నిర్వహించనుండటం, ప్రధాని మోదీ హాజరుకానుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా కాలమానం ప్రకారం.. ఉదయం 8 గంటల నుంచి 9 వరకూ ఈ యోగా కార్యక్రమం జరగనుంది.
ఐరాస ప్రధాన కార్యాలయంలోని నార్త్ లాన్ లో యోగా కార్యక్రమం ఉదయం 8 నుంచి 9 గంటల వరకూ జరగనుంది. భారత్ బహూకరించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని గత ఏడాది డిసెంబరులో ఇక్కడే ప్రతిష్ఠించారు. గాంధీకి ప్రధాని మోదీ నివాళులర్పించాక యోగా కార్యక్రమం ప్రారంభమవుతుంది. 180 దేశాలకు చెందిన ప్రతినిధులు యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు.