BIKKI NEWS (MARCH 30) : దక్షిణ భారత దేశంలో విరివిగా తినే అల్పాహార వంటకం ఇడ్లీ. టిఫిన్ అంటే మొదట గుర్తు వచ్చే వంటకం ఇడ్లీ. మినప పప్పు, బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని ఆవిరితో ఉడికించి తయారు చేస్తారు. ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని మార్చి 30వ తేదీన(world idly day) జరుపుకుంటారు
మినప్పప్పు లోని మాంసకృత్తులూ, బియ్యంలోని పిండి పదార్థాలు కలిసి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. పిండి పులియడం వల్ల శరీరం సులభంగా జీర్ణించుకోగల చిన్న పదార్థాలుగా విచ్ఛిన్నం చెందుతుంది. అందుకే దీన్ని పసి పిల్లలకూ, అనారోగ్యంతో బాధ పడేవారికీ తరచుగా తినిపిస్తూ ఉంటారు.
HISTORY OF IDLY
ఇండొనేషియన్లు అనేకరకాల పులియబెట్టే వంటకాలు వండేవారు. అందులో ఇడ్లీకి పోలికలున్న కేడ్లీ అనే వంటకము కూడా ఉంది. 800 – 1200 మధ్య కాలములో ఇండోనేషియాకు హిందూ రాజులతో పాటు వెళ్లిన వంటవాళ్లు, పులియపెట్టే పద్ధతులూ, అవిరిపెట్టే పద్ధతులతో పాటు వాళ్ల వంటకము కేడ్లీని దక్షిణ భారతదేశానికి తెచ్చారని ఒక భావన కానీ కచ్చితముగా నిర్ధారించుటకు ఆధారములు లేవు.
తొలిసారి ఇడ్లీ వంటి వంటకము యొక్క ప్రస్తావన (ఇడ్డలిగే) 920లో శివకోట్యాచార్య యొక్క “వడ్డారాధనే” అనే కన్నడ రచనలో ఉంది. ఆ తరువాత 1130లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి మూడవ సోమేశ్వరుడు రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము మానసోల్లాసలో ఇడ్లీ తయారు చేసే విధానము ఇవ్వబడింది. అయితే ఈ రచనలలో ఆధునిక ఇడ్లీ తయారీకి ప్రధాన భాగలైన మినపప్పుతో పాటు బియ్యపుపిండి కలపడము, పిండిని పులియబెట్టడము, పిండి పొంగడానికి ఆవిరిపట్టడము మొదలైన విషయాల గురించిన ప్రస్తావన లేదు.
ఇడ్డెన అని తెలుగు దేశ్యపదం ఉన్నది. ఇప్పటికీ పల్లెటూరివాళ్ళు ఇడ్డెన, ఇడ్డెన్లు, ఇడ్నీలు అంటుంటారు. పల్లెటూరి వాడుక ప్రకారం ఇడ్నీ క్రమంగా ఇడ్లీ అయి ఉండవచ్చును.
★ ఇడ్లీలో పోషకవిలువలు
ఇడ్లీ ఆరోగ్యకరమైన అల్పాహారం. మధ్యరకం సైజు ఇడ్లీ నుండి సుమారు 50 క్యాలరీలు లభిస్తాయి. ఇందులో 0.2 గ్రా కొవ్వులు, 1.43 గ్రా మాంసకృతులు, 11.48 గ్రా పిండి పదార్థాలు, 1.1 గ్రా పీచు పదార్థాలు, 279 మి.గ్రా సోడియం, 9 మి.గ్రా పొటాషియం, 1 మి.గ్రా ఇనుము లభిస్తాయి. ఇందులో రోజువారీ పనులకు అవసరమయ్యే పోషకాలన్నీ దాదాపుగా లభిస్తాయి.