అతి’వలలో’…దేవతలు – తెలంగాణ మగువలు ఉమెన్స్ డే-శుభాకాంక్షలు- జబీ

  • అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా సయ్యద్ జబీ ప్రత్యేక వ్యాసం

BIKKI NEWS : యత్రనార్యస్తు పూజ్యంతె రమంతే తత్ర దేవతాః “ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారని శ్లోకం చెబుతుంది, కార్యేషుదాసి, కరణేషు మంత్రి, భోజేషుమాతా, శయణేసు రంభ అని కీర్తించబడ్డ స్త్రీ, ఒక తల్లిగా చెల్లిగా భార్యగా, కూతురిగా ఇంటికి దీపం అయిన స్త్రీ అన్ని రంగాలలో మహిళా సాధికారతతొ గౌరవింపబడుతూ దేవతలు సంచరించే ప్రదేశంగా మారుతుంది తెలంగాణ”

నిజానికి స్త్రీ లేనిదే సృష్టి లేదు, ఈ సృష్టికి మూలం స్త్రీ, పాప పుడితే ఇంట్లో లక్ష్మీదేవి వచ్చిందంటారు. చీకట్లో వెళుతురుగా, నీరసంగా ఉన్న హృదయంలొ అమృత ధారగా, ఆకురాల్చే ఎండల్లో పచ్చని వెచ్చదనంగా వర్ణింపబడుతుంది. ఆడపిల్ల, అక్కగా ఆప్యాయత, చెల్లిగా చిలిపి సరదా చేష్టలతో సంతోషాన్ని పంచుతుంది, ఒక ఇల్లాలిగా ఆదరిస్తూ ప్రేమామృతాన్ని పంచుతూ మనసుకు అహ్లాదాన్నిస్తూ, స్వార్ధం లేని త్యాగంతో మగవానికి సగభాగమై తన జీవితాన్ని అంకితం చేస్తుంది. తల్లిని సైతం మైమరిపించి కష్టసుఖాలలో తోడూ నీడగా నిలుస్తుంది, కన్న వారి ప్రేమను బంధాలను సైతం త్యాగం చేసి మరో ఇంటిని చక్కదిద్దడానికి సింహంలా ఒంటరిగా బయలుదేరుతుంది, స్త్రీ లేని ఇల్లు వల్లకాడులా అనిపిస్తుంది. తండ్రి లేకుంటే పిల్లకు అంత బాధ అనిపియ్యకపోవచ్చు, కాని తల్లి లేకుంటే మాత్రం పిల్లలు తట్టుకోలేరు, ఉండలేరు, అందుకే ఆడవారు ఇంటికి దీపం లాంటి వారు. స్త్రీతొ ఇల్లు శోభాయమానంగా ఉంటుంది, తన కార్యంలో అలసిపోకుండా పనులు చేస్తూ దాసిగా, సూచనలు సలహాలిస్తూ మంత్రిగా, అన్నం పెట్టే తల్లి ప్రేమ, సుఖాన్ని పంచే రంభగా భార్య ప్రేమను అందిస్తుంది స్త్రీ,
ఏ హృదయం లో అయితే త్యాగం, జాలి, దయ, ప్రేమ, కరుణ, ఓర్పు, సహనం, కష్టం, దుఖం ఉండి కూడ అమృతాన్ని పంచుతుందో అది ఖచ్చితంగా స్త్రీ హృదయమే ఉంటుందనడంలో సందేహం లేదు.!

ఇంతటి త్యాగమూర్తులైన మహిళలు వంటింటికే పరిమితం అవడం, అనేక ఆంక్షలు, కట్టుబాట్లకు, అనేక దురాచారాలకు గురవడం, వరకట్న బాధితులుగా, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ నాలుగు గోడల మద్య నలగడం, కామాంధుల వేటలో బలవడం, మహిళ అనే వివక్షకు గురవడం, తర తరాలుగా ఇలాంటి అనేక ఘోరాలు సమాజంలో చూస్తూనే ఉన్నాం, ఒక సమాజం అభివృద్ది చెందాలంటే ప్రశాంత వాతావరణం ఉండాలంటే ముందుగా ఆ ప్రాంత మహిళలు-స్త్రీలు అభివృద్ది చెందాలి.

అందుకే వీటన్నింటిని రూపుమాపి మహిళలకు సమాజంలొ సముచిత స్థానం ఇస్తూ, గౌరవాన్ని పొందుతూ, ఎవరిపై కూడా ఆధారపడకుండా, అన్ని రంగాలలో రానించే విధంగా ముందు వరుసలో ఉన్నారు మన తెలంగాణ మగువలు.! దేశంలో ఎక్కడలేని విభిన్నమైన పథకాలు మన తెలంగాణ మహిళలకు ఓవరం, ఆడదంటే మగవాని కాలికింద నలిగేది కాదు, మగవానితో సమానంగా తలెత్తుకొని ఎదిగేది అన్నట్టు అన్నింట్లో రానిస్తున్నారు,

మహిళల అభివృద్ధి కొరకు వారి స్వాభిమానం కొరకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలు…స్వరాష్ట్రంలో ఆడబిడ్డల అందలం కోసం వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి కళ్యాణలక్ష్మి, షాదిముబారక్, ఆరోగ్యలక్ష్మి, బాలామృతం, షీ టీం, సఖీ,వన్స్ స్టాప్ సెంటర్, భరోస కేంద్రాలు, కే.సి.ఆర్ కిట్, అమ్మఒడి వాహనాలు, బతుకమ్మ చీరాల పంపిణి, అంగన్వాడి, ఆశావర్కర్లకు సముచిత స్థానం, ఒంటరి మహిళా పెన్షన్, తదితర అనేక కార్యక్రమాలు చూస్తున్నాం, ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల పెరుగుదల కనబడుతుంది ఒకప్పుడు ప్రసవాల కోసం ప్రభుత్వ దవాఖానాల్లో వెళ్ళడానికి జంకే వారు, ప్రైవేట్ లో వేల ఖర్చులు చేయలేని వారికి నేడు మాతా-శిశు రక్షణ కేంద్రాల ద్వారా ప్రసవ ఖర్చుల వేదన భారం లేకుండా సుఖ ప్రసవాలు జరుగుతున్నాయి, షీ టీం ల వలన ఎంతో కొంత రక్షణ, వివక్షకు గురికాకుండా చూడడం, మహిళా ఆరోగ్య విషయంలో ప్రభుత్వం నూతనంగా ప్రారంభించే ఉమెన్స్ క్లినిక్ లు, వడ్డీ లేని మహిళా ఋణాలు, తదితర వాటి వలన తెలంగాణ మహిళలు కొంత మేరకు అభివృద్ధి మార్గంలో ఉన్నారనే చెప్పవచ్చు.!

ఇలా అనేక విధాలుగా ఆర్థిక సహాయం, రక్షణ, ఉపాధి, ఆరోగ్యం, విద్యా ఇలా అనేక రంగాలలో స్వశక్తిగా ఎదగడానికి ఆర్థిక సహాయమే కాకుండా మహిళలు రాజకీయంగా కూడా రానించాలనే ఉద్దేశ్యంతో స్థానిక సంస్థల్లో 50 శాతం, మార్కెట్ కమిటీల్లో 33 శాతం అవకాశాన్ని కల్పిస్తుంది. మున్సిపల్ చైర్పన్సులుగా, మేయర్లుగా పురుషులతో సమానంగా రానిస్తున్నారు, సమాజంలో సముచిత స్థానంతో పాటు గౌరవ మర్యాదలు పొందుతున్నారు, అందుకే మహిళలు గౌరవింపబడతున్న మన తెలంగాణ ప్రదేశం నేడు దేవతలు సంచరించే ప్రాంతంగా మారుతుందని చెప్పవచ్చు.!

మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో….
సయ్యద్ జబీ
కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఫోరం