BIKKI NEWS (AUG. 30) : UGC SCALE FOR UNIVERSITY CONTRACT LECTURERS. తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలో పని చేస్తున్న రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా కాంట్రాక్టు అధ్యాపకులకు యూజీసీ ఏడో వేతన సంఘం సిఫారసులను అమలు చేయడానికి పూర్తి సమాచారాన్ని పంపించాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది. ఈ మేరకు రిజిస్ట్రార్లకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి లేఖ రాశారు.
UGC SCALE FOR UNIVERSITY CONTRACT LECTURERS
2018, ఏప్రిల్ 18న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 11 ప్రకారం యూనివర్సిటీలలో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల వివరాలను పంపించాలని కోరారు. విశ్వవిద్యాలయాల వారీగా ఎంత మంది కాంట్రాక్టు అధ్యాపకుల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వివరాలతో పాటు విశ్వవిద్యాలయాలు ఎప్పటికప్పుడు జారీ చేసిన పునరుద్ధరణ సమాచారాన్ని పంపాలని సూచించారు.
సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో ఎంత మంది పని చేస్తున్నారో వివరాలను సమర్పించాలని కోరారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని 12 విశ్వవిద్యాలయాలు వెంటనే పంపాలని ఆదేశించారు.
తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ హర్షం
రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు అధ్యాపకులకు రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా యూజీసీ ఏడో వేతన సంఘం సిఫారసుల ప్రకారం వేతనాలను చెల్లించాలన్న నిర్ణయంపై తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ (టీఆక్టా జేఏసీ) చైర్మెన్ శ్రీధర్ కుమార్ లోధ్, వర్కింగ్ చైర్మెన్ ఎం. రామేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామనీ, వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాల పరిధిలో 1,445 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారని తెలిపారు.