GROUP 4 FINAL KEY : పదిరోజుల్లో విడుదల

హైదరాబాద్ (అక్టోబర్ – 02) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC GROUP – 4 EXAM FINAL KEY మరో వారం, పది రోజుల్లో వెల్లడించేందుకు తీవ్ర కసరత్తు చేస్తుంది. ఆ తర్వాత వెంటనే మెరిట్ లిస్టును కూడా ప్రకటించాలని భావిస్తున్నది.

వారంలో టీఎస్పీఎస్సీ కమిషన్ ప్రత్యేక సమావేశం నిర్వహించి, సభ్యుల అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ కీని విడుదల చేయాలని భావిస్తున్నది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆలోపే గ్రూప్- 4 ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో వివిధ విభాగాల్లో గ్రూప్ 4 క్యాటగిరీలో 8,039 ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్ 1న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు అత్యధికంగా 9,51,205 మంది దరఖాస్తు చేశారు. జూలై 1న పరీక్ష నిర్వహించగా, పేపర్ -1కు 7,63,835 మంది, పేపర్ – 2కు 7,61,026 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

అత్యధిక ఉద్యోగాలు ఉండటం, ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్ష రాయడంతో గ్రూప్-4పై కమిషన్ ప్రత్యేక శ్రద్ధ వహించింది. రోజుకు సగటున 25 నుంచి 30 వేల ఓఎంఆర్ షీట్లను స్కానింగ్ చేసింది. ఆ తర్వాత ఒకటికి రెండుసార్లు పునః పరిశీలించి ఆగస్టు 28న ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. ప్రిలిమినరీ కీతోపాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, మాస్టర్ క్వశ్చన్ పేపరన్ను వెబ్సైట్ లో పొందుపరిచింది. అదేనెల 30 నుంచి సెప్టెంబర్ 4వరకు అభ్యంతరాలకు అవకాశం కల్పించింది.