సెప్టెంబర్ లో ఉద్యోగులకు ఐఆర్.!

హైదరాబాద్ (ఆగస్టు – 12) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తదుపరి వేతన సవరణ సంఘం (2nd PRC) నియామకం, అధ్యయనం జరిగేలోపు ‘మధ్యంతర భృతి’ (IR) ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అక్టోబరులో శాసనసభ ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశాలున్నందున సెప్టెంబరులోనే IR ప్రకటించవచ్చని సమాచారం.

ఉద్యోగుల జీతభత్యాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) బడ్జెట్ లో ప్రభుత్వం రూ.38,627.52 కోట్లు
కేటాయించింది. ప్రతి నెలా జీతాలు, పింఛన్లు కలిపి రూ.4,500 కోట్ల దాకా వ్యయమవుతోంది. ఐఆర్ 10 శాతం ఇచ్చినా ప్రతి నెలా రూ.300 కోట్ల అదనపు ఆర్థికభారం పడుతుందని ఆర్థికశాఖ అంచనా. దీన్ని సెప్టెంబరు నుంచిళఅమలు చేస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 7 నెలలకు దాదాపు రూ. 3,600 కోట్లు అదనంగా నిధులు కావాలి. గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోలిస్తే జీతభత్యాలకు ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే రూ. 943.56 కోట్ల మేర భారం పెరిగింది. ఐఆర్ ప్రకటిస్తే ఈ పెరుగుదల మరింత అధికంగా ఉంటుందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలకు భారీగా నిధులు వెచ్చిస్తున్న ప్రభుత్వానికి నిధుల సర్దుబాటు కీలకంగా మారింది.

రుణమాఫీకి ఈ నెలలో మరో రూ. అయిదారు వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. రైతుబంధు, సంక్షేమ పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల రాయితీలు.. వీటన్నిటికీ నిధుల సమీకరణకు ఆర్థికశాఖ తంటాలు పడుతోంది. భూముల
వేలం, ఓఆర్ఆర్ కాంట్రాక్టు డిపాజిట్ల ద్వారా రూ.10 వేల కోట్లకు పైగా.ఆదాయం రావచ్చని అంచనా. ఇవి సమకూరితే పథకాలు, జీతభత్యాలు, పింఛన్లకు నిధులు సర్దుబాటుకు కొంత వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నారు. (Credits – Eenadu)