BIKKI NEWS (JULY 18) : TGPSC JUNIOR LECTURER POSTS CERTIFICATE VERIFICATION. ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో భర్తీ కొరకు విడుదల చేసిన నోటిఫికేషన్ లకు సంబంధించి భర్తీ ప్రక్రియ తుది దశకు చేరింది. జూనియర్ కళాశాలల అధ్యాపక పోస్టుల తుది ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. త్వరలో ద్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది.
TGPSC JUNIOR LECTURER POSTS CERTIFICATE VERIFICATION
పాలిటెక్నిక్ అధ్యాపక పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన కూడా ముగిసింది. ఇంటర్వ్యూలు లేనందున ఆ వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేస్తే కొలువుల్లో చేరొచ్చు.
ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఆగస్టు నెలలోనే వారంతా ఉద్యోగాలలో చేరనున్నారు.
పాలిటెక్నిక్ కళాశాలల్లో 247 మంది, జూనియర్ కళాశాలల్లో 1,392 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో 54 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 1,100 మంది వరకు శాశ్వత అధ్యాపకులు ఉండేవారు. ఏడాది క్రితం కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణతో 390 మంది కొలువులు రెగ్యులర్ అయ్యాయి. దానికితోడు తాజాగా 247 మంది వస్తే 90 శాతం శాశ్వత అధ్యాపకులే ఉంటారని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన 11 కళాశాలల్లో సుమారు 100 మంది అవసరమవుతారని అధికారులు తెలిపారు.
అలాగే రాష్ట్రంలోని 422 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనా పోస్టులు 6,008. 900 మంది రెగ్యులర్ అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు ఉండేవారు. 3,500 మంది కాంట్రాక్టు అధ్యాపకులు రెగ్యులర్ అయ్యారు. కొత్తగా 1,392 మంది వస్తే ఇక ఖాళీలు 200 మాత్రమే. అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన 20కిపైగా కళాశాలల్లో చాలా వరకు ఖాళీలే ఉన్నందున మరికొన్ని పోస్టులు అవసరం.
డిగ్రీ అధ్యాపకుల భర్తీ నోటిఫికేషన్ పరిస్థితి
రాష్ట్రంలోని 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో4,098 అధ్యాపకులుండాలి. వాటిలో 491 మంది అధ్యాపకులు, 24 మంది లైబ్రేరియన్లు, 29 మంది పీడీలు సహా 544 కొలువుల భర్తీకి 2022లోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినా దరఖాస్తులు స్వీకరించలేదు. ఏడాదిన్నర గడిచినందున తాజాగా టీజీపీఎస్‌సీ ప్రభుత్వ అనుమతి కోరినట్లు తెలిసింది. డిగ్రీ కళాశాలల్లో 1,200 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తుండగా 331 మంది కాంట్రాక్టు అధ్యాపకులు రెగ్యులర్ అయ్యారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 2వేల మంది వరకు అతిథి అధ్యాపకులు అవసరం.