TS SCHEMES : ఇటీవల ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాలు

హైదరాబాద్ (ఆగస్టు – 13) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను (telangana state recent schemes 2023) ప్రవేశపెట్టింది. పోటీ పరీక్షల నేపథ్యంలో వాటి గురించి క్లుప్తంగా నేర్చుకుందాం.

◆ గృహలక్ష్మీ :

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు మూడు లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే పథకం ఇది.

12 వేల కోట్లతో ఈ పథకం ద్వారా 4 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చనుంది.

◆ రైతు రుణమాఫీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29.61 లక్షల మంది రైతులకు ఒక లక్ష లోపు రుణాల మాఫీ కోసం ఉద్దేశించిన పథకం రైతు రుణమాఫీ.

ఈ పథకానికి 19 వేల కోట్ల నిధులు కేటాయించడం జరిగింది.

◆ పోడు పట్టాల పంపిణీ :

పోడు భూముల మీద గిరిజనులకు శాశ్వత హక్కు కల్పించే పోడు పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

1,51,635 మంది గిరిజన రైతులకు దాదాపుగా 4,06,389 ఎకరాల పొడు భూమికి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. దీంతో గిరిజనులకు భూమిపైన శాశ్వత హక్కు లభించనుంది. అటవీ శాఖతో ఉన్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

◆ దివ్యాంగుల అసరా పెంపు :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ కింద ఇస్తున్న పెన్షన్లలో దివ్యాంగులకు ఇప్పటివరకు ఇస్తున్న 3,016ల పెన్షన్ కు మరోక వెయ్యి రూపాయలు పెంచుతూ 4,016 ఇవ్వనుంది.

రాష్ట్రవ్యాప్తంగా 5.11 లక్షల మంది దివ్యాంగులకు ఈ పెన్షన్ పెంపు ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఇందుకోసం 600 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చించనుంది.

◆ ఆర్టీసీ విలీనం :

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లోని ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేసుకోవడం ద్వారా ఒకేసారి 43,373 మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు చెందనున్నారు.

◆ వీఆర్ఏ ల క్రమబద్ధీకరణ

తరతరాలుగా వస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ఉద్యోగులను వివిధ శాఖలలోకి బదలాయింపు చేపట్టింది. దీంతో వీరు కూడా పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.

దాదాపు 20,555 మంది వీఆర్ఏలు ప్రభుత్వ ఉద్యోగులుగా బదలాయింపు ప్రక్రియ ప్రారంభమైంది.

◆ మెట్రో విస్తరణ

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఫ్రీ రవాణా వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంగా పలు ఫ్లై ఓవర్లు నిర్మాణంతో పాటు మెట్రో విస్తరణ కూడా భారీగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు 310 కిలోమీటర్ల మేర నూతన మెట్రో విస్తరణకు పచ్చ జెండా ఊపింది.

310 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు మరియు హైదరాబాద్ లో ఫ్లై ఓవర్లు, బైపాస్ రోడ్లు, డబల్ డెక్కర్ రూట్ ల నిర్మాణానికి 69, 100 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేసింది.

◆ గురుకుల డైట్ చార్జీలు పెంపు

గురుకుల విద్యాసంస్థలలో విద్యను అభ్యసిస్తున్న 7.50 లక్షల మంది విద్యార్థులకు డైట్ చార్జీలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

డైట్ చార్జీల పెంపుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై 2,847 కోట్ల భారం పడనుంది.

◆ రేషన్ డీలర్ల కమీషన్ పెంపు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,227 మంది రేషన్ డీలర్లకు లబ్ధి చేకూర్చేలా కమిషన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంపుదల చేసింది. దీంతో 139 కోట్ల భారం ప్రభుత్వం పై పడనుంది.

◆ బీసీ బంధు

తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా బిసి పౌరులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఈ పథకం కింద చేయనున్నారు. ఈ పథకం కింద ఇచ్చే సొమ్ము పూర్తి సబ్సిడీని కలిగి ఉంటుంది.

◆ మైనారిటీ బంధు

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ మైనారిటీ వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా మైనారిటీ వర్గ ప్రజలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించింది. ఇది కూడా పూర్తిగా 100% సబ్సిడీ కలిగిన పథకం.