BIKKI NEWS (AUG. 05) : TELANGANA SKILL UNIVERSITY CHAIRMAN ANAD MAHINDRA. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ’కి చైర్మన్‌గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, దాత, మహీంద్రా గ్రూప్ అధినేత పద్మభూషణ్ ఆనంద్ మహీంద్రా గారు వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు.
TELANGANA SKILL UNIVERSITY CHAIRMAN ANAD MAHINDRA
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా వ్యవహరించడానికి ఆనంద్ మహీంద్రా గారు అంగీకరించారని, కొద్ది రోజుల్లోనే వారు బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు.
తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగినవారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖుడినే అధినేతగా నియమిస్తామని ముఖ్యమంత్రి గారు ఇటీవల అసెంబ్లీలోనూ ప్రకటించారు. ఆనంద్ మహీంద్రా గారు ఇటీవల హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారితో సమావేశమైన సందర్భంలోనూ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీపై చర్చలు జరిపారు.
రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా అభివృద్ది కానున్న ఫ్యూచర్ సిటీ పరిధిలో బ్యాగరికంచె వద్ద తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ భవనానికి ముఖ్యమంత్రి గతవారం శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీలో 17 రకాల కోర్సుల్లో ఏటా 20వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్ ఇవ్వడంతోపాటు ఆయా కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించే ఏర్పాటు చేశారు.
రాబోయే సంవత్సరాల్లో ఏడాదికి లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా స్కిల్ వర్సిటీని విస్తరించనున్నారు. బ్యాగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI) భవంతి నుంచి స్కిల్ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.