KALOJI : తెలంగాణ భాషా దినోత్సవం

BIKKI NEWS (సెప్టెంబర్ – 09) : తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబరు 9న ప్రజా కవి కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం (Telangana Language Day September 9th) తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపబడుతున్నది. తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు 100వ జయంతి సందర్భంగా.. కాళోజీ పుట్టినరోజైన సెప్టెంబరు 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ భాష, యాసను తన రచనల్లో వ్యక్తపరిచి తెలంగాణ భాషకు, యాసకు ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిన కవి కాళోజీ నారాయణరావు యాదిలో తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోవడం నిజంగా గర్వకారణం.

ఈ సందర్భంగా తెలంగాణలో భాషా, సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుండి రాష్ట్రస్థాయి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

కాళోజీ జన్మదినమైన సెప్టెంబరు 9వ తేదీని ప్రతి ఏడాది తెలంగాణ భాషా దినోత్సవంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు 2014 సెప్టెంబరు 9న వరంగల్లులోని కాజీపేట నిట్‌ కళాశాలలో జరిగిన కాళోజీ నారాయణరావు 100వ జయంతి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాడు.

2015లో తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు జరిగాయి. రవీంద్రభారతిలో కాళోజీ సాహిత్య పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. మొదటి సాహిత్య ప్రజాకవి కాళోజి నారాయణరావు సాహిత్య పురస్కారాన్ని అమ్మంగి వేణుగోపాల్ 2015 కు గాను అందుకున్నాడు. 2016కు గోరటి వెంకన్న అందుకున్నాడు. 2023 కు శ్రీ జయరాజ్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.