JOB CALENDAR విడుదలకు ప్రభుత్వం యోచన

BIKKI NEWS (MARCH 08) : ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ తరహాలో నిర్ణీత కాలవ్యవధితో ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ (telangana job calendar) విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా జనవరి 1న టీఎస్‌పీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డులు, సంస్థల ఆధ్వర్యంలో జాబ్‌ క్యాలెండర్లు ప్రకటించాలని భావిస్తోంది.

గ్రూప్‌-1, 2, 3, 4లతో పాటు అన్ని విభాగాల్లో నిరంతరం ఉద్యోగాల ప్రకటనలు వెలువరించడం వల్ల పరీక్షలకు ఉద్యోగార్థులు ప్రణాళికాబద్ధంగా సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో ప్రామాణిక రాష్ట్రస్థాయి ముసాయిదా జాబ్‌ క్యాలెండర్‌ సిద్ధమవుతోంది. దీన్ని త్వరలోనే ప్రభుత్వానికి పంపించనుంది. ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఈ ఏడాది నుంచి జాబ్‌ క్యాలెండర్‌ అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి.

★ నోటిఫికేషన్లు, పరీక్షలకు గడువు

రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరహాలో ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్‌ క్యాలెండర్‌ సిద్ధం చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. జాబ్‌ క్యాలెండర్‌ అమల్లోకి వస్తే టీఎస్‌పీఎస్సీతో పాటు పోలీసు, గురుకుల, వైద్యఆరోగ్య నియామక బోర్డుల నుంచి నిరంతర ఉద్యోగ ప్రకటనలు వెలువడుతాయి.