BIKKI NEWS (JUNE 24) : Rythu Nestham programme of telangana government. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. వ్యవసాయం దండుగ కాదు.. పండుగ. రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా పని చేస్తామని పునరుద్ఘాటించారు.
Rythu Nestham programme of telangana government
రైతు భరోసా కింద ఈ నెల 16 వ తేదీన రైతు ఖాతాల్లోకి డబ్బు వేయడం ప్రారంభించినప్పటి నుంచి చెప్పిన మాట ప్రకారం 9 రోజుల్లోగా 9 వేల కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం పూర్తయింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 16 వందల రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లక్షలాది రైతులు వీక్షించారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి గారు.. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. గతంలో చెప్పినట్టుగానే 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఎకరాకు 12 వేల చొప్పున 1 కోటి 40 లక్షల ఎకరాలకు 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా రైతులందరికీ అభినందనలు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వానికి రైతులు మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాత క్రమంలో మహిళలు, తెలంగాణ ఉద్యమకారులైన యువతకు ప్రాధాన్యతనిస్తున్నాం. అందుకే అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే రైతు భరోసా కింద 7,625 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం. వచ్చే పదేండ్లలో వ్యవసాయాన్ని పండుగ చేస్తాం.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 25,35,964 మంది రైతులకు సంబంధించి 20,617 కోట్ల రూపాయలు చెల్లించి రుణ విముక్తులను చేశాం.
ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు చెల్లించడమే కాకుండా సన్న వడ్లు పండించిన వారికి బోనస్ ఇస్తున్నాం. 2.80 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధిక దిగుబడిని ఇచ్చి గర్వంగా చెప్పుకునే రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టారు.
రైతాంగానికి అండగా నిలబడాలన్న లక్ష్యంతోనే రుణ మాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, ఉచిత కరెంట్, స్ప్రింక్లర్స్, డ్రిప్, సోలార్ గిరి వికాసంలో పంపుసెట్లు, సివిల్ సప్లయ్ విభాగం ద్వారా ధాన్యం కొనుగోలు.. ఇలా కేవలం 18 నెలల కాలంలో వ్యవసాయ రంగంపై 1 లక్ష 04 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ప్రజా ప్రభుత్వం ఇది.
ప్రజా పాలనలో రైతులు, మహిళలు, యువకుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సోలార్ పవర్ ప్లాంట్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ, స్కూలు పిల్లల యూనిఫామ్ కుట్టించే బాధ్యత అప్పగించడం, స్వయం సహాయ సంఘాలకు సహాయం… ఇలా కోటి మంది కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం.
అధికారం చేపట్టిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువ వికాసం ద్వారా యువకులను ఆదుకునే ప్రణాళికలతో ముందుకు వస్తాం. తదుపరి కార్యక్రమంగా రాజీవ్ యువ వికాసం చేపడుతాం. ప్రజా పాలనలో రైతులు, మహిళలు, యువకులు భద్రంగా ఉండాలన్నదే మా ఆకాంక్ష.
గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం అన్ని రకాలుగా పోరాడుతాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల (Banakacharla) ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేశాం. ఒకవేళ కేంద్రం ప్రాజెక్టుకు అనుమతిస్తే న్యాయస్థానాల్లో పోరాడుతాం. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్రం తెలిపిన అభ్యంతరాల విషయంలో అసెంబ్లీలో చర్చకు సిద్ధం.. అని ముఖ్యమంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, హర్కర వేణుగోపాల్ రావు గారు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
- NEERAJ CHOPRA – గోల్డెన్ స్పైక్ త్రో విజేత నీరజ్ చోప్రా
- Free Training – వ్యవసాయంలో 6 నెలల ఉచిత వసతి శిక్షణ
- SAND BOOKING – మీ సేవా లో ఇసుక బుకింగ్ అవకాశం
- RYTHU BHAROSA – రైతు భరోసా పూర్తి
- Contract Jobs – గురుకుల సీవోఈ లలో భారీగా ఉద్యోగాలు