QUIT INDIA MOVEMENT : క్విట్ ఇండియా ఉద్యమం

BIKKI NEWS (ఆగస్టు – 08) : క్విట్ ఇండియా ఉద్యమం (QUIT INDIA MOVEMENT AUGUST 8th), బ్రిటిషు పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 8 న మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ప్రారంభించిన ఉద్యమం. దీనిని ఆగస్టు ఉద్యమం (AUGUST MOVEMENT) అని కూడా అంటారు.

క్రిప్స్ మిషన్ విఫలమైంది, 1942 ఆగస్టు 8 న, బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో చేసిన క్విట్ ఇండియా ప్రసంగంలో గాంధీ డూ ఆర్ డై కి (DO OR DIE) పిలుపునిచ్చాడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ భారతదేశం నుండి “క్రమబద్ధమైన బ్రిటిషు ఉపసంహరణ” కోరుతూ భారీ నిరసనను ప్రారంభించింది. యుద్ధంలో మునిగి ఉన్నప్పటికీ, దీనిపై చర్య తీసుకోవడానికి బ్రిటిషు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. గాంధీ ప్రసంగించిన గంటల్లోనే భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం మొత్తాన్నీ విచారణనేది లేకుండా జైల్లో వేసింది. వీళ్ళలో చాలా మంది యుద్ధం ముగిసేదాకా జైలులోనే, ప్రజలతో సంబంధం లేకుండా గడిపారు.

ఆల్ ఇండియా ముస్లిం లీగ్, రాచరిక సంస్థానాలు, ఇండియన్ ఇంపీరియల్ పోలీస్, బ్రిటిషు ఇండియన్ ఆర్మీ, హిందూ మహాసభ, ఇండియన్ సివిల్ సర్వీస్, వైస్రాయ్ కౌన్సిల్ (ఇందులో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు) లు బ్రిటిషు వారికి మద్దతుగా నిలిచాయి. యుద్ధకాలంలో జరుగుతున్న భారీ వ్యయం నుండి లాభం పొందుతున్న భారతీయ వ్యాపారవేత్తలు చాలామంది, క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇవ్వలేదు. చాలామంది విద్యార్థులు అక్ష రాజ్యాలకు మద్దతు ఇస్తూ బహిష్కరణలో ఉన్న సుభాస్ చంద్రబోస్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపారు. ఈ ఉద్యమానికి బయటి మద్దతు అమెరికన్ల నుండి మాత్రమే వచ్చింది. కొన్ని భారతీయ డిమాండ్లను అంగీకరించమని అమెరికా ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్‌ను వత్తిడి చేసాడు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిషు ప్రభుత్వం సమర్థవంతంగా అణిచివేసింది. వెంటనే స్వాతంత్ర్యం ఇవ్వడానికి బ్రిటిషు వారు నిరాకరించారు. యుద్ధం ముగిసాక చూద్దాం లెమ్మన్నారు.

దేశవ్యాప్తంగా చిన్న తరహా హింస జరిగింది. బ్రిటిషు వారు పదివేల మంది నాయకులను అరెస్టు చేసి, వారిని 1945 వరకు జైల్లోనే ఉంచారు. భారీగా అణచివేయడం వలన, బలహీనమైన సమన్వయం వలన, స్పష్టమైన చర్య యొక్క కార్యక్రమం లేకపోవడం వల్లా తక్షణ లక్ష్యాల పరంగా క్విట్ ఇండియా ఉద్యమం విఫలమైంది. అయితే, రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన ఖర్చు కారణంగా భారతదేశాన్ని ఇక నియంత్రణలో పెట్టలేమని బ్రిటిషు ప్రభుత్వం గ్రహించింది. మర్యాద కోల్పోకుండా, శాంతియుతంగా ఎలా నిష్క్రమించాలనేది యుద్ధానంతరం వారి కెదురుగా నిలుచున్న ప్రశ్న.

క్విట్ ఇండియా ఉద్యమం యొక్క స్వర్ణోత్సవానికి గుర్తుగా 1992 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 రూపాయి స్మారక నాణెం జారీ చేసింది.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు