PROJECT TIGER : దేశంలో పులుల సంఖ్య 3,167

కర్ణాటక (ఎప్రిల్ – 10) : మైసూర్ లో జరుగుతున్న ‘ప్రాజెక్ట్ టైగర్’ స్వర్ణోత్సవ వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ భారత్ పులుల డాటాను విడుదల చేశారు. దీని ప్రకారం 2022 నాటికి మన దేశంలో 3,167 పులులు ఉన్నాయి. 2018లో 2,967గా ఉన్న సంఖ్య నాలుగేండ్లలో 200 పెరిగింది.

2016లో 1,411, 2010లో 1,706, 2014లో 2,226 పులులు ఉన్నాయి. పులుల సంరక్షణను ప్రోత్సహించేందుకు భారత్ 1978లో ఈ ప్రాజెక్ట్ టైగర్ ను ప్రారంభించింది. మొదట్లో 9గా ఉన్న టైగర్ రిజర్వ్ ల సంఖ్య ప్రస్తుతం 58కు చేరింది.

గత నివేదికలో రాష్ట్రాల వారీగా పులుల సంఖ్యను వెలువరించగా ఈసారి దాన్ని ప్రాంతాలకు పరిమితం చేశారు. మధ్యభారతం, తూర్పుకనుమల పరిధిలోకి వచ్చే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ లో 2018లో 1,033 పులులు ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 1,161కి చేరింది.

శివాలిక్ పర్వత సానువులు, గంగామైదానంలో అత్యధికంగా 158 పులులు పెరగ్గా, సుందర్బన్ ప్రాంతంలో 12 మాత్రమే వృద్ధి చెందాయి.

పశ్చిమ కనుమల్లో 157, ఈశాన్య పర్వతాలు, బ్రహ్మపుత్ర మైదానంలో 25 మేర తగ్గాయి. మొత్తంగా మూడు ప్రాంతాల్లో నికరగా 298 పెరగ్గా, రెండు ప్రాంతాల్లో 182 తగ్గాయి.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీవేంకటేశ్వర నేషనల్ పార్క్, తెలంగాణలోని కవాల్ లో పలు ప్రాంతాల్లో పులులు అంతరించిపోయినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ లలో పులుల సంఖ్యను ఇదివరకు స్థాయికి తీసుకురావడానికి సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.