Home > SCIENCE AND TECHNOLOGY > PHONE TAP – మీ ఫోన్ ట్యాప్ అవుతుందా… లక్షణాలు, రక్షణ

PHONE TAP – మీ ఫోన్ ట్యాప్ అవుతుందా… లక్షణాలు, రక్షణ

BIKKI NEWS : ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ పోన్ అనేది సర్వసాదరణంగా ఉండే వస్తువుగా మారింది. ఇప్పుడు అందరికీ పట్టుకున్న భయం పోన్ ట్యాపింగ్… అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ను మనం గుర్తు పట్టడానికి కొన్ని లక్షణాలు మనం ఫోన్ లోనే గుర్తుపట్టి జాగ్రత్త పడవచ్చు (phone tapping symptoms and how to avoid it) అంటున్నారు నిపుణులు.

★ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి.?

టెలిఫోన్ లైన్లు లేదా వైర్లెస్ నెట్వర్క్ మీద ప్రసారమయ్యే సంకేతాలను అడ్డగించి, ఫోన్లతో జరిపే సంప్రదింపులను అనధికారికంగా వినటం, మాటలను రికార్డు చేయటాన్ని ఫోన్ ట్యాపింగ్ అంటారు.

ఫోన్ ను ట్యాపింగ్ ను గుర్తు పట్టడం ఎలా.?

అసంబద్ధ నేపథ్య శబ్దాలు:

ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు క్లిక్ క్లిక్ మనే చప్పుళ్లు, ప్రతిధ్వనులు, ఉన్నట్టుండి మాటలు ఆగిపోవటం వంటివన్నీ ఫోన్ ట్యాపింగ్ పరికరాలు సంభాషణలను అడ్డగిస్తున్నాయని అనటానికి సంకేతాలు కావొచ్చు.

బ్యాటరీ డౌన్, ఫోన్ వెడెక్కటం : ఫోన్ వాడనప్పుడూ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోవడం, ఫోన్ అతిగా వెడెక్కటం గమనిస్తే సందేహించాల్సిందే. ఫోన్ నేపథ్యంలో నిఘా సాఫ్ట్వేర్ రన్ అవటం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

డేటా ఖర్చవటం : ఆకారణంగా ఉన్నట్టుండి ఫోన్ డేటా అతిగా ఖర్చవుతున్నా అనుమానించాల్సిందే. అనధికార అప్లికేషన్లు మనకు తెలియకుండానే డేటాను ప్రసారం చేస్తున్నాయనటానికి ఇదొక సూచనగా భావించాలి.

ఆలస్యంగా షట్ డౌన్, రీస్టార్ట్ : నిఘా సాఫ్ట్ వేర్ వెనకాల రన్ అవుతుంటే ఫోన్ షట్ డౌన్, రీస్టార్ట్ కావటానికి మామూలు కన్నా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇలాంటివి గమనిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.

అనూహ్య మెసేజ్ లు, హెచ్చరికలు : అసాధారణ టెక్స్ట్ మెసేజ్లు, అలర్ట్లు, నోటిఫికేషన్లు వస్తున్నట్టయితే ట్యాపింగ్ కు సంకేతాలు కావొచ్చు. ముఖ్యంగా ర్యాండమ్ అక్షరాలు, చిహ్నాలతో కూడిన మెసేజ్లు అందుతుంటే ఫోన్ను ఇతరులెవరో దూరం నుంచి పర్యవేక్షిస్తున్నారని అనుమానించాలి.

మన మాటలు మనకే వినిపించడం : ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కాల్స్ అర్ధంతరంగా ఆగిపోవటం, మన మాటలు మనకే వినిపించటం వంటివి కూడా నిఘాకు సంకేతం కావొచ్చు. అలాగే ఫోన్ వాడనప్పుడూ తెర వెలగటం, ఆరటం, రకరకాల చప్పుళ్లు చేయటం వంటివి గమనించినా అనుమానించాల్సిందే.

ఫోన్ ట్యాపింగ్ ను ఎలా నివారించాలి :

ఫోన్ ట్యాప్ అయ్యిందనే అనుమానం వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. గోప్యత, భద్రతను కాపాడుకోవటం తప్పనిసరని గుర్తించాలి.

ఫోన్ ను నిశితంగా గమనించాలి. తనిఖీ చేయాలి. తెలియని యాప్లు కనిపిస్తే తొలగించుకోవాలి.

సెటింగ్స్ మార్పులను గమనిస్తే సరిచేసుకోవాలి.

అనుమానిత నెట్వర్క్ కనెక్షన్లుంటే తీసేయాలి.

ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఏవైనా లోపాలుంటే సరిదిద్దుకుంటాయి.

ఫోన్ ను ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే హానికర నిఘా సాఫ్ట్వేర్లు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. అయితే రీసెట్ చేయటానికి ముందు అవసరమైన డేటాను స్టోర్ చేసుకోవటం మంచిది.

విశ్వసనీయమైన యాంటీవైరస్ లేదా యాంటీ స్పైవేర్ సాఫ్ట్వేరు ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. హానికర ప్రోగ్రామ్లు, ఫైల్స్ ను తొలగించుకోవటానికివి తోడ్పడతాయి. గోప్యతను కాపాడతాయి.

భద్రమైన వైఫై నెట్వర్క్ ను వాడుకోవాలి. అన్ సెక్యూర్డ్, పబ్లిక్ నెట్వర్క్లతో కనెక్ట్ కావొద్దు.

ఫోన్ యాక్టివిటీని తరచూ గమనిస్తుండాలి. డేటా వాడకం, నెట్వర్క్ కనెక్షన్స్, ఇన్స్టాల్ అయిన యాప్స్ వంటి వాటిపై ఓ కన్నేసి ఉంచాలి. దీంతో ఏదైనా అనుమానం వస్తే వెంటనే అప్రమత్తం కావటానికి వీలుంటుంది.

ఫోన్ ట్యాప్ అయ్యిందో లేదో కచ్చితంగా తేల్చుకోలేని పరిస్థితుల్లో సైబర్ సెక్యూరిటీ నిపుణుల సాయం తీసుకోవాలి.