లెక్చరర్ల క్రమబద్ధీకరణ పై స్టేకు నిరాకరణ – హైకోర్టు

హైదరాబాద్ (అక్టోబర్ – 18) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలు, వృత్తి
విద్యా కోర్సుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు మంగళవారం నిరాకరించింది. అయితే నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు చెందిన చట్టంలో సెక్షన్ 10ఎ ను చేరుస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో16 ను సవాలు చేస్తూ వి. ప్రవీణ్ కుమార్ మరో 15 మంది
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ ఎన్. వి.శ్రవణ్ కమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

వాదనలను విన్న ధర్మాసనం చట్టంలోని ఒక నిబంధనను సవాలు చేశారన్న కారణంగా ఇప్పటికే మొదలైన క్రమబద్ధీకరణ ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వజాలమని తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ క్రమబద్ధీకరణ పేరుతో దొడ్డిదారిన నియామకాలు జరుగుతున్నాయన్నారు. సుమారు 5 వేలకు పైగా పోస్టులను క్రమబద్ధీకరణ పేరుతో ప్రభుత్వం భర్తీ చేస్తోందన్నారు. ప్రభుత్వం మేలో జారీ చేసిన జీవోలు 19, 20, 21, 23, 31ల అమలును నిలిపివేయాలని కోరారు.

అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ చట్ట ప్రకారమే క్రమబద్ధీకరణపై నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. కౌంటర్లు దాఖలు చేయడానికి గడువు కావాలని, ఇదే అంశంపై పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటితో కలిపి విచారించాలని కోరారు.