CREDIT & SOURCE – SAKSHI NEWS
BIKKI NEWS (JUNE 06) : NEET RANKS AND MBBS SEATS IN TELANGANA నీట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మరో వారంలో రాష్ట్రస్థాయి ర్యాంకులను కూడా ప్రకటించే అవకాశముంది. ఈసారి అర్హత మార్కులు పెరగడంతో లక్షల్లో ర్యాంకులు వచ్చిన వారికి కూడా కన్వీనర్ కోటాలో సీట్లు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఎన్ని ర్యాంకులు వచ్చిన వారికి కన్వీనర్ సీట్లు వచ్చాయన్న విషయమై విద్యార్థులు ఆరా తీస్తున్నారు
◆ లక్షల్లో ర్యాంకు వచ్చినా.
గతేడాది రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా కన్వీనర్ కోటా కింద నీట్ జాతీయ స్థాయిలో 2.66 లక్షల ర్యాంకు వచ్చిన ఒక విద్యార్థికి సీటు లభించింది. మేడ్చల్‌లోని సీఎంఆర్ మెడికల్ కాలేజీలో బీసీ సీ కేటగిరీకి చెందిన ఒక విద్యార్థికి ఆ ర్యాంక్‌కు సీటు వచ్చింది. అలాగే 2.62 లక్షల ర్యాంకు పొందిన బీసీ సీ కేటగిరీకి చెందిన ఓ విద్యార్ధికి సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో సీటు లభించింది. సంగారెడ్డిలోని టీఆర్‌ఆర్ కాలేజీలో బీసీ సీ కేటగరీకే చెందిన విద్యార్థికి 2.58 లక్షల ర్యాంక్ వచ్చినా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు లభించింది. ఈ వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి.
ఇక ఓపెన్ కేటగిరీ లోకల్ కోటాలో వరంగల్‌లోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీలో 1.60 లక్షల ర్యాంకు సాధించిన విద్యార్థికి సీటు లభించింది. ఓపెన్ కేటగిరీలోని అన్ రిజర్వ్‌డ్ కోటాలో సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీలో 58,727 ర్యాంకు సాధించిన విద్యార్ధికి సీటు లభించింది.
◆ పెరిగిన సీట్లతో ఈసారి విస్త్రుత అవకాశాలు.
రాష్ట్రంలో వైద్యవిద్య అవకాశాలు భారీగా పెరిగాయి. గతేడాది ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పెరిగాయి. 2023-24 వైద్య విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 56 మెడికల్ కాలేజీల్లో మొత్తం 8,490 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 27 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా 29 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో 15 శాతం సీట్లను అఖిల భారత కోటా కింద కేటాయిస్తారు*
మరోవైపు ఈ ఏడాది కూడా మెడికల్ కాలేజీల సంఖ్య పెరుగుతోంది. 2024-25 విద్యాసంవత్సరంలో జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలు రానున్నాయి. వాటికి సంబంధించి ఇంకా నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈసారి ఆరు కాలేజీలకు అనుమతి వచ్చే అవకాశం ఉందని.. ఈ లెక్కన కనీసం 300 సీట్లు పెరుగుతాయని అధికార వర్గాలు అంటున్నాయి. అంటే ఆ మేరకు ఎంబీబీఎస్‌లో విద్యార్థుల చేరికలకు అవకాశాలు పెరగనున్నాయి.
◆ 15 శాతం ఉమ్మడి కోటా రద్దు కానుండటంతో
తెలంగాణలోని అన్ని మెడికల్ కాలేజీల్లో ఏపీ విద్యార్థులు 15 శాతం కోటా కింద పదేళ్లపాటు సీట్లు పొందేందుకు వీలు కల్పించిన ఏపీ పునర్విభజన చట్టం-2014లోని నిబంధన గడువు ఈ నెల 2వ తేదీతో ముగిసింది. ఈ నిబంధన వల్ల 2014 నుంచి 2022 వరకు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 15 శాతం సీట్లను రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఉమ్మడి కోటా కింద వర్తింపజేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అందుబాటులోకి వచ్చిన కొత్త మెడికల్ కాలేజీల్లోనూ ఉమ్మడి కోటాను అమలు చేయడంపై విమర్శలు రావడంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు తెచ్చింది. అన్ని కొత్త కాలేజీల్లో ఉమ్మడి కోటాను రద్దు చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన 5 ప్రభుత్వ, 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనే ఉమ్మడి కోటాను అమలు చేసింది. ఆయా కాలేజీల్లో 1,950 కన్వీనర్ కోటా సీట్లలో 15 శాతం అంటే 292 సీట్లను ఉమ్మడి కోటా కింద భర్తీ చేస్తున్నారు. అయితే అందులో 200కుపైగా సీట్లు ఏపీ విద్యార్థులకే దక్కుతున్నాయి. ఉమ్మడి కోటా రద్దు కానుండటంతో ఇకపై ఆ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇలా కూడా అదనంగా సీట్లు రాబోతున్నాయి. కాబట్టి ఈసారి 3 లక్షల ర్యాంక్ పొందిన విద్యార్ధికి కూడా కన్వీనర్ కోటాలో సీటు లభిస్తుందని కాళోజీ నారాయణరావు వర్గాలు అంచనా వేస్తున్నాయి.
◆ గతేడాది ఉస్మానియా, గాందీ, కాకతీయల్లో ఏ ర్యాంక్‌కు సీట్లు వచ్చాయంటే?
OU MEDICAL COLLEGE
- OPEN – 1923
- EWS – 30,522
- SC – 89,253
- ST – 90,658
- BC- A – 79,611
- BC – B – 30,944
- BC – C – 69,344
- BC – D – 30,465
- BC – E – 34,482
GANDHI MEDICAL COLLEGE
- OPEN – 8164
- EWS – 26,245
- SC – 80,215
- ST – 78,656
- BC- A – 36,691
- BC – B – 15,625
- BC – C – 55,674
- BC – D – 14,598
- BC – E – 30,495
KAKATIYA MEDICAL COLLEGE WARANGAL
- OPEN – 36,905
- EWS – 47,684
- SC – 1,14,000
- ST – 1,07,000
- BC- A – 1,09,000
- BC – B – 43,616
- BC – C – 94,902
- BC – D – 42,838
- BC – E – 50,030