BIKKI NEWS (AUGUST 12) : జాతీయ గ్రంథాలయ దినోత్సవం (National library day august 12th) ప్రతి సంవత్సరం ఆగస్టు 12న భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు. భారతదేశ గ్రంథాలయ పితామహుడైన ఎస్.ఆర్. రంగనాథన్ పుట్టినరోజు సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.
National library day august 12th
లెక్కల ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ 1923లో మద్రాసు యూనివర్సిటీలో లైబ్రేరియన్‌గా చేరాడు. తనకు దొరికిన ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకొని గ్రంథాలయ వ్యవస్థకు సంబంధించిన ప్రపంచవ్యాప్త ధోరణులను పరిశీలించి, 1924లో క్లాసిఫికేషన్, 1933లో గ్రంథాలయ కేటలాగుల్ని తయారుచేయడానికి ఒక కొత్త కోడ్‌ను రూపొందించాడు. కోలన్ క్లాసిఫికేషన్ అని పిలిచే ఈ వర్గీకరణ పద్ధతిని దేశంలోని అనేక గ్రంథాలయాలు అనుసరిస్తున్నాయి.
భారతదేశంలో అకడమిక్ లైబ్రరీలతోపాటు, పబ్లిక్ లైబ్రరీలలో అభివృద్ధికి, గ్రంథాలయ వ్యవస్థ వికాసానికి విశేషంగా కృషి చేసిన ఎస్.ఆర్ రంగనాథన్ పుట్టినరోజైన ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ దినోత్సవం సందర్భంగా భారతదేశవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి ఎస్.ఆర్ రంగనాథన్ చేసిన సేవలను గుర్తుచేసుకుంటారు. విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వం, చిత్రలేఖనం, క్విజ్ వంటి వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తారు.