హన్మకొండ (సెప్టెంబర్ – 19) : మన చరిత్రను మనమే మర్చిపోతున్న సందర్భంలో సాయుధ పోరాట ఘట్టాలను వీరుల గురించి ఇరవై సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్న గొప్ప వ్యక్తి అస్నాల శ్రీనివాస్ అని పంచాయత్ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ లు అన్నారు.
హన్మకొండ లో జాతీయ సమైక్యత ముగింపు ఉత్సవాల్లో దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, తెలంగాణా గెజిటెడ్ అధికారుల సంఘం ఉపాధ్యక్షుడు ఆస్నాల శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించారు. రాచరిక భూస్వామ్యము నుండి తెలంగాణ విముక్తిలో కమ్యూనిస్ట్ లదే ప్రధాన పాత్ర పోషించారని ఈ విషయాన్ని తన ప్రామాణిక రచనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారని అన్నారు.
దాస్యం వినయ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమకారులకు రాజకీయ సాంస్కృతిక జ్ఞాన చైతన్యం ఇవ్వడంలో దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ విశేష కృషి చేసిందన్నారు. దొడ్డి కొమురయ్య, బందగీ వంటి వీరుల ఊహ చిత్రాలు వేయించి సాయుధ పోరాట చరిత్రను దృశ్యమానం చేసిన ఘనత అస్నాల శ్రీనివాస్ కు దక్కుతుందన్నారు. ఉచిత శిక్షణల ద్వారా వేలాది మంది జీవితాలను తీర్చిదిద్దారని అన్నారు.
పురస్కార గ్రహీత శ్రీనివాస్ మాట్లాడుతూ సమైక్యత ఉత్సవాల పేరిట తెలంగాణా సామాజిక చరిత్రను నూతన తరాలకి అందిస్తూ చరిత్ర నిర్మాణంలో పాల్గొన్న యోధులను వారి వారసులని గౌరవించుకుంటున్న కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వం ప్రత్యేక ప్రశంస పురస్కారం పొందిన ఆస్నాల శ్రీనివాస్ ను టీజీవో అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యదర్శి డా. ప్రవీణ్, సుధీర్, శ్రీధర్, బాలునాయక్ లు అభినందించారు.