Home > ESSAYS > JYOTHIRAO PHULE – మార్గదర్శి, మహనీయుడు జ్యోతిరావుపూలే

JYOTHIRAO PHULE – మార్గదర్శి, మహనీయుడు జ్యోతిరావుపూలే

  • మహత్మ జ్యోతిరావుపూలే వర్థంతి నేడు
  • అడ్డగూడి ఉమాదేవి ప్రత్యేక వ్యాసం

BIKKI NEWS : భారతీయ సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేకి, భారత ప్రథమ సామాజిక తత్వవేత్త, బడుగు బలహీన వర్గాలలో ఆత్మస్థ్యైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడు జ్యోతీరావ్ పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1827 ఏప్రిల్ 11 న జన్మించాడు. పీష్వాల పరిపాలనా కాలంలో పూల వ్యాపారం చేయడం వలన వారి ఇంటి పేరు పూలేగా మార్పు చెందింది. జ్యోతిరావుకి సంవత్సరం వయసు రాకముందే తల్లి మరణించింది. పూలే ఏడు సంవత్సరాల వయసులో ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. పూలేకి పుస్తకపఠనం పట్ల ఆసక్తి మెండు. చదువుపట్ల అతనికి గల ఆసక్తిని గమనించిన ముస్లిం టీచరు, క్రైస్తవ పెద్ద మనిషి జ్యోతీరావుని పై చదువులకు ప్రోత్సహించారు.,1841లో స్కాటిష్ మిషన్ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేరాడు. పూలే చిన్ననాటినుండే ప్రాథమిక సూత్రాలపై జ్ఞానం సంపాదించాడు. శివాజీ, జార్జ్ వాషింగ్టన్ ల జీవిత చరిత్రలు చదవడంవల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవడినవి.

13 ఏల్ల ప్రాయంలోనే పూలేకి 9 సంవత్సరాల సావిత్రితో వివాహం జరిగింది. స్ట్రీలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించిన ఫూలే తన భార్యని చదివిస్తూ, 1848లో అన్ని కులాలవారికి ప్రవేశం కల్పిస్తూ బాలికలకు పాఠశాల స్థాపించగా ఆ పాఠశాలలో బోధించడానికెవ్వరూ ముందుకు రాకపోతె పూలే తన భార్య సావిత్రి సహాయంతో పాఠాలు బోధిస్తూ ఎన్నో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటూ తన స్నేహితులు గోవింద్, వల్వేకర్ ల సహాయంతో 1851- 52 లో మరో రెండు పాఠశాలలు స్థాపించాడు.

ఆనాటి సమాజంలో బాల్య వివాహాలు సర్వ సాధారణముగా జరిగేవి. బాలికలను ముసలివారికిచ్చి వివాహం చేయడంవల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు.-వారు మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి సమాజం అంగీకరించేది కాదు. పూలే వితంతు పునర్వివాహాల గురించి చైతన్యం కల్పిస్తూ వితంతు వివాహాలు జరిపించాడు.

1864లో “బాలహత్య ప్రతిబంధక్ గృహ” స్థాపించి వితంతువులైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచాడు.1872లో ఒక బ్రాహ్మణ వితంతు కుమారున్ని పూలే దత్తత తీసుకున్నాడు. 1873 సెప్టెంబర్ 24 న “సత్యశోధక “సమాజాన్ని స్థాపించి కుల మత వివక్ష లేకుండా ప్రతీ ఒక్కరికీ సభ్యత్వం కల్పించారు. 1877లో సత్యశోధక సమాజం తరుపున “దీనబంధు” వారపత్రిక ప్రారంభించాడు.1873లో “గులాంగిరి” పుస్తకం ప్రచురించి అందులో బ్రాహ్మణుల అమానుష సూత్రాలను, శూద్రులపై బ్రాహ్మణుల క్రూర వైఖరిని తులనాత్మకముగా పరిశీలించాడు. సహపంక్తి భోజనాలనేర్పాటు చేసాడు.

1882 లో విద్యా కమీషన్ విచారణలో దోపిడీకి గురైన కులాలకు విద్యను అందించడంలో సహాయం చేయాలని పూలే పిలుపునిచ్చారు. దాని అమలుకై గ్రామాలలో ప్రాథమిక విద్యను తప్పనిసరి చేయాలని సూచించాడు. ఉన్నత చదువులకై అట్టడుగువర్గాల విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించాలన్నారు. 1883 లో “కల్టివేటర్స్ విప్ కార్డ్ ” (సేద్యగాడి చెర్నాకోల) పుస్తక రచన చేసాడు.1888లో మున్సిపాలిటీ అధ్యక్షునిగా మద్యం షాపులను మూసివేయవలసిందిగా ఉత్తరం రాసాడు. పూలే రాసిన 33 ఆర్టికల్స్ గల సార్వజనిక్ సత్యధర్మ పుస్తకంలో కుటుంబ సృష్టి నియమాలను వివరిస్తూ ప్రపంచాన్నే ఒక కుటుంబంలా భావించాడు. ప్రతీ ఒక్కరికీ సమాన స్వేచ్భ హక్కును తీర్మానించాడు. భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్ర్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు, మహారాష్ట్రలోని సామాజిక సంస్కరణలో క్రియాశీలక పాత్ర పోషించిన మహనీయుడు, మహాత్మునికంటే ముందే మహాత్మునిగా నీరాజనాలందుకున్న పూలే 28/11/1890 లో పరమపదించినా ఇప్పటికీ జనుల హృదయాలలో చిరస్మరణీయులు.

అడ్డగూడి ఉమాదేవి
తెలుగు అధ్యాపకురాలు
9908057980