BIKKI NEWS : బాలగంగాధర తిలక్ (Bal Gangadhar Tilak) ను భారతజాతీయోద్యమ పితగా పేర్కొంటారు. అలాగే ఆయనను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు (Father of India’s unrest) గా భావిస్తారు. ఇతనుకు లోకమాన్య (LokManya) అనే బిరుదు ఉంది.
◆ భారత జాతీయ కాంగ్రెస్ తో సంబంధాలు
తిలక్ 1890లో కాంగ్రెస్ లో సభ్యుడుగా చేరాడు. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని అతను నమ్మాడు. “స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొంది తీరుతాను.” అని తీర్మానించాడు. 1907లో మహారాష్ట్రలోని సూరత్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. మితవాదులు కాంగ్రెస్ పై తమ పట్టును నిలబెట్టుకున్నారు. అతివాదులుగా పిలవబడే తిలక్, అతను మద్దతుదారులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. తిరిగి 1916లో లక్నోలో జరిగిన సమావేశంలో అంతా ఒకటయ్యారు. అదే సమావేశంలో కాంగ్రెస్ కు, ముస్లిం లీగుకు మధ్య లక్నో ఒప్పందం కుదిరింది.
◆ దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపన
తిలక్ పాశ్చాత్యవిద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అది భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని అగౌరవపరచి భారతీయ విద్యార్థులను చిన్నబుచ్చే విధంగా ఉందని, ప్రజలకు మంచి విద్యను అందించడం ద్వారానే వాళ్ళను మంచి పౌరులుగా మార్చవచ్చనే ఉద్దేశం ఆయనది. ప్రతి భారతీయునికి భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నతాన్ని గురించి బోధించాలని ఆయన ఆశయం. అందుకే అగార్కర్, విష్ణుశాస్త్రి చిప్లుంకర్ లతో కలిసి “దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ”ని స్థాపించాడు.
◆ పత్రికల స్థాపన
ఆ తర్వాత తాను నడిపిన పత్రికలు “మరాఠా (ఆంగ్ల పత్రిక)”, “కేసరి (మరాఠీ పత్రిక)” లలో మొద్దు నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పడానికి పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితుల గురించి వివరంగా రాశాడు. బాల్యవివాహాలను నిరసించి వితంతు వివాహాలను స్వాగతించాడు.
◆ శివాజీ, గణపతి ఉత్సవాలు
జాతీయస్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్నీ ఆయన వదిలిపెట్టలేదు. మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం మొదలుపెట్టాడు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897లో ఆయనకు ఒకటిన్నరేళ్ళు కారాగారశిక్ష పడింది. విడుదలయ్యాక అతను స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1906లో దేశద్రోహం నేరం క్రింద ఆయనకు ఆరేళ్ళు ప్రవాసశిక్ష విధించారు.
◆ తిలక్ రచనలు
కారాగారంలో ఉన్నప్పుడే అతను “గీతారహస్యం” అనే పుస్తకం రాశాడు. అతను చరిత్రకారుడు కూడా. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని ఆయన అభిప్రాయం.ఈయన బాగా కష్టపడి రాసిన పుస్తకం చాలా గొప్పది.
◆ హోంరూల్ లీగ్
1916 ఏప్రిల్ లో హోంరూల్ లీగ్‌ని స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్యభారతదేశంలో గ్రామగ్రామానా తిరిగాడు. అనీబిసెంటు అదే సంవత్సరం సెప్టెంబర్‌లో మొదలుపెట్టి హోంరూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఒక కోర్టుకేసులో అతను లండనుకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే, అంటే 1917 ఆగస్టులో అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగు “బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వీలుగా అన్ని పాలనాంశాల్లో భారతీయులకు అధిక ప్రాధాన్యాన్నివ్వడమే ప్రభుత్వ విధానమని” బ్రిటిష్ ప్రభుత్వం తరపున ప్రకటించాడు. బాధ్యతాయుత ప్రభుత్వమంటే ఎవరికి బాధ్యత వహించే ప్రభుత్వమో, అధిక ప్రాధాన్యమంటే ఎంత ప్రాధాన్యమో, అసలు అది ఎప్పుడిస్తారో ఏదీ స్పష్టంగా లేదు. కానీ బ్రిటిష్ ప్రభుత్వ నిజాయితీని నమ్మిన అనీబిసెంటు ఆ ప్రకటనతో ఉద్యమాన్ని ఆపేసి ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించింది. అలా ఇద్దరు నాయకులదీ చెరొకదారీ కావడంతో హోంరూల్ ఉద్యమం చల్లబడిపోయింది. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. అందుకే 1920లో (ఆగస్టు 1వ తేదీ) తిలక్ చనిపోయినప్పుడు జాతీయోద్యమం చుక్కాని లేని నావ అవుతుందని చాలా మంది భయపడ్డారు.