BIKKI NEWS (AUG. 18) : key changes in intermediate education. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు ఇంటర్ విద్యామండలి కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్ తోపాటు పరీక్షల విధానంలోనూ మార్పులు చేయడానికి సిద్ధం అయింది.
key changes in intermediate education
జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ncert) సిలబస్ తో పోల్చితే రాష్ట్ర బోర్డు సిలబస్ ఎక్కువగా ఉందని.. దీన్ని కొంత మేర తగ్గించాలని మండలి భావిస్తోంది. గణితం సబ్జెక్టులో కొంత మేర తగ్గించనున్నారు. ప్రస్తుతం గణితం రెండు పేపర్లుగా ఉంది. సిలబస్ తగ్గించాక రెండు పేపర్లనూ కొనసాగించాలా? లేదా ఒక్క పేపరే ఉంచాలా? అనేదానిపై ఆలోచన చేస్తోంది.
బైపీసీకి సంబంధించి ఎన్సీఈఆర్టీలో జీవశాస్త్రం ఒక్కటే ఉండగా.. రాష్ట్రంలో వృక్ష, జంతుశాస్త్ర సబ్జెక్టులు విడివిడిగా ఉన్నాయి. వీటి విషయం లోనూ ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది.
సీబీఎస్ఈలో 11వ తరగతి బోర్డు పరీక్ష లేదు. అంతర్గత పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ విధానాన్ని రాష్ట్ర బోర్డులోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది? విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందా? అని పరిశీలిస్తోంది.
ఇంటర్మీడియట్లో జనరల్ సబ్జెక్టులతోపాటు ఎలక్టివ్ గా నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య సబ్జెక్టులను పెట్టాలని ఆలోచిస్తోంది.
ఈ కసరత్తు పూర్తి చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలికి కొంత సమయం పట్టనుంది. ఈ మార్పులన్నింటిపైన కళాశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలని భావిస్తోంది. తర్వాత తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించనుంది.