BIKKI NEWS (AUG. 12) : JOBS IN HYDRAA. హైడ్రా (హైదరాబాద్ విపత్తుల స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ)కు నూతనంగా 3 వేల పోస్టుల మంజూరు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి 3 వేల పోస్టులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. అన్నింటినీ నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయడం కాకుండా.. ఇప్పటికే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలిలలో అదనంగా ఉన్న పోస్టులను కొన్నింటిని హైడ్రాకు కేటాయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా అవసరమైన పోస్టులను నేరుగా నియామకాల విధానంలో భర్తీకి మంజూరు చేయాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
JOBS IN HYDRAA
రాష్ట్రంలో ఆయా సంస్థల నుంచి ఎన్ని పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉంది.. అదనంగా కొత్త పోస్టులను ఎన్ని మంజూరు చేయాలనే విషయమై త్వరలో మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తారని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్న 27 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీల పరిధిలోని చెరువులు, నీటి వనరులు, ప్రభుత్వ భూములను ఈ సంస్థ పరిరక్షించాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీనికి ఎందరు ఉద్యోగులు అవసరం.. వారి విధులు, బాధ్యతలు ఎలా ఉండాలి.. ఎన్ని పోస్టులు కొత్తగా మంజూరు చేయాలనే అన్ని అంశాలపై ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే హైడ్రాపై కీలక నిర్ణయాలు ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.