AQI 2023 REPORT – ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక

BIKKI NEWS (MARCH 20) : స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్‌ సంస్థ ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక-2022 (IQ AIR – AQI REPORT 2023) ప్రకారం.. ఘనపు మీటర్‌కు 54.4 మైక్రోగ్రామ్‌ల చొప్పున వార్షిక సూక్ష్మ ధూళి కణాల(పీఎం 2.5) గాఢత ఉన్న దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. 79.9 మైక్రోగ్రామ్‌లతో బంగ్లాదేశ్‌ తొలి స్థానంలో, 73.7 మైక్రో గ్రామ్‌లతో పాకిస్థాన్‌ రెండో స్థానంలో నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా 134 దేశాల్లో ఏర్పాటుచేసిన 30,000 వాయునాణ్యతా ప్రమాణాల స్టేషన్లు, సెన్సార్లు సేకరించిన డేటాను క్రోడీకరించి ఈ నివేదికను తయారుచేసినట్లు ఐక్యూఎయిర్‌ తెలిపింది.

ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంతో నిండిన మెట్రోపాలిటన్‌ ప్రాంతంగా బిహార్‌లోని బెగుసరాయ్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాలో గువాహటి, ఢిల్లీ, పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్‌ నిలిచాయి.

అత్యంత కాలుష్య దేశ రాజధానిగా ఢిల్లీ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. 2018 ఏడాది నుంచి చూస్తే నాలుగు సార్లు మోస్ట్‌ పొల్యూటెడ్‌ క్యాపిటల్‌ సిటీగా ఢిల్లీ తొలిస్థానంలో నిలిచింది.

గత ఏడాది ఘనపు మీటర్‌కు కేవలం 53.4 మైక్రోగ్రామ్‌ల వార్షిక సూక్ష్మధూళి కణాల (పీఎం 2.5) గాఢతతో భారత్‌ 8వ స్థానంలో ఉండగా ఈ ఏడాది మూడో స్థానానికి చేరుకుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక ఘనపు మీటర్‌కు 5 మైక్రో గ్రాములకు మించి సూక్ష్మ ధూళి కణాలు ఉండకూడదు. కానీ భారత్‌లోని 136 కోట్ల ప్రజలు అధిక వాయు కాలుష్యం బారిన పడ్డారని తాజా నివేదిక తెలుపుతుంది.

దేశ జనాభాలో 96 శాతం మంది అంటే 133 కోట్ల మంది డబ్ల్యూహెచ్‌వో పరిమితికి ఏడు రెట్లు మించి కాలుష్యమయ వాతావరణంలో జీవిస్తున్నారు. భారత్‌లోని 66 శాతం నగరాలు సగటున ఘనపు మీటర్‌కు 35 మైక్రోగ్రామ్‌ల ధూళికణాలున్న వాయుకాలుష్యం బారిన పడ్డాయి.

★ ఆసియా 100 నగరాలలో 83 భారత్‌లోనే

ఆసియాలో అత్యంత కాలుష్యమయ 100 నగరాల జాబితా ప్రకటించగా అందులో 83 నగరాలు భారత్‌లో ఉండటం దారుణ పరిస్థితికి దర్పణం పడుతోంది. కొన్ని నగరాల్లో కాలుష్యం డబ్ల్యూహెచ్‌వో పరిమితిని పది రెట్లు దాటేయడం గమనార్హం. కాలుష్యానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 7,800 నగరాలను పరిశీలిస్తే అందులో డబ్ల్యూహెచ్‌వో పరిమితికి లోబడి కేవలం 9 శాతం నగరాలు ఉండటం చూస్తే పరిస్థితి చేయిదాటిపోయిందని అర్ధమవుతోంది.

★ కాలుష్య రహిత నగరాలు ఇవే

ఫిన్లాండ్, ఎస్తోనియా, ప్యూర్టోరీకో, ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్, బెర్ముడా, గ్రెనెడా, ఐస్‌ల్యాండ్, మారిషస్, ప్రెంచ్‌ పాలినేసియా దేశాల్లో మాత్రం వాయు నాణ్యత బాగుంది.