మోడీ ముట్టడిలో మహోన్నత రాజ్యాంగం : అస్నాల శ్రీనివాస్

  • (26 – నవంబర్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా)
  • వ్యాసకర్త : అస్నాల శ్రీనివాస్ (తెలంగాణ ఇంటర్మీడియట్ గెజిటెడ్ అధికారుల సంఘం.)

BIKKI NEWS : మనదేశ రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్‌ 26 ‌రోజున ఇక నుంచి ప్రతి ఏడాది రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని బాబాసాహెబ్‌ అం‌బేద్కర్‌ 125‌వ జయంతిని పురస్కరించుకుని 2015 లో మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకించి విద్యా సంస్థలలో రాజ్యాంగ విలువలు, స్పూర్తిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్దేశించింది. గత ఏడు సంవత్సరాల మోడీ పాలనలో జరుగుతున్నది ఏమిటంటే ‘‘నోటితో నవ్వుతూ, ఉదాత్త వ్యాఖ్యలు పలుకుతూ నొసటితో వెక్కిరించిన చందంగా “రాజ్యాంగం పవిత్ర గ్రంథం రూపొందించిన అంబేద్కర్‌ ‌మహోన్నతుడు’’ అంటూ ఒక పక్క కొనియాడుతూనే మరో పక్క రాజ్యాంగ స్ఫూర్తికి అనువైన నియమాలు, ప్రకరణలను యథేచ్చగా ఉల్లంఘించడం, రాజ్యాంగానికి సమత, మమత, ప్రగతి కాముకత వంటి కీలక విలువలను కల్గించడంలో కీలకపాత్ర వహించిన అంబేద్కర్‌, ‌తోడ్పడిన నెహ్రు వంటి దార్శనికుల కృషిని, చరిత్రను తక్కువ చేసి, విస్మరించే థోరణులు సర్వసాధారణమయ్యాయి.

“ప్రజలతో నడిచే ప్రభుత్వాన్ని కాకుండా ప్రజల కోసం నడిచే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకునేలా చేసి మన మార్గానికి అడ్డంకిగా నిలిచే దుష్ట శక్తులను మనం గుర్తించడంలో బద్ధకించవద్దు” ..అంబేద్కర్అస్నాల శ్రీనివాస్

తరతరాల భారత చరిత్రలో సమాజంలో 90% ఉన్న వర్గాలకు జరిగిన అన్యాయాలు, వివక్షతలు, సుదీర్ఘంగా కొనసాగిన స్వాతంత్రోద్యమంలో పెల్లుబుకిన ప్రజల ఆకాంక్షలు, త్యాగాలు, పోరాటాల నేపథ్యంలో ‘సంక్షేమ రాజ్యం’ హృదయంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. 1776 నాటి అమెరికా స్వాతంత్య్ర ప్రకటన ‘‘మానవులందరూ సమానంగా సృష్టించబడ్డారనీ, మేము విశ్వసిస్తున్నాం”, 1789 నాటి ఫ్రెంచి విప్లవ ప్రకటన ‘‘ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఉత్తేజపూరిత భావాలు జాతీయోద్యమ నాయకులని, లక్షలాది జనహృదయాలను పులకింపచేసాయి. వేల సంవత్సరాలుగా భారతీయ సమాజంలో పరిస్థితులలో సమానత, అవకాశాలలో సమానత, అవసరాలలో సమానత, ఎంపికలో సమానత నిరాకరించబడింది.ఇంకా, ఇకపైన సమానత్వ నిరాకరణ కొనసాగకూడదని, రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యంల ప్రాతిపదికగా సమాజం నిర్మించబడాలనే దృక్పథంతో రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశంలో నెలకొని ఉన్న నైసర్గిక స్వరూపం, భిన్న జాతుల, తెగల, ప్రాంతాల ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని నిబంధనలను రూపొందించారు.

1776 నాటి అమెరికా స్వాతంత్య్ర ప్రకటన ‘‘మానవులందరూ సమానంగా సృష్టించబడ్డారనీ, మేము విశ్వసిస్తున్నాం”, 1789 నాటి ఫ్రెంచి విప్లవ ప్రకటన ‘‘ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆశయాలతో రాజ్యాంగ రూపకల్పన జరిగింది. – అస్నాల శ్రీనివాస్

జులై 22, 1947లో నెహ్రూ రూపొందించిన ‘‘లక్ష్యాల తీర్మానం’’ ఆధారంగా రాజ్యాంగ పీఠికను రూపొందించారు. ఈ పీఠిక స్పూర్తిని ప్రతిఫలింప చేసి నియమ నిబందనలను రాజ్యాంగంలో పొందుపర్చారు. పీఠికలోని తొలి పదం ‘సర్వసత్తాక’ భారతదేశాన్ని స్వతంత్రదేశమని సూచిస్తుంది. వలసగా గాని అధినివేశంగా లేమని ప్రకటిస్తుంది. అంతేగాకుండా రాజ్యం రూపొందించే విధానాలు, పథకాలు స్వదేశి, విదేశి స్వార్థపరులకు కాకుండా అత్యధిక ప్రజల ప్రయోజనాలను నెరవేర్చేవిగా ఉండాలని భావించింది. ‘‘సోషలిస్టు’’ పదం సంపద కేంద్రీకృతం కాకూడదని, ఉత్పత్తి సాధనాలు, ప్రకృతి వనరులు ప్రత్యేకించి ప్రజల మౌలిక ప్రగతికి తోడ్పడే రంగాలన్నింటిని ప్రభుత్వమే నిర్వహించాలని నిర్దేశిస్తుంది. ఉత్పత్తి సాధనాలు జాతీయ సంపదగా మారినప్పుడే సమాజంలోని సభ్యులందరికి సమానావకాశాలు లభిస్తాయి. ప్రాథమిక పరిశ్రమలతో పాటు, కార్పోరేషన్లు, బీమావ్యాపారం కూడా ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలనే భావనలను ‘‘సోషలిస్టు’’ పదానికి అన్వయించారు. ఈ స్పూర్తిని నెహ్రూ, ఇందిరాగాంధీలు ప్రధానులుగా ఉన్న సమయంలో చిత్తశుద్ధితో అమలు చేశారు. జమీందారీలను రద్దు చేసారు. భీమా, బ్యాంకులను జాతీయం చేసారు. బొగ్గు, రవాణా, విద్యుత్‌ ‌వంటి అనేక రంగాలను జాతీయం చేశారు. మతాలను అనుసరించే ప్రజలను సంఖ్యతో నిమిత్తం లేకుండా రాజ్యాంగా గుర్తించాలని ‘‘లౌకిక’’ పదం తెలియచేస్తుంది. విషాదకరమైన అంశం ఏమిటంటే ఇటీవల ప్రార్థనా స్థల వివాదానికి సంబంధించి చారిత్రక వాస్తవాలను ఆధారంగా చేసుకోకుండా మెజారిటీ మతస్థుల విశ్వాసాలకు అణుగునంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చి ‘‘లౌకిక’’ పద స్పూర్తిని దారుణంగా ఉల్లంఘించింది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ద్వారా ప్రభుత్వాలు ఏర్పడాలని ‘‘ప్రజాస్వామ్యం’’, ప్రజల చేతనే రాజాధినేత ఎన్నుకోబడాలని ‘‘గణతంత్రం’’ పదాలు నిర్థేశించాయి.

రాజ్యాంగానికి సమత, మమత, ప్రగతి కాముకత వంటి కీలక విలువలను కల్గించడంలో కీలకపాత్ర వహించిన అంబేద్కర్‌, ‌తోడ్పడిన నెహ్రు వంటి దార్శనికుల కృషిని, చరిత్రను తక్కువ చేసి, విస్మరించే థోరణులు సర్వసాధారణమయ్యాయి. – అస్నాల శ్రీనివాస్

సంఘ్ పరివార్ పాలనకు వచ్చిన ప్రతిసారి రాజ్యాంగ విలువలను ముట్టడిస్తున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చెయ్యాలి, మార్చాలి అనే వీరి రహస్య ఎజెండాను క్రమక్రమంగా బాహాటంగానే అమలు చేస్తున్నారు. కొద్దిమంది సౌఖ్యం కోసం ధీర్ఘకాల బాధలను, విషాదాన్ని సామాన్య ప్రజలు భరించాలనే తత్వశాస్త్రంను కీర్తిస్తూ ప్రభుత్వ పరిశ్రమలు, కార్పోరేషన్ల నుండి పెట్టుబడులను ఉపసంహరిస్తూ ప్రైవేటుపరం చేస్తున్నారు. 1999-2004 కాలంలో, 2014 నుండి కొనసాగుతున్న బిజెపి పాలనలో ‘‘ప్రైవేటీకరణ’’ వేగవంతంగా కొనసాగుతున్నది. స్వతంత్ర భారత తొలి పాలకులు సంక్షేమ రాజ్య భావనను ప్రజల అనుభవంలోకి తీసుకురావటానికి తోడ్పడటానికి స్థాపించిన నవరత్న, మినీరత్న పరిశ్రమలను అనేక వాటిని కారు చౌకగా అమ్మివేస్తున్నారు. భారత అల్యూమినియం కంపెనీ, హిందుస్థాన్‌ ‌జింక్‌, ఇం‌డియన్‌ ‌పెట్రోకెమికల్స్ ‌కార్పోరేషన్‌ ‌వంటి లాభదాయిక కంపెనీలను రిలయన్స్ ‌సంస్థకు అమ్మివేసింది. విదేశి సంచార్‌ ‌నిగమ్‌ ‌లిమిటెడ్‌ను టాటా సంస్థకు అప్పచెప్పింది. ఆయిల్‌ అం‌డ్‌ ‌నేచురల్‌ ‌గ్యాస్‌, ‌హిందుస్థాన్‌ ‌పెట్రోకెమికల్స్ ‌నుండి ప్రభుత్వ వాటాను తగ్గించుకుంది. ఆర్థిక సంస్థల అంచనా ప్రకారం 8 లక్షల కోట్లు ప్రజల సంపదను బిజెపి పాలకులు ప్రవేటుపరం చేశారని తేల్చి చెప్పాయి. ఈ వీర విధ్వంసక జాతీయవాదుల ఉక్కుపాదంలో అణగారిన, మైనారిటీ వర్గాల మౌలిక మానవ హక్కులు, పౌరుల గౌరవ మర్యాదలు ప్రమాదంలో పడ్డాయి.

సంఘ్ పరివార్ పాలనకు వచ్చిన ప్రతిసారి రాజ్యాంగ విలువలను ముట్టడిస్తున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చెయ్యాలి, మార్చాలి అనే వీరి రహస్య ఎజెండాను క్రమక్రమంగా బాహాటంగానే అమలు చేస్తున్నారు. అస్నాల శ్రీనివాస్

జవాబుదారితనాన్ని, పారదర్శకత కోసం ప్రజలకు ఆయుధంగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు రూపొందించిన సమాచార హక్కు చట్టాన్ని, కేంద్ర సమాచార కమీషన్‌ ‌విధి విధానాలను అనేక సవరణలు చేసి బలహీనం చేసాయి. స్వయం ప్రతిపత్తితో పనిచేసే రిజర్వ్‌బ్యాంకును, ఎలక్షన్‌ ‌కమీషన్‌, ‌సి.బి.ఐ. వ్యవహారాలలో తలదూర్చి రాజ్యాంగ స్పూర్తిని అపహాస్యం చేస్తున్నాయి. గోవా, కర్నాటక, మహారాష్ట్ర, అనేక ఈశాన్య రాష్ట్రాలలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఖాతరు చేయకుండా అపసవ్య పద్ధతులలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాజ్యాంగం దేశప్రజలకు కుల, మతాలకు అతీతంగా నచ్చిన వృత్తిని ఎంచుకోవచ్చునని చెప్పింది. నిజాం రాజు సహాయంతో పండిట్‌ ‌మదన్‌మోహన్‌ ‌మాలవీయ స్థాపించిన బెనారస్‌ ‌హిందు విశ్వ విద్యాలయంలో సంస్కత ఆచార్యునిగా ఎంపికైన ఫిరోజ్‌ఖాన్‌ అనే ముస్లిం ప్రొఫెసర్‌ను విధులను నిర్వర్తించకుండా కొందరు అడ్డుకుని పెద్ద గొడవ చేశారు. విద్యాలయాలలో జాతీయపతాకం తప్ప మతపరమైన పతాకాలు ఉండకూడదని, తొలగించిన ఉద్యోగినితో బలవంతంగా రాజీనామా చేయించారు.

జవాబుదారితనాన్ని, పారదర్శకత కోసం ప్రజలకు ఆయుధంగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు రూపొందించిన సమాచార హక్కు చట్టాన్ని, కేంద్ర సమాచార కమీషన్‌ ‌విధి విధానాలను అనేక సవరణలు చేసి బలహీనం చేసాయి. – అస్నాల శ్రీనివాస్

దేశంలో ఆకలి, ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణ సూచికలలో అథమస్థానానికి చేరుకున్నాయి. నిరుద్యోగ రేటు పెరిగిపోయింది. పెరిగిన అసమానతలతో తీవ్ర అశాంతి, అంతర్యుద్ధం అంచుకు దేశం నెట్టివేయబడుతున్నది. – అస్నాల శ్రీనివాస్

చరిత్రకు, పురాణాలకు వ్యత్యాసం లేకుండా పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు. సైన్స్‌కు, ఇతిహాసాలకు ముడిపెడుతూ వైజ్ఞానిక థృక్పథాన్ని ఆచరించాలనే రాజ్యాంగ విధికి తిలోదకాలు ఇస్తున్నారు. పీడిత వర్గాల వారిని మరిపించడానికి పునరుద్ధరణ వాదాన్ని ఒక సాధనంగా వ్యాప్తి చెందిస్తున్నారు. రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు దానికి ‘‘ పవిత్ర గ్రంథం’’ హోదాను నిర్మించిన అంబేద్కర్‌ ‌గానీ, జాతీయోద్యమ నాయకులు గానీ ఇవ్వలేదు. భవిష్యత్‌లో పాలకులు రాజ్యాంగ ప్రవేశిక స్ఫూర్తికి ఏ మాత్రం భంగం కల్గకుండా సవరణలు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రవేశిక పవిత్రత, ఉదాత్తతను మంటగలుపుతూనే రాజ్యాంగం పవిత్ర గ్రంథమని నరేంద్రమోడి మాట్లాడుతున్నాడు.

సైన్స్‌కు, ఇతిహాసాలకు ముడిపెడుతూ వైజ్ఞానిక థృక్పథాన్ని ఆచరించాలనే రాజ్యాంగ విధికి తిలోదకాలు ఇస్తున్నారు. పీడిత వర్గాల వారిని మరిపించడానికి పునరుద్ధరణ వాదాన్ని ఒక సాధనంగా వ్యాప్తి చెందిస్తున్నారు. – అస్నాల శ్రీనివాస్

నవంబర్‌ 26,1949‌లో రాజ్యాంగ ఆమోదం పొందిన సందర్భంలో అంబేద్కర్‌ ‌తీవ్రమైన హెచ్చరిక చేశాడు ‘‘ 1950 జనవరి 26న పరస్పర వైరుద్యాలతో కూడిన జీవనంలోకి మనం ప్రవేశించబోతున్నాము. ఒక మనిషి ఒక ఓటు, ఒక విలువ అనే సూత్రాన్ని రాజకీయాలలో మనం గుర్తించబోతున్నాము. కానీ మన సామాజిక, ఆర్థిక జీవనంలో ఈ సూత్రాన్ని నిరాకరించడాన్ని కొనసాగిస్తాము. పరస్పర మైరుధ్యాలతో కూడిన ఈ జీవనాన్ని, సమానతను నిరాకరించడాన్ని ఎంతకాలం మనం కొనసాగిస్తాము. మనం ఎక్కువ కాలం కొనసాగిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యానికి హాని కల్గుతుంది. ఈ పరస్పర వైరుధ్యాన్నవీలైనంత వరకు తొలగించనట్లయితే ఈ రాజ్యాంగ సభ ఎంతగానో శ్రమించి నిర్మించినటువంటి రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానత్వం వల్ల బాధపడేవారు తుత్తునియలు చేస్తారు.

1950 జనవరి 26న పరస్పర వైరుద్యాలతో కూడిన జీవనంలోకి మనం ప్రవేశించబోతున్నాము. ఒక మనిషి ఒక ఓటు, ఒక విలువ అనే సూత్రాన్ని రాజకీయాలలో మనం గుర్తించబోతున్నామని అంబేద్కర్ తెలిపారు – అస్నాల శ్రీనివాస్

ప్రస్తుత పాలకుల కాలంలో ప్రజాస్వామ్యము ఒక రూపంగా ఉంది కాని సారంలో నియంతృత్వ ధోరణులను కొనసాగిస్తున్నది. ఏకపక్షంగా ఒక పార్టీకి అత్యధిక స్థానాలు ఇస్తే వచ్చే దుష్ఫలితము అని ఆనాడే అంబేద్కర్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో దేశంలో ఆకలి, ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణ సూచికలలో అథమస్థానానికి చేరుకున్నాయి. నిరుద్యోగ రేటు పెరిగిపోయింది. పెరిగిన అసమానతలతో తీవ్ర అశాంతి, అంతర్యుద్ధం అంచుకు దేశం నెట్టివేయబడుతున్నది. రాజ్యాంగ లక్ష్యాల అమలు చేయించడంలో స్వాతంత్రోద్యమ నేతల, సామాజిక విప్లవనేత అంబేద్కర్‌ ‌తాత్వికతను కరిగిపోనీయకుండా, ఒక స్వప్నంగా మిగలకుండా వాస్తవం చేయడానికి ప్రయత్నించే బాధ్యత పౌరసమాజానిదే. మహనీయుల కృషి, త్యాగాల స్మతి రాజ్యాంగ విలువలను,నైతికతను రక్షించడంలో , సజీవంగా కొనసాగించడంలో ప్రయోజనం పొందిన విద్యావంతులు, ఉద్యోగులు ప్రజాస్వామికవాదులు అగ్రగామిగా కదలాల్సిన తరుణం కూడా ఇదే.

మహనీయుల కృషి, త్యాగాల స్మతి రాజ్యాంగ విలువలను,నైతికతను రక్షించడంలో , సజీవంగా కొనసాగించడంలో ప్రయోజనం పొందిన విద్యావంతులు, ఉద్యోగులు ప్రజాస్వామికవాదులు అగ్రగామిగా కదలాల్సిన తరుణం కూడా ఇదే. – అస్నాల శ్రీనివాస్

అస్నాల శ్రీనివాస్, ప్రిన్సిపాల్
సమ్మక్క సారక్క ప్రభుత్వ జూనియర్ కళాశాల
తాడ్వాయి. ములుగు జిల్లా
తెలంగాణ ఇంటర్మీడియట్ గెజిటెడ్ అధికారుల సంఘం
9652275560