Constable Result : ఫలితాలు మళ్లీ ప్రకటించాలంటూ హైకోర్టు కీలక తీర్పు

  • సివిల్ కానిస్టేబుల్ పోస్టులపై హైకోర్టు తీర్పు

హైదరాబాద్ (అక్టోబర్ 10) : సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ప్రశ్నలను తొలగించాకే పరీక్ష పత్రాల మూల్యాంకనం జరిపి, అర్హుల జాబితాను ప్రకటించాలని జస్టిస్ పి మాధవీదేవి సోమవారం తీర్పు చెప్పారు.

తెలంగాణలో 4.965 సివిల్ కానిస్టేబుళ్ల నియామకానికి
పోలీసు నియామక మండలి గతేడాది ఆగస్టు 30న తుది రాత పరీక్షను నిర్వహించిన విషయం విదితమే. అనువాద, ముద్రణా లోపాల వల్ల ఆ ప్రశ్నాపత్రంలో కొన్ని ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, వాటిని తొలగించాలన్న విన్నపాన్ని అధికారులు పట్టించుకోలేదని పలువురు అభ్యర్థులు విడివిడిగా హైకోర్టులో 6 పిటిషన్లు దాఖలు చేశారు.తప్పుగా వచ్చిన ప్రశ్నలను తొలగించి. పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేసేలా ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోరారు.

దీనిపై ప్రభుత్వంతరపు న్యాయవాది స్పందిస్తూ.. పిటిషనర్లు చెప్తున్న ప్రశ్నల్లో మూడింటికి ఇచ్చిన ఐచ్ఛికాలు ఇంగ్లిష్ లోని వాడుక పదాలేనని, అందరూ వాటినే విరివిగా వాడుతున్నారని తెలిపారు. మరో ప్రశ్నలోముద్రణా లోపం వల్ల ఓ అక్షరం తప్పుగా వచ్చిందని పేర్కొన్నారు. ఇవి అంతగా పట్టించుకోవాల్సిన అంశాలు కావని,పిటిషనర్ల వ్యాజ్యాలను కొట్టివేయాలని విన్నవించారు.

దీంతో ఆ ప్రశ్నపత్రంలోని నంబర్ 57, 122, 130,144 ప్రశ్నలను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే పరీక్ష పత్రాలమూల్యాంకనం జరిపి తాత్కాలిక ఎంపిక జాబితాను ప్రకటించాలని, అనంతరం నియామక ప్రక్రియను కొనసాగించాలని స్పష్టం చేసింది.