BIKKI NEWS (APRIL 12) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం గృహ జ్యోతి కింద గృహలకు 200 యూనిట్ ల ఉచిత విద్యుత్తు ఇచ్చే పథకానికి కొత్త లబ్ధిదారుల నమోదు ప్రక్రియను (free current scheme applications stopped due to election code) ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేశారు. కోడ్ ముగిసిన తర్వాత మళ్లీ నూతన దరఖాస్తులను స్వీకరించి అమోదించనున్నట్లు ‘విద్యుత్ పంపిణీ సంస్థ’ (డిస్కం)లు స్పష్టం చేశాయి.
‘గృహజ్యోతి’ పథకం కింద గత నెలలో మొదటిసారి 36 లక్షల ఇళ్లకు జీరో కరెంటు బిల్లులు జారీ అయ్యాయి. మరో 7 లక్షల ఇళ్ల కనెక్షన్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జారీ చేయాల్సి ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల సాధ్యం కాలేదు. వీటితో కలిపి రాష్ట్రంలో తొలి నెల 43 లక్షల మందికి ఈ పథకం కింద అర్హత లభించింది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నందున మిగిలిన వారు తమపేరు కూడా నమోదు చేయాలని దరఖాస్తులిస్తున్నా.. ఎన్నికల కోడ్ కారణంగా నమోదు ప్రక్రియను నిలిపివేశారు. గత నెలలో జీరో బిల్లు జారీ అయిన 36 లక్షల మందికి ఈ నెలలోనూ యథావిధిగా పథకాన్ని వర్తింపజేస్తున్నారు. వీరి బిల్లుల మొత్తం సొమ్ము రూ.125 కోట్ల దాకా ఉంది. దీంతో పాటు ఏప్రిల్ నెల అవసరాలకు కూడా కలిపి రాయితీ పద్దు కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు డిస్కంలకు తాజాగా విడుదల చేసింది.