BIKKI NEWS (AUG. 27) : DSC 2008 Postings within 15 days in telangana. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని 2008 – డీఎస్సీ బాధితులు సోమవారం హైదరాబాద్ లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి భారీగా తరలివచ్చారు.
DSC 2008 Postings within 15 days in telangana
డీఎస్సీ – 2008 సాధన సమితి నేతృత్వంలో 200మందికి పైగా అభ్యర్థులు సీఎం ఇంటికి చేరుకోగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం ఆరుగురిని సీఎం ఇంట్లోకి అనుమతించారు. సీఎం వ్యక్తిగత కార్యదర్శి జైపాల్‌రెడ్డి వారితో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా డీఎస్సీ 2008 బాధితులు మాట్లాడుతూ.. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 8న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో గత మార్చి14న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో డీఎస్సీ బాధితులకు ఏపీ తరహాలో ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు గుర్తు చేశారు.
ఈ నెల 27 నాటికి నియామక ప్రక్రియ పూర్తిచేస్తామని, చివరి అవకాశం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టు ధర్మాసనానికి తెలిపారని, ఈ గడువు నేటితో ముగియనున్నట్టు వివరించారు. అనంతరం సీఎంవో అధికారులు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంతో మాట్లాడి వివరాలు సేకరించారు. వారం రోజుల్లో క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక తీసుకొని, 15రోజుల్లో నియామక ప్రక్రియ పూర్తిచేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్టు డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సభావత్ శ్రీనివాస్‌నాయక్ తెలిపారు.