CONSTABLE JOBS : పకడ్బందీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్

హైదరాబాద్ (అక్టోబర్ – 08) : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) కానిస్టేబుళ్ల అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో తదుపరి చర్యలపై దృష్టి సారించింది.

ఎంపికైన అభ్యర్థుల ప్రవర్తన, పూర్వాపరాలు పరిశీలనతో పాటు వైద్యపరీక్షలు జరగాల్సి ఉంది. ఎంపికైన అభ్యర్థులు ముందుగా తమ ధ్రువీకరణపత్రాలపై గెజిటెడ్ అధికారుల సంతకాలతో కూడిన అటెస్టేషన్ పత్రాలను ఈనెల 13లోగా సమర్పించాల్సి ఉంది.

ఇదేసమయంలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్దుల ధ్రువపత్రాల పరిశీలన జరిగిన 18 కేంద్రాల నుంచి ఆయా యూనిట్ల అధికారులు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను తెప్పించుకోనున్నారు. ముందుగా సమర్పించిన పత్రాలతో అటెస్టేషన్ పత్రాలను సరిపోల్చి పరిశీలించడంతో పాటు అభ్యర్థులకు ఏదైనా నేరచరిత్ర ఉందా..? అనేది తనిఖీ చేయనున్నారు. ఈ ప్రక్రియ అంతా స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పోలీసుల పర్యవేక్షణలో జరగనుంది.

12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళ అభ్యర్థులకు సంబంధించి ఎస్బీ విచారణ ప్రక్రియను త్వరితగతిన చేపడితే నవంబరు 20 వరకు కొనసాగే ఆస్కారం ఉండడంతో ఆ తర్వాతే కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి