డిగ్రీ చదువుతోపాటు – 10 వేల జీతం

హైదరాబాద్ (ఏప్రిల్ – 25) : విద్యార్థులు డిగ్రీ చదువుతూనే నెలకు పది వేలు సంపాదించే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించనున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్కిల్ డెవలప్మెంట్ కోర్సు లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 1,054 డిగ్రీ కాలేజీలుండగా, అత్య ధిక అడ్మిషన్లున్న 103 కాలేజీల్లో ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నది. ఇందులో 37 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుండగా, 66 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలున్నాయి. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఈ దిశగా చేపట్టిన చొరవతో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.

సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సహకారంతో ఈ కోర్సులను నిర్వహిస్తారు. ఈ కోర్సులను ప్రవేశపెట్టడం సహా నిర్వహణపై సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి.. ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, మహత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ మహిళా వర్సిటీల వీసీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 28న మరోమారు సమావేశమై, పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ తయారుచేయాలని నిర్ణయించారు.

★ అమలు ఇలా..

సంబంధిత సెక్టార్లోని పరిశ్రమలతో సెక్టార్ స్కిల్ కౌన్సిల్, సంబంధిత కాలేజీలు పరస్పరం ఎంవోయూను కుదుర్చుకొంటాయి. ఇందుకు వర్సిటీలు చొరవ తీసుకుంటాయి.

సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ద్వారా మొత్తం 13 రకాల స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అందుబాటులో ఉండగా, రాష్ట్రంలో 10 రకాల కోర్సులను ప్రవేశపెడతారు.

ఒక కాలేజీలో ఒక కోర్సుకే అనుమతినివ్వనుండగా, గరిష్ఠంగా 60 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకుంటారు.

విద్యార్థులు మూడు రోజుల పాటు కాలేజీలో, మిగిలిన మూడు రోజులు పరిశ్రమలో ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. అంటే పరిశ్రమలో 15 రోజులు పనిచేస్తే నెలకు రూ.10 వేల వేతనం ఇస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత ప్లేస్మెంట్స్ కల్పిస్తారు.

బీకాం, బీబీఏ విద్యార్థులకు రిటైలింగ్, ఈ కామర్స్ ఆపరేషన్స్, లాజిస్టిక్స్ కోర్సుల్లో ఏదైనా ఒకదానిని కాలేజీలో అనుమతిస్తారు.

బీఏ విద్యార్థుల కోసం కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కోర్సులను నిర్వహిస్తారు.

బీఎస్సీ విద్యార్థులకు ఫార్మా, యానిమేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోర్సులను నిర్వహిస్తారు.