వన్యప్రాణుల సంరక్షణలోనే మానవ గ్రహ మనుగడ – అస్నాల శ్రీనివాస్

  • మార్చి – 3 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం


BIKKI NEWS : మార్చి 3, 1973లో అంతర్జాతీయ జీవ రక్షణ సమితి నేతృత్వంలో జరిగిన సదస్సులో “అంతరించిపోతున్న మరియు వృక్ష జాతులు అంతర్జాతీయ వాణిజ్య నిరోధం” పై ప్రపంచ దేశాలు సంతకం చేశాయి. దీనిని పురస్కరించుకొని డిసెంబర్ 20 ,2013 న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం “మార్చ్ 3 ను ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం”గా జరుపుకోవాలని నిర్ణయించింది. అప్పటినుండి వన్యప్రాణులకు సంరక్షణకు అంకితమైన మార్చ్ 3, కరోనా మహమ్మారి విలయ సందర్భంలో ఇప్పుడు అతి ముఖ్యమైన వార్షిక కార్యక్రమంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల ప్రజల జీవనోపాధిని కాపాడడంలో అడవులు, అటవీ జాతులు మరియు ఆవరణ వ్యవస్థ సేవలు యొక్క ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఈ అంశాన్ని ప్రజలకు తెలియజేసి చైతన్య పరచడానికి ఈ మార్చి 3ను ” అడవులు మరియు జీవనోపాధి మనుషులను భూగ్రహాన్ని నిలబెట్టడం” అనే ఇతివృత్తం తో వన్యప్రాణుల దినోత్సవం జరుపుతున్నారు. అడవులలో, అడవుల సమీపాన నివసిస్తున్న ఆదివాసులు, స్థానిక సమాజాలను కాపాడడం కోసం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి లక్ష్యాలలో పేదరికం నిర్మూలించడం, బాధ్యతాయుతమైన వినియోగం, వాతావరణ కార్యాచరణ, భూతల జీవ పరిరక్షణ మొదలగు వాటిపై పాలకులకు, పాలితులకు అవగాహన ఏర్పరచడం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 200 నుండి 350 మిలియన్ల మంది ప్రజలు అటవీ ప్రాంతాలలో లేదా దాని ప్రక్కనే నివసిస్తున్నారు. వారి జీవనోపాధి కోసం అటవీ మరియు అటవీ జాతులు అందించే వివిధ ఆవరణ వ్యవస్థ సేవలపై ఆధారపదుతున్నారు. ఆహారం, ఆశ్రయం, శక్తి మరియు ఔషదాలతో సహా వారి అత్యంత ప్రాధమిక అవసరాలను అడవులు తీరుస్తున్నాయి. మానవులు మరియు అటవీ, అటవీ నివాస వన్యప్రాణుల జాతులు మరియు అందించే పర్యావరణ వ్యవస్థ సేవలకు మధ్య సహజీవన సంబంధంలో ఆదివాసుల ప్రజలు మరియు స్థానిక సమాజాలు ముందంజలో ఉన్నాయి.. ప్రపంచంలోని భూ ఉపరితలంలో సుమారు 28% ప్రస్తుతం ఆదివాసీ ప్రజలచే నిర్వహించబడుతుంది, వీటిలో భూమి మీద పర్యావరణపరంగా చెక్కుచెదరకుండా ఉన్న కొన్ని అడవులు ఉన్నాయి. ఈ ప్రదేశాలు ములవాసుల, స్థానిక సమాజాల ఆర్థిక మరియు వ్యక్తిగత శ్రేయస్సుకు మాత్రమే కాకుండా, వారి సాంస్కృతిక గుర్తింపులకు కూడా కేంద్రంగా ఉన్నాయి.

అడవులు, అడవుల జాతులు మరియు వాటిపై ఆధారపడిన జీవనోపాధి ప్రస్తుతం మానవ దురాశ, పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద లాభ ఆపేక్ష, విస్తరణ విధానాలతో అటవీ సంపద తరగడం, కాలుష్యకాలు పెరగడం వలన వాతావరణ మార్పు, జీవవైవిధ్య నష్టం జరుగుతున్నది. ప్రస్తుతం COVID-19 మహమ్మారి ప్రభావంతో మానవ ఆరోగ్యం, సామాజిక మరియు ఆర్ధిక సంక్షోభాలతో భూగ్రహం అనేక విపత్తుల కూడలిలో ఉన్నది.

మార్చి 3 – 2021 న, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం అటవీ ఆధారిత జీవనోపాధిని పటిష్టం చేయడానికి మరియు అటవీ మరియు అటవీ వన్యప్రాణుల నిర్వహణ మెరుగు పరచడానికి ఆయా దేశాలు కృషి చేయాలి. అడవుల దీర్ఘకాలిక పరిరక్షణ, అటవీ నివాస జాతుల అడవి జంతుజాలం ​​మరియు వృక్షజాలం మరియు అవి కొనసాగించే పర్యావరణ సేవలలోనే మానవ శ్రేయస్సు ఉందనే జ్ఞానాన్ని సమాజంలోని సమస్త వర్గాల ప్రజలకు తెలియపర్చాలి. జీవ రక్షణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలి. ప్రతి మనిషి నిత్య జీవితములో నిర్వహించే చిన్న చిన్న చర్యలు వన్యప్రాణుల రక్షణ పై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. వన్య ప్రాణుల శరీర భాగాలతో తయారైన వస్తువులను వినియోగించకపోతే అది ఫరోక్షంగా ప్రాణుల రక్షణకు తోడ్పడి వాటి అక్రమ రవాణా అరికట్టబడుతుంది. ఆపదలో ఉన్న వన్యప్రాణులను రక్షించే చర్యలు, యాత్రా స్థలాలుగా ఉన్న అటవీ ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం, ఆయా ఆవాసాల గురించి యాత్రికులకు చెప్పడం వంటి చర్యలతో వన్యప్రాణుల సంరక్షణకు దోహదం చేస్తుంది. ఆయా దేశ పాలకులు సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి విధానాల అమలు చేయాలి.,ప్రజలు పర్యావరణ అనుకూల జీవన విధానాలు పాటించాలి. అప్పుడు మాత్రమే సమస్త జంతు, వృక్షజాలం కాపాడబడుతాయి. అవి మానవునికి ఆరోగ్యాన్ని, భూగ్రహనికి స్వస్థతను చేకూరుస్తాయి.

వ్యాసకర్త ::


అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం