Home > TELANGANA > Vibrant Telangana 2050 : మూడు ప్రాంతాలుగా తెలంగాణ అభివృద్ధి

Vibrant Telangana 2050 : మూడు ప్రాంతాలుగా తెలంగాణ అభివృద్ధి

BIKKI NEWS (MARCH 09) : తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం త్వరలోనే వైబ్రంట్‌ తెలంగాణ 2050 మెగా మాస్టర్‌ ప్లాన్‌ (Vibrant Telangana 2050 mega master plan) ప్రకటించబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‍ప్రకటించారు. మొత్తం తెలంగాణను మూడు విభాగాలుగా సమాన అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఎల్బీనగర్ బైరామల్‌గూడ చౌరస్తాలో కొత్తగా నిర్మించిన రెండో ఫ్లైఓవర్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, వైబ్రంట్‌ తెలంగాణపై కీలక అంశాలను ప్రస్తావించారు.

ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, పంచాయతీలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తెచ్చి అర్బన్‌ తెలంగాణగా, 354 కి.మీ మేరకు ఓఆర్‌ఆర్‌ నుంచి ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా, అక్కడి నుంచి తెలంగాణ సరిహద్దు ప్రాంతం వరకు రూరల్‌ తెలంగాణగా రాష్ట్రాన్ని మొత్తం మూడు విభాగాలుగా (Urban Telangana, Sub Urbam Telangana, Rural Telangana) సమగ్రాభివృద్ధి ప్రణాళికలు రూపొందించబోతున్నట్టు చెప్పారు.

వైబ్రంట్‌ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్‌ కోసం అంతర్జాతీయ కన్సల్టెన్సీని నియమించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఆ ప్రణాళిక వచ్చిన తర్వాత ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసి ఆ మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేస్తామన్నారు.

హైదరాబాద్ నగరం చుట్టూ అన్ని ప్రాంతాల్లో సమానమైన అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష‍్యం.
మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ కింద అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీని అభివృద్ధి చేస్తాం.

నగరం నలుమూలల్లో అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతోనే మెట్రో మార్గాన్ని విస్తరించే ప్రణాళికలు రూపొందించాం.

ఉప్పల్‌ నుంచి నాగోల్‌, ఎల్బీనగర్‌, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి మీదుగా విమానాశ్రయం వరకు, బీహెచ్‌ఈఎల్‌ నుంచి రామచంద్రాపురం వరకు, గచ్చీబౌలీ నుంచి అమెరికన్ కాన్సులేట్‌ వరకు మెట్రో విస్తరించబోతున్నామని తెలిపారు