WRIT PETITIONS : కోర్టులు జారీ చేసే రిట్లు పూర్తి వివరణ

BIKKI NEWS : న్యాయ వ్యవస్థ కు రాజ్యాంగం కొన్ని ప్రత్యేక అధికారులను ఇచ్చింది. అధికారులు, కింద న్యాయ స్థానాలు తమ విధులను సక్రమంగా నిర్వహించనప్పుడు వాటిని సరిచేయడానికి కోర్టులకు ఉన్న ప్రత్యేక అధికారాలను రిట్ల (court writ petitions) రూపంలో జారి చేస్తాయి.

★ హెబియస్ కార్పస్ :- చట్ట విరుద్ధమైన నిర్బంధానికి వ్యతిరేకంగా ఈ రిట్ జారీ చేస్తారు. నిర్బంధంలో ఉన్న వ్యక్తి నిర్దోషి అని రుజువైతే అతణ్ని విడుదల చేస్తారు. క్రిమినల్ నేరాల ఆరోపణలపై మాత్రం ఈ రిట్ జారీ చేయరు.

★ మాండమస్ :- ఏదైనా ప్రభుత్వ సంస్థ/ ప్రభుత్వ అధికారి తన విధిని సక్రమంగా నిర్వహించనప్పుడు నిర్వహించాలని ఆదేశిస్తూ జారీ చేసే రిట్.

★ ప్రొహిబిషన్ :- దిగువ కోర్టు తన పరిధిలో లేని కేసుల విచారణను నిలిపివేయాలని ఆదేశించడం. కింది కోర్టులు తమ పరిధిని అతిక్రమించకుండా నిరోధించడమే ఈ రిట్ ఉద్దేశం.

★ సెర్షియోరరి :- ఏదైనా దిగువ కోర్టు తన పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పు చెప్పినపుడు ఆ తీర్పును రద్దు చేసి కేసును పై స్థాయి కోర్టుకు బదిలీ చేయమని ఇచ్చే ఆదేశం.

ప్రొహిబిషన్, సెర్షియోరరీ రిట్లు రెండూ దిగువ కోర్టులు తమ పరిధిని ఉల్లంఘించకుండా నిరోధించడానికి ఉద్దేశించినవి అయినప్పటికీ రెంటికీ కొద్ది తేడా ఉంది.

కేసు ప్రారంభంలోఉంటే ప్రొహిబిషన్ రిట్, తీర్పు వెలువడిన తర్వాత సెర్షియోరరి రిట్ ను జారీ చేస్తారు. సెర్షియోరరీ రిట్ దిగువ కోర్టులను నియంత్రించడమేకాక, అవి చేసిన తప్పిదాలను కూడా సరి చేస్తుంది. ప్రొహిబిషన్ రిట్ కేసులను నిలిపి వేస్తుంది.

★ కో వారెంటో :- ఉన్నత పదవిని అధిష్టించనున్న ఒక వ్యక్తి ఆ పదవికి అర్హుడు కాదని కోర్టు భావించినట్లయితే అతణ్ని నిరోధించడం ఈ రిట్ ప్రధాన ఉద్దేశం.