BIKKI NEWS (MARCH 25) : టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకం వేతన సవరణలో భాగంగా 43.2 శాతం కరువు భత్యం(TS RTC EMPLOYEES DA 42.3%) ఖరారైంది. వేతన సవరణ అనంతరం ఉండే మూలవేతనంపై అంతమేర కరువు భత్యాన్ని లెక్కించి జీతంలో భాగంగా చెల్లించనున్నారు.
ఇంటి అద్దె అలవెన్స్ (HRA) భారీగా తగ్గిపోవటంతో కొత్త జీతం ఆశించిన స్థాయిలో పెరగలేదని ఉద్యోగులు కొంత ఆందోళనతో ఉన్నారు. కానీ, ఇప్పుడు మెరుగైన కరువు భత్యం అందనుండటంతో వేతనం పెరగనుంది.
ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగుల డీఏ 82.6 శాతం ఉంది. ఇప్పుడు 2017 ఏప్రిల్ నాటి వేతన సవరణను అమలులోకి తెస్తున్నందున, అప్పటికి ఉన్న 31.1 శాతం డీఏ ఉద్యోగుల మూల వేతనంలో కలిసి పోతుంది. అది పోయిన తర్వాత 51.5 శాతం డీఏ ఉంటుంది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మూలవేతనంపై లెక్కించరని తెలుస్తోంది. వేతన సవరణ పద్ధతిలో భాగంగా దాన్ని న్యూట్రలైజ్ చేసి కొత్త డీఏను ఖరారు చేస్తారు. ఆ లెక్క ప్రకారం.. తాజా డీఏ 43.2 శాతంగా తేలింది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ నాలుగు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. కానీ ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం అన్ని విడతల డీఏలు చెల్లించటం విశేషం. 2024 జనవరి విడతకు సంబంధించి 3.9 శాతాన్ని తాజా వేతన సవరణలో భాగంగా చెల్లించనుండటం విశేషం. గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఏకంగా ఏడు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయి ఉండేవి. అయితే కార్మిక సంఘాల ఒత్తిడి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కృషి ఫలితంగా తక్కువ సమయంలోనే ప్రభుత్వం డీఏ బకాయిలను చెల్లించింది. కొన్ని విడతలు మిగిలి ఉండగా, గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం వాటిని కూడా ప్రకటించింది. దీంతో మొత్తం బకాయిలు క్లియర్ అయి ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు తాజా విడత కరువు భత్యం కూడా అందబోతోంది.