Conjunctivitis – కండ్ల కలక లక్షణాలు, నివారణ

BIKKI NEWS : Conjunctivitis – pink eye అనే పేరులతో కండ్ల కలక ను పిలుస్తుంటారు. ఇది ఒక అంటు వ్యాధి. వర్షకాలంలో వచ్చే సీజనల్ వ్యాధి ఇది.

◆ వ్యాధి లక్షణాలు

వ్యాధిగ్రస్తుల కళ్ళు ఎరుపెక్కి, నీరు కారుతూ ఉంటాయి. కంటిరెప్పలు ఉబ్బి ఉండవచ్చును. కళ్ళలో మంట, నొప్పి, కొద్దిపాటి దురద ఉంటాయి. వెలుతురు చూడటం కష్టం. కళ్ళలో పుసులు పడతాయి. ఈ లక్షణాలు ఒక కంటిలో ప్రారంభమై రెండవ కంటికి వ్యాపించవచ్చును. నిద్ర తరువాత కళ్ళరెప్పలు అంటుకొని తెరవడం కష్టమౌతుంది. ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెంది ఎపిడెమిక్ రూపం దాలుస్తుంది. పొంగు వ్యాధిలోను, సుఖవ్యాధులతోను బాధపడే గర్భవతులకు పుట్టిన బిడ్డలకు కూడా కండ్లకలక సోకే అవకాశాలున్నాయి.

◆ జాగ్రత్తలు

కండ్ల నుండి కారే నీటిని, స్రావాన్ని శుభ్రమైన తడిబట్టతో శుభ్రపరచాలి. రోగి వాడే బట్టలు, పక్క బట్టలు, తువ్వాళ్ళు మొదలైన వాటికి కళ్ళ రసి అంటి వాటిని ఇతరులు వాడితే వ్యాధి వారికి సోకుతుంది. కనుక రోగి బట్టలను ప్రతిరోజు నీటితో ఉడికించి క్రిమిరహితం చెయ్యాలి. రోగి కళ్ళను శుభ్రపరచిన దూది లేక బట్ట ముక్కలను వేరే పోగుచేసి కాల్చివేయడం మంచిది. సొంత వైద్యానికి దిగుతూ బాధితులు స్టెరాయిడ్లు వాడుతుండటంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టెరాయిడ్ వాడకంతో తాత్కాలికంగా ఉపశమనం దక్కినా దీర్ఘకాలంలో హాని జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.